లౌకిక విలువలకు, చట్టపర పరిపాలనకు వరసగా ఎదురుదెబ్బలు తగలడాన్ని భారతదేశం భరించలేదు, తట్టుకోలేదు. బాబ్రీ మసీదు శిథిలాలను వెంట వెంటనే అక్కడ నుంచి తరలించారు. కూలగొట్టడానికి తెచ్చిన గుండాలతోనే శుభ్రపరచడం కూడా చేయించారు. అయినా కొన్ని రాళ్ల కుప్పలు మిగిలిపోయాయి. బాబ్రీ మసీదును కూల్చడానికి కుట్ర పన్నిన కుట్రదారులను కోర్టు శిక్షిస్తే రాజ్యాంగాన్ని, చట్టపరమైన పాలనను నిలబెట్టినట్టు అవుతుందని చాలా మంది ఆశించారు. ఒకవైపున ఆయోధ్యలోని స్థలాన్ని సుప్రీంకోర్టు మసీదు కూల్చినవారికే రామమందిరం నిర్మించుకునేందుకు అప్పగిస్తూ… రెండో వైపున ఆ చర్యను అసాధారణమైన నేరం అని పేర్కొనడంతో కుట్రదారులకు శిక్షపడుతుందని చాలా మందికి నమ్మకం కలిగింది. లక్నోలోని సీబీఐ కోర్టు నీతిలేని తీర్పు ఇవ్వడంతో అక్కడ మిగిలిన శిథిలాలను కూడా తొలగించినట్టు అయింది.

సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా కుట్రదారులందరిని నిర్దోషులుగా ప్రకటించడంతో రామజన్మభూమి విధ్వంసానికి చట్టబద్ధత కల్పించినట్టయింది. ఈ తీర్పులో హేతుబద్ధతకాని, తర్కబద్ధతకాని లేవు. ఈ సంఘటన ముందస్తు పథకం రూపొందించుకుని జరిగింది కాదని కోర్టు చెప్పడమే విడ్డూరంగా ఉంది. ఎందుకంటే బాబ్రీ మసీదు కూల్చిన రోజు వేలాది మంది గడ్డపారలు, పారలు, గన్నులు, తాళ్ళు లాంటి పరికరాలను అంటే ఒక ధృడమైన కట్టడాన్ని కూల్చడానికి అవసరమైన పనిముట్లు తీసుకుని సంఘటన స్థలానికి చేరుకుని పనికానిచ్చి శిథిలాలను కూడా తరలించారు. ఈ సంఘటనకు పథకరచన చేసినవారు ఎల్‌కె అద్వానీ, మురళిమనోహర్‌ జోషీ, ఉమా భారతీలు. ఈ అవమానకర సంఘటనను తిలకించడానికి అనువైన ప్రదేశంలో ఉండి కండ్లారా చూసుకుంటూ సంబురాలు చేసుకుంటూ గుండాలను ప్రోత్సహించారు.

ఏ కుట్ర అయినా తప్పనిసరిగా రహస్య ప్రదేశంలో జరుగుతుంది. కాబట్టి నిరూపించడం కష్టమైన విషయం. అందుకని కోర్టు ఈ అంశాన్ని సృహలో ఉంచుకుని సంఘటన జరిగిన తీరును గమనించి దాని ఆధారంగా పరిస్థితిని ఊహించి ఒక అభిప్రాయానికి రావాలి. అలాంటి కుట్రపూరిత సంఘటనలో పాల్గొన్నవారు ఒక బ్యానర్‌ను అనుసరించి రావడాన్ని సుప్రీంకోర్టే సంఘటనలో పాల్గొన్న భాగస్వాముల గురించి ఒక సందర్భంలో ప్రస్తావించినప్పుడు చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకోవల్సిన సందర్భం ఇది. ఈ కేసులో రాజకీయ సమీకరణ ముఖ్య భూమిక పోషించింది. ఒక నిర్ణీత తారీఖున సంఘటన స్థలానికి చేరుకోవాలని కుట్రదారులు పథక రచన చేసి చెప్పాల్సిన వారికి ముందే తెలియచేశారు. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ కుట్రరచనలో భాగస్వామి అయినందున మౌనం వహించి చేష్టలుడిగినట్టు ఉండిపోయారు. ఈ అంశాలన్నీ కోర్టుకు తెలుసు. అయినా ఏమీ తెలియనట్టే ఉండిపోయింది. ఈ కట్టడం కూలగొడతాం అని కుట్రదారుల్లో కొంతమంది ముందునుంచే బహిరంగంగా ప్రకటనలు చేసిన విషయం కూడా కోర్టు దృష్టిలో ఉన్నది. అప్పటి ముఖ్యమంత్రి కళ్యాణసింగ్‌ అత్యున్నత న్యాయస్థానానికి, జాతీయ సమగ్రతా మండలికి అయోధ్యలో కేవలం ఒక లాంఛన ప్రాయమైన కరసేవ మాత్రమే జరగబోతున్నదని హామీ ఇచ్చారు.

విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు కరసేవకులను అడ్డగించరాదని ప్రత్యేకమైన ఆదేశాలు ఆయన జారీ చేశారు. సంఘటనా స్థలంలో ఉన్న పెద్దలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు, వాటితో పాటు ఇస్తున్న ఆదేశాలను కరసేవకులు అమలు జరుపుతూ బాబ్రీ మసీదు గుమ్మటాలపైకి చేరుకుని మసీదును కూలకొట్టిన దృష్యాలు విడియోలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ వీడియో క్యాసెట్లను మార్చి కోర్టును తప్పుదారి పట్టించారు. అక్కడకు మతోన్మాద గుండాలను రప్పించడమే కాదు, కూలగొట్టడానికీ, శిథిలాలను తరలించడానికీ అవసరమైన ఆర్థిక వనరులను ముందుస్తుగానే సమీకరించుకున్నారనేది తేటతెల్లం అవుతున్నది. సంఘటన జరిగిన రోజు తన జీవితంలో చాలా బాధపడ్డ రోజని సెలవిచ్చిన అద్వానీ… కుట్రదారులను నిర్దోషులుగా కోర్టు ప్రకటించిన రోజు మాత్రం ఇది ఉద్యమానికి గుర్తింపును ఇచ్చిన అంశంగా అభివర్ణించారు. అయోధ్యలో ఏర్పడిన ప్రతిష్టంభనను హింస ద్వారా తొలగించాలనే ఉద్దేశంతో రథయాత్ర జరిగిందనేది స్పష్టం అయింది. లిబరహన్‌ కమిషన్‌ రిపోర్టు కుట్రకు సంబంధించిన అన్ని వివరాలను స్పష్టంగా బయటపెట్టింది.

అయితే దురదృష్టకరమైన అంశం ఏమిటంటే కమిషన్‌ రిపోర్టుకు కట్టుబడి ఉండాలనే నిబంధన ఏమీలేదు అనేది కమిషన్‌ ఆఫ్‌ ఎన్‌క్వైరీ చట్టం చెపుతున్నది. విచారణ జరుగుతున్నప్పుడు వచ్చిన సాక్షుల వాంగ్మూలాన్నే పరిగణలోకి తీసుకుంటారు. ఈ కేసులో కుట్రకోణం, ముందస్తుగా జన సమీకరణకు జరిగిన పథక రచన, వాళ్ళు అందరూ ఏకాభిప్రాయానికి రావటం లాంటి అంశాలను సీబీఐ దర్యాప్తు చేసి నిగ్గుతేల్చాల్సిన అంశాలు. సీబీఐ విఫలమైన అంశం పెద్ద ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే ఈ కేసులో పోలీసు విచారణ మొదటి నుంచి అస్తవ్యస్తంగా సాగింది. కేసులో ముఖ్యసంఘటనల గురించి మొదటి రెండు ఎఫ్‌ఐఆర్‌లలో పొందుపర్చినప్పటికీ కేసును ఏ కోర్టులో విచారించాలని నిర్ధారించడంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం విఫలమైంది.

కేసుకు సంబంధించిన అధికారిక ప్రకటన తప్పుల తడకగా ఉండటంతో అలహాబాద్‌కోర్టు కొట్టేసింది. యూపీ ప్రభుత్వం వెంటనే స్పందించి తప్పును సకాలంలో సరి చేయనందుకు కేసు రెండు కోర్టులలో నడిచింది. రాయిబరేలీ, లక్నవ్‌ సీబీఐ చేసిన విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనప్పుడు దాన్ని సవాల్‌ చేయాల్సింది పోయి కుట్రకోణంను తొలగించి అనుబంధ చార్జిషీట్‌ సమర్పించారు. దాని వలనే కేసు విచారణ ఒకచోట జరగకుండా పక్కదారి పట్టిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందువల్లనే కేసు రెండు కోర్టులలో విడివిడిగా సాగాల్సివచ్చింది. 2017లో సుప్రీంకోర్టు ఆరోపణలను సమీక్షించి సీబీఐ వైఫల్యం వలన, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన దేశం యొక్క లౌకిక స్వభావాన్ని దెబ్బతీసే ఈ కేసు 25సంవత్సరాలు గడిచినా కొలిక్కిరాలేదని వ్యాఖ్యానించింది. రాజకీయ దురుద్దేశాలు ఉన్న ఒక సంస్థ కేసును పూర్తిచేసి శిక్షలు ఖరారు చేస్తుందా అనేది ఒక సుదూర ప్రశ్న. అయితే పరిశీలించడానికి ఇప్పుడు ఫలితాలు మన ముందు ఉన్నాయి.

విధ్వంసం సృష్టించిన ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ, వీహెచ్‌పీ వారు ఎప్పటి నుంచో చెపుతున్నట్టు ఇది హఠాత్తుగా జరిగిన సంఘటన అనే వాదాన్ని న్యాయవ్యవస్థ చిలక పలుకులుగా చెప్పడం అనేది మనం అంగీకరించరాని అంశం. దౌర్భాగ్యకరమైన ఈ సంఘటన జరిగినప్పుడు ఇది ఒక ఉన్మాద పూరిత ప్రచారానికి ముగింపు అని స్పష్టంగా అర్థం అయ్యింది. ఆ కాలంలో రామమందిర నిర్మాణానికి ఇటుకల సేకరణ పేరుతో మతోన్మాద పూరిత ఊరేగింపులు, దేశ వ్యాపితంగా జరిగినవి. దాని ముగింపుగా ఆయోధ్యలోని స్థలంపై మూకుమ్మడి దాడి జరిగి 1990లో రక్తపాతంతో ముగిసింది. ఇలాంటి నేపథ్యంలో ఒక మత కట్టడాన్ని కూల్చివేసిన కుట్రదారులను నిర్దోషులుగా వదిలి వేయడం అనేది న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని సన్నగిల్లెలా చేస్తుంది. సీబీఐ మళ్ళీ అప్పీలుకు వెళ్ళాల్సిన సందర్భం ఇది. మతసామరస్యం నెలకొనాల్సిన తరుణంలో వరుసగా న్యాయవ్యవస్థ నుంచి లౌకిక విలువలకు, చట్టపర పరిపాలనకు ఎదురుదెబ్బలు తగలడం అనేది దేశం భరించగల స్థితిలో లేదు.

ది హిందూ సంపాదకీయం.
అనువాదం: టిఎన్‌వి రమణ,