ఉన్నోళ్లకే ఆయుష్మాన్‌ భారత్‌
పథకం లబ్దిదారుల్లో పేదలు 10శాతం…ధనికులు 22శాతం
ఎలాంటి ఆరోగ్య బీమాలేని వారు 86శాతం
– ‘ఆరోగ్య బీమాపై ఎన్‌ఎస్‌ఎస్‌ఓ గణాంకాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఆరోగ్య పథకాల్ని ప్రకటించాయి. జన ఆరోగ్య యోజన‘(ఆయుష్మాన్‌ భారత్‌) పథకాన్ని మోడీ సర్కార్‌ తీసుకొచ్చింది. 10 కోట్ల కుటుంబాలకు చెందిన 50 కోట్లమంది దీని ద్వారా లబ్దిపొందుతారని 2018లో ఘనంగా ప్రకటించారు. మరి ఇదంతా నిజమేనా? ఎంతమందికి ప్రభుత్వ ఆరోగ్య పథకాలు వర్తిస్తున్నాయి? అని ఎన్‌ఎస్‌ఎస్‌ఓఇంటింటి సర్వే చేయగా చేదు వాస్తవాలెన్నో బయటపడ్డాయి. ఈ దేశంలో 86శాతం మంది ప్రజలకు ఎలాంటి ఆరోగ్య బీమా పథకం వర్తించటం లేదన్న సంగతి సర్వే తేల్చింది. ఆరోగ్య బీమా పథకాల అమలుపై ఎన్‌ఎస్‌ఎస్‌ఓగణాంకాలను ప్రస్తావిస్తూ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు చెబుతున్న విషయాలు ఇలా ఉన్నాయి…

న్యూఢిల్లీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెరపైకి తీసుకొస్తున్న వివిధ ఆరోగ్య బీమా పథకాలు అణగారిన వర్గాల్లో, పేదల్లో ఎన్నో ఆశలు కల్పించాయి. పథకాలపై పాలకులు, ప్రభుత్వాలు ఘనంగా ప్రచారం చేస్తున్నాయి. తీరా అమలు దగ్గరకు వచ్చేసరికి ఉత్తచేయి చూపుతున్నాయి. ఈ సంగతి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ‘ఎన్‌ఎస్‌ఎస్‌ఓ’ సర్వే గణాంకాలే చెబుతున్నాయి. 2018 బడ్జెట్‌లో మోడీ సర్కార్‌ ‘పీఎం జన ఆరోగ్య యోజన’ (ఆయుష్మాన్‌ భారత్‌) పథకాన్ని ప్రకటించింది. ప్రతి పేద కుటుంబానికి ప్రతి ఏటా రూ.5లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తున్నామనీ, ప్రపంచంలోనే ఇలాంటి పథకం మరోటి లేదనీ ఆనాడు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.
కావాల్సినన్ని నిధులు కూడా కేటాయిస్తున్నామని కేంద్రం చెప్పింది. కేంద్రమే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌…వివిధ రాష్రాలు కూడా రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాల్ని ప్రకటించాయి. ఇవన్నీ ఏ మేరకు అమలవుతున్నాయి? పేదల్లో ఎంతమందికి? ధనికుల్లో ఎంతమందికి? వర్తిస్తున్నది? అన్నది పరిశీలిస్తే గణాంకాలు నిరాశజనకంగా ఉన్నాయి. అత్యంత పేద కుటుంబాల(గ్రామాల్లో 8శాతం)కన్నా, ధనికుల (22శాతం)కు ఎక్కువగా ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం లబ్దిచేకూర్చిందని గణాంకాలు విడుదలయ్యాయి.

నయా ఉదారవాద విధానాల ఫలితం ఇది..
‘నయా ఉదారవాద’ విధానాలు అమల్లోకి వచ్చాక అనేక దేశాల్లో ప్రభుత్వ వైద్యంపై వ్యయ నియంత్రణలకు తెరలేపారు. బడా కార్పొరేట్‌ హాస్పిటల్స్‌కు మేలు చేసే వివిధ పథకాల్ని తీసుకొచ్చారు. మోడీ సర్కార్‌ తెచ్చిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ అలాంటిదేనని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌ దెబ్బతినటం, ప్రయివేటు వైద్యం మరింత విస్తరించటం అందరమూ చూస్తున్నదే. నయా ఉదారవాద విధానాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో ప్రత్యక్ష ఉదాహరణ వైద్యరంగమేనని వారు చెబుతున్నారు.

పేదలకు రూ.249…ధనికులకు రూ.12వేలు
– ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలు పట్టణాల్లోని 13.5 శాతం ధనిక కుటుంబాలకు వర్తించింది. మరో 20శాతం ధనిక కుటుంబాలు ప్రయివేటు బీమా కంపెనీల నుంచి పాలసీలు కలిగివున్నారు.
– హాస్పిటల్‌పాలైన కేసుల్లో…1.6 శాతం పేద కుటుంబాలకు (బీమా పథకం కింద) రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చారు. ధనిక కుటుంబాల్లో 4శాతం రీయింబర్స్‌మెంట్‌ పొందారు.
– పట్టణ పేదల్లో 4శాతం రీయింబర్స్‌మెంట్‌ అందుకోగా, ధనికుల్లో 27శాతం రీయింబర్స్‌ పొందారు.
– ఒక కేసులో పేద కుటుంబానికి దక్కిన రీయింబర్స్‌మెంట్‌ రూ.279కాగా, పట్టణాల్లోని ధనికులకు ఒక కేసుకు సగటున రూ.12వేలు రీయింబర్స్‌ అయ్యింది.

ఆరోగ్య బీమా పథకం (గ్రామాల్లో) 2014 2017-18
1.ప్రభుత్వ ఆరోగ్య బీమా వర్తింపు 13.1% 13.5%
2.ప్రయివేటు బీమా వర్తింపు 0.6% 0.3%
3.బీమా కంపెనీల ద్వారా
కొనుగోలు చేసినవారు 0.3% 0.2%
4.ఏ పథకం వర్తించనివారు 86% 86%

ఆరోగ్య బీమా పథకం(పట్టణాల్లో) 2014 2017-18
1.ప్రభుత్వ ఆరోగ్య బీమా వర్తింపు 12% 12.2%
2.ప్రయివేటు బీమా వర్తింపు 2.4% 2.53%
3.బీమా కంపెనీల ద్వారా
కొనుగోలు చేసినవారు 3.5% 3.8%
4.ఏ పథకం వర్తించనివారు 82% 81%

Courtesy Nava telangana…