ఒక సంక్షోభం నుంచి మరో సంక్షోభం లోకి, ఒక విపత్తు నుంచి మరో విపత్తులోకి, ఒక భయం నుంచి మరో భయం లోకి ప్రయాణిస్తోంది భారత దేశం. ప్రజాస్వామిక విలువల ఆధారంగా నడవవలసిన పాలనా వ్యవస్థలన్నీ ఒక్కొక్కటిగా మన కళ్లముందే కూలిపోతున్నాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. దీనితో మానవ హక్కుల హరణం జరుగుతూ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ సందర్భంలో బాలగోపాల్‌ పదేపదే స్ఫురణకు వస్తున్నారు. సిద్ధాంత, కార్యాచరణల మేలు కలయిక అయిన హక్కుల కార్యకర్త బాలగోపాల్‌ మనల్ని వీడి పదేళ్లయింది. ఈ పదేళ్లుగా ఆయన లేని లోటును అనుక్షణం గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. ఆయన సునిశిత విశ్లేషణా శక్తినీ, స్ఫూర్తిదాయకమైన కార్యాచరణనూ కోల్పోయినందుకు నేటికీ బాధ పడుతూనే ఉన్నాం. అయితే, ఆయన మిగిల్చి వెళ్లిన అపార సాహిత్య సంపద కొత్త కొత్త రూపాల్లో మన ముందుకు వస్తున్న సమస్యలను అర్థం చేసుకోవడానికి, అవసరమైన కార్యాచరణను రూపొందించుకోవడానికి ఇప్పటికీ ఉపకరిస్తోంది.

బాలగోపాల్‌ స్మృతిలో మేము ప్రతి ఏటా సమకాలీన హక్కుల సమస్యలపై సభలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది కూడా ఆయన పదో వర్ధంతి సందర్భంగా స్మృత్యర్థం ‘ప్రశ్నే ప్రజాస్వామ్యం– ప్రశ్నిస్తున్న గొంతులను విందాం రండి’ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. హైదరాబాద్‌, బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అక్టోబర్‌ 13, ఆదివారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుంది. ‘కశ్మీర్‌ – మనకు చెప్పని విషయాలు’ అన్న అంశంపై రచయిత, డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత సంజయ్‌ కక్‌ సభలో ప్రసంగిస్తారు. ‘సఫాయి కార్మికుల ఆత్మగౌరవ పోరాటం’ అంశంపై సఫాయి కర్మచారీ ఆందోళన్‌ జాతీయ అధ్యక్షులు బెజవాడ విల్సన్‌, ‘అస్సాం– జాతీయ పౌరసత్వ జాబితా సృష్టిస్తున్న భయాందోళనలు’ అంశంపై హక్కుల కార్యకర్త, జర్నలిస్టు తీస్తా సెతల్వాద్‌, ‘అణు విద్యుత్తు అన్ని విధాలా చేటు’ అంశంపై అణువిద్యుత్తు వ్యతిరేక ఉద్యమకారుడు ఎస్‌.పి.ఉదయ కుమార్‌ ప్రసంగిస్తారు.

మానవ హక్కుల వేదిక