నవజాత శిశువు అపహరణతో బెంబేలు
ధర్మాసుపత్రిలో ఇది మూడో ఘటన
ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే

బిడ్డను బాగు చేయించడానికి వచ్చి పదిహేను రోజులుగా దవాఖానాలోనే ఉంటున్నాం. ఎక్కడి నుంచో వచ్చి మాయ మాటలు చెప్పింది. చిన్నారికి పాలిచ్చి నమ్మించింది. అమ్మ నీళ్ల వద్దకు వెళ్లింది. నేను ఇడ్లీ తింటుండగానే ఆడిస్తానని ఎత్తుకొని అటేపోయింది. ఆమెతోపాటు ముగ్గురు కలిసి కన్పించారు. బిడ్డ లేకుండా నేనెట్లా బతికేది..
-బాధితురాలు రమాదేవి రోదన ఇది

అమ్మ పొత్తిళ్ల వెచ్చదనంలో సేద తీరాల్సిన చిన్నారులు అపహరణకు గురవుతున్నారు. ఆస్పత్రిలోనే మాటు వేస్తున్న మాయగాళ్లు అమాయకులను నమ్మించి అభంశుభం ఎరుగని చంటి బిడ్డలను ‘చంకన’ వేసుకుంటున్నారు. ఇవి కన్నవారికి కడుపు కోతను మిగులుస్తున్నాయి. మంగళవారం ఉదయం ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన కె. రమాదేవి, నాగరాజు దంపతుల నవజాత శిశువు అపహరణ దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్నారులను లాలిస్తామంటూ వస్తున్న అపరిచిత వ్యక్తులపై అప్రమత్తంగా లేకుంటే జరిగే పరిణామాలు బెంబేలెత్తిస్తున్నాయి.

మూడేళ్లలో మూడు సంఘటనలు
జిల్లా ఆసుపత్రిలో గత మూడేళ్లలో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. 2015లో మంగ అనే మహిళ గర్భం దాల్చినట్లు వైద్యులను నమ్మించి ఆసుపత్రిలో చేరింది. తాను ఉన్న వార్డులో మగ శిశువును తీసుకొని ఉడాయించింది. అప్పట్లో సంచలనం రేపిన ఈ సంఘటనను పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో రెండు రోజుల తర్వాత బిడ్డ తల్లి ఒడికి చేరుకుంది. శిశువుతో ఉడాయించిన మంగ ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్‌లో తచ్చాడుతుండగా పోలీసులు గుర్తించారు. సంతానం లేకపోవడంతో తాను ఇలా చేశానని సదరు మహిళ విచారణలో ఒప్పుకొంది. ఈ సంఘటన జరిగిన తీరును గమనిస్తే ఆసుపత్రి భద్రత అంశంలో డొల్లతనం తేటతెల్లమైంది.

ఈ ఏడాది నాలుగు నెలల క్రితం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో శిశువు అదృశ్య సంఘటనపై హైడ్రామా నెలకొంది. కుటుంబీకులే బిడ్డను వదిలించేందుకు చేసిన ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి ఆవరణ ఊయలలో శిశువును ఉంచి తమకేమీ సంబంధం లేదన్నట్లు కుటుంబీకులు వ్యవహరించిన తీరు తీవ్ర చర్చకు దారితీసింది. తమ బిడ్డ కాదని నమ్మించే చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తల్లిందండ్రులు చివరకు తప్పును అంగీకరించాల్సి వచ్చింది.

రక్షణపై అసంతృప్తి
ఆసుపత్రిలో సీపీ కెమెరాలు అమర్చినా ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం పట్ల రోగుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. నిత్యం జనసంచారం, వైద్య సిబ్బంది కదలికలు, సెక్యూరిటీ సిబ్బంది నిఘా ఉన్నప్పటికీ శిశువు అపహరణకు గురికావడం విమర్శలకు తావిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీసీ కెమెరాలను నమ్ముకొని భద్రత విషయాలపై దృష్టి సారించడం లేదనే వాదనలు ఉన్నాయి. సీసీ కెమెరాలను ఆవరణలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వ్యక్తుల కదలికలను గమనించే నైపుణ్యం ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని సూచిస్తున్నారు. భద్రతను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

పోలీసుల గాలింపు చర్యలు
బాధిత కుటుంబీకులతో ఆర్‌ఎంవో రెండో పట్టణ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు నగర ఏసీపీ పీవీ గణేశ్‌, సీఐ గోపి, సీఐడీ పోలీసులు, క్లూస్‌టీం తదితర బృందాలు ఆసుపత్రికి చేరుకున్నారు. సంఘటన సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందిని ప్రశ్నించారు. సీసీ పుటేజీలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం ఏసీపీ పర్యవేక్షణలో నగరంలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. సైబర్‌ సిబ్బందితో పాటు పెట్రోలింగ్‌ సిబ్బంది, ఇతర పోలీసు విభాగాలకు చెందిన వారితో మూడు బృందాలను ఏర్పాటు చేసి మహిళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బిడ్డను ఎత్తుకెళ్లిన మహిళతో మరో ముగ్గురు ఉన్నట్లు రమాదేవి చెప్పారు. వారిలో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఉన్నారని పోలీసులకు చెప్పారు.

Courtesy Eenadu…