బి తులసీదాస్‌

జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్‌ 370, 35 (ఎ) లను రద్దు చేసిన సందర్భంగా మోడీ, అమిత్‌ షా మాట్లాడుతూ ఇక నుండి దేశమంతటికీ రాజ్యాంగం ఒకేలా వర్తిస్తుందని చెప్పారు. ఆర్టికల్‌ 35 (ఎ) రద్దు చేశాం కనుక ఇక జమ్ము కాశ్మీర్‌లో ఎవరైనా భూములు, స్థిరాస్తులూ కొనుక్కోవచ్చనీ తద్వారా అభివృద్ధి జరుగుతుందనీ బిజెపి నేతలు చెబుతున్నారు. జమ్ము కాశ్మీర్‌లో ఇప్పటి వరకు దళితులకు రిజర్వేషన్లు లేవని చెప్పారు. కొందరు సంఘీయులు కాశ్మీర్‌ స్త్రీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి, ఆ తరువాత నాలుక కరుచుకున్నారు. అయితే, భారత రాజ్యాంగంలో జమ్ము కాశ్మీర్‌ రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకమైన ప్రతిపత్తి వుందా? అలాగే కాశ్మీరీ ప్రజలకు మాత్రమే స్థిరాస్తికి సంబంధించిన రక్షణలున్నాయా? లేక ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలు, ప్రత్యేక సామాజిక తరగతులు, సమూహాలకు రాజ్యాంగ పరమైన రక్షణలు, సౌకర్యాలూ వున్నాయా అని చాలా మందికి సందేహాలు కలుగుతున్నాయి. ఈ అంశాలకు సంబంధించిన కొన్ని విషయాలు చర్చిద్దాం.

షెడ్యూల్డు ప్రాంతాలపై…
రాజ్యాంగ నిర్ణాయక సభ (కాన్‌స్టిట్యుయెంట్‌ అసెంబ్లీ) మూడేళ్ల పాటు చర్చించి రూపొందించిన భారత రాజ్యాంగానికి మూలాలు బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలు, రెగ్యులేషన్లలో వున్న విషయం తెలిసిందే! బ్రిటిష్‌ పెత్తనాన్ని భారత ప్రజలు ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ ప్రతిఘటిస్తూనే వచ్చారు. దాంతో కొన్ని సందర్భాల్లో బ్రిటిష్‌ చట్టాలకు, రెగ్యులేషన్లకు సడలింపులు, కొన్ని మినహాయింపులూ ఇవ్వాల్సి వచ్చింది. ఆ నేపథ్యం లోనే 1874లో షెడ్యూల్డ్‌ జిల్లాల చట్టం చేశారు. దాని ప్రకారం వివిధ రాష్ట్రాలకు చెందిన కొన్ని జిల్లాలు, కొన్ని జిల్లాల్లోని పరిమిత ప్రాంతాలలో కొన్ని చట్టాలు వర్తించవనీ, ఇంకొన్ని చట్టాల నిబంధనలకు మినహాయింపులనూ కల్పించారు. ఆయా జిల్లాలు, ప్రాంతాలను గవర్నర్‌ జనరల్‌ అనుమతితో ఆయా రాష్ట్రాల గవర్నర్లు నోటిఫై చేస్తారని పేర్కొన్నారు. అందులో మద్రాస్‌, బొంబాయి, బెంగాల్‌, పంజాబ్‌, సెంట్రల్‌ మరియు వాయువ్య ప్రోవిన్స్‌ (రాష్ట్రాల)లోని జిల్లాలను నోటిఫై చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విశాఖపట్నం (ఇప్పటి ఉత్తరాంధ్ర జిల్లాలు, ఒడిశా లోని గంజాం, గజపతి జిల్లాల్లోని భాగాలు), గోదావరి జిల్లా (ఇప్పటి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని భాగాలు) లలోని వివిధ తాలూకాలు ఆ చట్టం ప్రకారం నోటిఫై చేయబడ్డాయి. ఆ తరువాత 1917లో వచ్చిన ఏజన్సీ ప్రాంతాల్లో వడ్డీ నియంత్రణ, భూ బదలాయింపు నిషేధ చట్టంతో గిరిజన ప్రాంతాల్లో బ్రిటిష్‌ పాలన లోనే కొన్ని రక్షణలు కల్పించబడ్డాయి.
వీటన్నింటి ప్రాతిపదికగా పరిణామ క్రమం లోనే భారత రాజ్యాంగంలో ఐదు, ఆరవ షెడ్యూలు వచ్చాయి. ఐదు, ఆరవ షెడ్యూలు ప్రాంతాల్లో భూములు, స్థిరాస్తి గిరిజనులదే. క్రయ విక్రయాలంటూ జరిగితే అవి గిరిజనుల మధ్య మాత్రమే జరగాలి. ఆంధ్రప్రదేశ్‌లో అయితే 1/70గా ప్రాచుర్యం పొందిన ‘షెడ్యూల్డ్‌ ప్రాంత భూ బదలాయింపు నియంత్రణ చట్టం (1959) వచ్చింది. దాని ప్రకారం 1959 మార్చికి ముందు తమ అనుభవంలో వున్న స్థిరాస్తులపై మాత్రమే గిరిజనేతరులకు, వారి వారసులకు అక్కడ హక్కులుంటాయి. అంతేకాదు ఆయా షెడ్యూల్డు ప్రాంతాల్లోని ఒక స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగాలను నూటికి నూరు శాతం స్థానిక గిరిజనులతోనే భర్తీ చేయాలి. తాజాగా ప్రభుత్వం చేపట్టిన గ్రామ సచివాలయ పోస్టులన్నీ షెడ్యూల్డు ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి శ్రీకాకుళం నుండి పశ్చిమ గోదావరి వరకుగల షెడ్యూల్డు ప్రాంతాల్లో ఈ రాష్ట్రానికి చెందిన వారే అయినా గిరిజనేతరులెవరూ ఒక్క సెంటు భూమి కూడా కొనే వీలు లేదన్నది స్పష్టం. అలాగే షెడ్యూల్డు ప్రాంతాల్లో వంద శాతం పోస్టులూ (ఒక స్థాయి వరకు) గిరిజనులకే రిజర్వు చేయబడ్డాయి. ఇవన్నీ రాజ్యాంగం లోని ఐదవ షెడ్యూలు ఆధారంగా రాష్ట్రం చేసిన చట్టాల వల్ల గిరిజనులకు కలిగిన రక్షణలు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆరవ షెడ్యూలు మూలంగా స్వయంపాలిత జిల్లా మండళ్ల ద్వారా పాలనాపరమైన అధికారాలు కూడా గిరిజనులకు కల్పించబడ్డాయి.

ఆర్టికల్‌ 371 ద్వారా అనేక రాష్ట్రాలకు…
రాజ్యాంగంలో ఆర్టికల్‌ 370 కాశ్మీర్‌కు రక్షణలు కల్పించగా ఆర్టికల్‌ 371 చాలా రాష్ట్రాలకు-ప్రధానంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, నిధుల కేటాయింపునకు సంబంధించిన అంశాలతోబాటు ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయ హక్కుల పరిరక్షణకూ సాధనంగా, కవచంగా వుంది. మొట్టమొదట 1956లో ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి బొంబాయి రాష్ట్రం (ప్రస్తుత మహారాష్ట్ర, గుజరాత్‌) లోని విదర్భ, మరట్వాడా, సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేస్తూ 371(1) వచ్చింది. ఆయా ప్రాంతాల అభివృద్ధికి సమన్యాయంతో (ఈక్విటబుల్‌) నిధులు కేటాయించడం, ఆయా ప్రాంతాల్లోని వారికి సాంకేతిక, వృత్తి విద్యావకాశాలు కల్పించడం గురించి పేర్కొన్నారు. కాలక్రమంలో ఈ ఆర్టికల్‌లో ‘ఎ’ నుండి ‘జె’ వరకు తొమ్మిది రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు, రక్షణలు కల్పించబడ్డాయి.
371(ఎ) : పదమూడవ రాజ్యాంగ సవరణగా 1962లో నాగాలాండ్‌ కోసం చేశారు. (1) నాగాల మతపరమైన లేదా సాంఘికపరమైన ఆచారాలు, (2) నాగా సంప్రదాయ చట్టం, పద్ధతులు, (3) నాగాల సంప్రదాయ చట్టాలకు అనుగుణంగా సివిల్‌, క్రిమినల్‌ న్యాయం అందించడం, (4) భూమి, దాని వనరుల యాజమాన్యం, బదిలీ- వీటిపై నాగాలాండ్‌ అసెంబ్లీ నిర్ణయిస్తే తప్ప పార్లమెంటు చేసే ఏ చట్టమూ వర్తించదు. కేంద్ర ప్రభుత్వం, ‘నాగా పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌’ల మధ్య 1960 జూలైలో కుదిరిన ఒప్పందం మేరకు ఈ రాజ్యాంగ సవరణ చేశారు. ఆ తరువాతనే నాగాలాండ్‌ రాష్ట్రం ఏర్పడింది.
371 (బి) : రాజ్యాంగానికి 22వ సవరణగా 1969లో అసోం కోసం చేశారు. ఆ రాష్ట్రం లోని కొండ ప్రాంతాల అభివృద్ధి, అక్కడి ప్రజల సంక్షేమం చూడడానికి అక్కడి శాసన సభ్యులతో ఒక కమిటీని నియమించారు. అయితే, ఆ కొండ ప్రాంతాల తోనే తదనంతరం మేఘాలయ రాష్ట్రం ఏర్పడింది.
371 (సి) : రాజ్యాంగానికి 27వ సవరణగా 1971లో మణిపూర్‌ కోసం చేశారు. ఆ రాష్ట్రం లోని కొండ ప్రాంతాలకు చెందిన శాసన సభ్యులతో ఒక కమిటీని నియమిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను, అసెంబ్లీ నిర్వహణకు సంబంధించిన మార్పులు, చేర్పులూ చేస్తారు. అలాగే మణిపూర్‌ గవర్నర్‌ కొండ ప్రాంతాల్లో పరిపాలనపై రాష్ట్రపతికి వార్షిక నివేదికను పంపాలి.
371 (డి) : రాజ్యాంగానికి 32వ సవరణగా 1973లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కోసం చేశారు. రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల ప్రజలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు సమానమైన అవకాశాలు, సౌకర్యాలు వుండేందుకు రాష్ట్రపతి తగు ఉత్తర్వులివ్వాలి అని పేర్కొన్నారు. జై తెలంగాణ, జై ఆంధ్రా అని వేర్పాటు ఉద్యమాలు తలెత్తిన నేపథ్యంలో వచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వు ప్రాతిపదికనే రాష్ట్రంలో జోన్ల విభజన, ఒక స్థాయి ప్రభుత్వోద్యోగాలను జిల్లా పరిధికి, ఇంకొన్ని జోనల్‌ పోస్టులని, మరికొన్ని స్టేట్‌ వైడ్‌ అనీ వర్గీకరించారు. అలాగే ఉన్నత విద్యావకాశాలు పొందడానికి ఆంధ్రా, శ్రీవెంకటేశ్వర, ఉస్మానియా రీజియన్లుగా విభజించడం ఆ లోకల్‌ ఏరియా విద్యార్థులకు 85 శాతం సీట్లు రిజర్వ్‌ చేయడం అందరికీ తెలిసిందే. సెంట్రల్‌ యూనివర్సిటీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి ఆర్టికల్‌ 371 (ఇ) అప్పుడే తీసుకొచ్చారు.
371 (ఎఫ్‌) : రాజ్యాంగానికి 36వ సవరణగా 1975లో సిక్కిం కోసం చేశారు. సిక్కింను భారత దేశంలో భాగంగా చేసిన నేపథ్యంలో ఈ ఆర్టికల్‌ వచ్చింది. అప్పటికే సిక్కింలో అమలు జరుగుతున్న చట్టాలు సవరణ లేదా రద్దు జరిగేవరకు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. అలాగే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన కొన్ని తరగతులవారు మాత్రమే పోటీ చేసేలా డీలిమిటేషన్‌ చేయాలని పేర్కొన్నారు.
371 (జి) : రాజ్యాంగానికి 53వ సవరణగా 1986లో మిజోరం కోసం చేశారు. 371 (ఎ) ద్వారా నాగాలకు కల్పించిన నాలుగు రక్షణలూ మిజోలకూ కల్పించారు. ‘నాగా’ అన్న పదం బదులు ‘మిజో’ అని తప్ప ఇంకే మార్పూ లేదు.
371 (హెచ్‌) : 1986లో అరుణాచల్‌ ప్రదేశ్‌ కోసం చేశారు. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతను అప్పగించారు. రాష్ట్ర మంత్రివర్గాన్ని సంప్రదించాక తాను సరియైనదని భావించే నిర్ణయాన్ని గవర్నర్‌ అమలు చేయవచ్చని పేర్కొంది. 56వ రాజ్యాంగ సవరణగా 371 (ఐ) గోవా కోసం చేయబడింది. శాసన సభ సభ్యుల సంఖ్య 30కి తగ్గకుండా వుండాలని నిర్ణయించింది.
371 (జె) : రాజ్యాంగానికి 98వ సవరణగా 2013లో కర్ణాటక కోసం చేశారు. హైదరాబాద్‌, కర్ణాటక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేయడానికి ఉద్దేశించబడింది. ప్రభుత్వ నిధుల కేటాయింపు, ఉద్యోగాల్లో సమానమైన అవకాశాలు, విద్యా సంస్థల్లో కొన్ని సీట్లు రిజర్వ్‌ చేయడంతో సహా మెరుగైన విద్యావకాశాలు కల్పించడం మొదలైన అంశాలున్నాయి.
మొత్తంగా 371 ‘ఎ’ నుండి ‘జె’ వరకున్నవి కొన్ని రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలు, సామాజిక తరగతులకు విద్య, ఉద్యోగావకాశాల్లో సమ న్యాయం కల్పించడానికి, ఈశాన్య రాష్ట్రాల్లోని నాగా, మిజో తదితర తెగల వారి ఆస్తి హక్కుతో సహా సంప్రదాయ పద్ధతులకు రక్షణ కల్పించేవిగా వున్నాయి. ఐదు, ఆరవ షెడ్యూలు ప్రాంతాల ప్రత్యేకత ఎలాగూ వుంది. కాబట్టి భారత రాజ్యాంగంలో జమ్ము కాశ్మీర్‌కే గాక చాలా రాష్ట్రాలకు, కొన్ని ప్రాంతాలకూ, ఇంకొన్ని సామాజిక తరగతులకూ ప్రత్యేక రక్షణలున్నా యన్నది సుస్పష్టం. అవన్నీ ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలు, సామాజిక తరగతుల ప్రజలు భారత దేశంలో మనస్ఫూర్తిగా కలిసి వుండడానికి ఆయా సందర్భాలలో కల్పించబడ్డాయి. ఆ ప్రత్యేక హక్కులు, రక్షణలకు భరోసా వుంటే వారంతా కలిసి వుంటారు. భిన్నత్వంలో ఏకత్వం భారత్‌లో కొనసాగుతుంది. కాబట్టి బలహీనులకున్న రాజ్యాంగపరమైన రక్షణలను దేశ ప్రజలు ఐక్యంగా కాపాడుకోవాలి.

 

(Courtacy Prajashakti)