• భారీగా తగ్గనున్న ప్రత్యక్ష పన్నుల రాబడి
  • 20 ఏళ్లలో మొదటిసారిగా పతనం పెరగనున్న ద్రవ్యలోటు

న్యూఢిల్లీవార్షిక బడ్జెట్‌ సమర్పణకు ముందు కేంద్రానికి మరో చేదు వార్త! ప్రత్యక్ష పన్నుల వసూళ్లు భారీగా తగ్గనున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి లక్ష్యం 13.5 లక్షల కోట్లు కాగా, ఈ జనవరి 23 నాటికి సమకూరినది కేవలం 7.3 లక్షల కోట్లే. నిరుడు ఇదే సమయంతో పోలిస్తే ఇది 5.3ు తక్కువ. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా రెండునెలల పైగా గడువున్నా లక్ష్యాన్నిచేరడం అసంభవమని నిపుణులు అంటున్నారు. కిందటేడాది వసూళ్లు 11.5 లక్షల కోట్ల కంటే 17ు ఎక్కువ లక్ష్యాన్ని కేంద్రం పెట్టుకుంది. అయితే నిరుడు వసూలైన ఆ 11.5 లక్షల కోట్లు కూడా సమకూరే సూచనల్లేవు. అంత వసూలైతే గొప్పేనని ఓ అధికారి వ్యాఖ్యానించారు. గత ఇరవయ్యేళ్లలో ప్రత్యక్ష పన్నుల రాబడి పడిపోవడం ఇదే ప్రథమం. కేంద్ర వసూళ్లలోప్రత్యక్ష పన్నులదే సింహభాగం. అంటే దాదాపు 80శాతం.

వసూళ్లు తగ్గితే వ్యయానికి సంబంధించిన కేటాయింపులు, పెట్టుబడులు తగ్గుతాయి. ప్రభుత్వ పథకాలకు నిధులు తగినంత అందవు. రాబడి తగ్గడానికి చాలా కారణాలున్నాయి. బిజినెస్‌ తగ్గడంతో కంపెనీలు పెట్టుబడుల్లో కోత పెట్టాయి. ఉద్యోగాల్లోనూ కోత విధించాయి. దీని వల్ల వసూళ్లు తగ్గాయి. కార్పొరేట్‌ పన్నును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడమూ దెబ్బతీసింది. కాగా, ద్రవ్యలోటు 3.8 శాతానికి పెరగొచ్చన్నది మరో బాంబు. అమెరికా బ్యాంక్‌ ఆఫ్‌ సెక్యూరిటీస్‌ వెల్లడించిన ఓ నివేదిక ప్రకారం 2020-21లో ద్రవ్యలోటు లక్ష్యం 3.5 శాతానికి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆదాయపు పన్నులో మార్పులు, చిన్న, మధ్య తరహా వ్యాపారానికి వడ్డీ మినహాయింపులు… మొదలైన చర్యల ద్వారా వినియోగం పెంచితే తప్ప వృద్ధి ఊపందుకోదని ఆ నివేదిక పేర్కొంది.

Courtesy Andhrajyothi