– ఆయుష్మాన్‌ భారత్‌ లబ్దిదారుల విషయంలో లింగబేధం
– ప్రసవ సంబంధ సమస్యలు మినహా… మిగతా వాటిలో నిర్లక్ష్యం
– రాష్ట్రాల వారీగా ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ : ప్రభుత్వ పథకమేదైనా అందులో లబ్దిదారులుగా చేర్చటంలో వివక్ష, లింగబేధం ఉండరాదు. అయితే ఈ విషయాన్ని ఆయుష్మాన్‌ భారత్‌(ఏబీ పీఎం-జన్‌ ఆరోగ్య యోజన) పథకం అమలులో విస్మరించారన్న సంగతి తేలింది. మోడీ సర్కార్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన (సెప్టెంబరు, 2018లో) ఆయుష్మాన్‌ భారత్‌ పథకం పనితీరుకు సంబంధించి ఆశ్చర్యం కలిగించే విషయాలు ‘నేషనల్‌ శాంపిల్‌ సర్వే’ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) అధ్యయనంలో బహిర్గతమయ్యాయి. ఆయుష్మాన్‌ భారత్‌ కింద లబ్దిదారులుగా మహిళలు చాలా తక్కువ సంఖ్యలో ప్రయోజనం పొందుతున్నారని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ గణాంకాలతో సహా నివేదికను విడుదల చేసింది. ప్రసూతి కేసులు మినహా మిగతా హెల్త్‌ ప్యాకేజీల్లో లబ్దిదారులుగా మహిళల్ని చేర్చటం లేదని, కొన్ని కేసుల్లో లింగబేధం 70శాతం వరకూ ఉందని నివేదిక తెలిపింది.

పథకం ప్రారంభమయ్యాక 16నెలల పనితీరును పరిశీలించి ఎన్‌ఎస్‌ఎస్‌ఓ గణాంకాల్ని రూపొందించింది. దీని ప్రకారం, పథకంలో మందులపై జరిగిన వ్యయాన్ని పరిశీలిస్తే లింగభేదం (రాష్ట్రాల వారీగా) 2 నుంచి 67శాతం వరకు ఉంది. లబ్దిదారులుగా హాస్పిటల్‌ చికిత్స అందుకోవటంలో లింగబేధం 2 నుంచి 30శాతం వరకు ఉంది. ప్రసవ, ఇతర సాధారణ ఆరోగ్య సమస్యల నేపథ్యంలో కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్‌, నాగాలాండ్‌, పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌, జార్ఖాండ్‌, మిజోరాం, చత్తీస్‌గఢ్‌, బీహార్‌…పది రాష్ట్రాల్లో మహిళలు లబ్దిదారులుగా ఎక్కువ సంఖ్యలో నమోదయ్యారు.

హెల్త్‌ ప్యాకేజీల్లో అత్యధికం పురుషులకే
ఆయుష్మాన్‌ భారత్‌లో 25 ప్రత్యేక ఆరోగ్య సమస్యలకు సంబంధించి 1393 హెల్త్‌ ప్యాకేజీలున్నాయి. ఆ తర్వాత వీటిసంఖ్యను పెంచారు. ఏదేమైనా మహిళల్లో, పురుషుల్లో అత్యధికంగా వచ్చే ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి. ప్రసవ సంబంధిత సమస్యలు, గైనిక్‌ సమస్యలు, క్యాన్సర్‌ వంటివి మహిళల్లో, కిడ్నీ, మెదడులో స్ట్రోక్‌, గుండె సమస్యల్లో పురుషులకు వైద్య చికిత్స అందింది. ఇలాంటి కీలకమైన 50 రకాల హెల్త్‌ ప్యాకేజీల్లో 65శాతం పురుషులు లబ్దిదారులుగా ఉన్నారు. గుండె, నరాలు, కిడ్నీ…మొదలైన కీలక ఆరోగ్య సమస్యల్లో పథకం ప్రయోజనం పురుషుల్లో 60శాతం ఉండగా, మహిళల్లో 30శాతం మాత్రమే ఉంది. హాస్పిటల్‌లో చేరితేనే దక్కే వైద్య చికిత్సల్లో లింగబేధం 70శాతముంది.

Courtesy Nava Telangana