రాష్ట్రంలో పనికల్పన అంతంతే
సగటు పని దినాలు 42 రోజులే
మూడేండ్లుగా అందని మెడికల్‌ కిట్లు
యాంత్రీకరణ వైపే మొగ్గు
నిధులను దారిమళ్లిస్తున్న రాష్ట్ర సర్కారు
కేంద్ర బడ్జెట్‌లో నిధుల తగ్గింపుతో మరింత ప్రమాదం

ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాల కల్పన హామీకి మోడీ సర్కారు తిలోదకాలిచ్చింది. గ్రామీణ పేదల జీవనప్రమాణాలను పెంచేందుకు వామపక్షాల ఒత్తిడితో యూపీఏ-1 తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచే కార్యక్రమాన్నీ మొదలుపెట్టింది. ఏటేటా బడ్జెట్‌లో నిధులను తగ్గిస్తూ ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నది. కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టినా ప్రజలకు అండగా మేముంటామంటూ కేరళ ప్రభుత్వం ముందుకెళ్తుండగా…మన రాష్ట్ర ప్రభుత్వమేమో ఉన్న నిధులనూ దారిమళ్లిస్తున్న పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. వెరసి రాష్ట్రంలో ప్రజలకు ‘ఉపాధి’ అంతంతగానే లభిస్తున్నది. ఈ సారి కేంద్రం గతేడాది కంటే రూ. 10 వేల కోట్లను తగ్గించడం వల్ల ఈ ఏడాది మరిన్ని పనిదినాలు తగ్గే ప్రమాదమున్నది. రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టం 32 జిల్లాల పరిధిలోని 12769 గ్రామ పంచాయతీల పరిధిలో అమలవుతున్నది. పైకి చూస్తే అన్ని గ్రామాల్లోనూ ఉపాధి హామీ పనులు జరుగుతున్నట్టు లెక్కల్లో ఉంది. కానీ, ప్రజలకు ఉపాధి హామీ పనులు దక్కుతున్నది మాత్రం అంతంతే. మన రాష్ట్రంలో 49,94,344 జాబుకార్డులుండగా…

ఈ ఏడాది వంద రోజుల పని దక్కింది కేవలం 1,35,985 కుటుంబాలకు మాత్రమే. వాటిల్లోనూ సగటున ఒక వ్యక్తికి 20 నుంచి 25 రోజుల పనే దక్కింది. 4,500కుపైగా పంచాయతీల్లో కనీసం 40 రోజుల పని కూడా కల్పించలేదు. పది రోజుల పని కూడా కల్పించని పంచాయతీలు సుమారు 770 వరకు ఉన్నాయి. పనులను పరిశీలిస్తే రాష్ట్రంలో సగటున 42 రోజుల పనే దక్కింది. రెక్కలు, ముక్కలు చేసుకుని పనిచేస్తే దానికీ సరిగ్గా వేతనాలు చెల్లించట్లేదు. రూ.211 కూలి కూలీల చేతికి అందడం లేదు. సగటు కూలి రూ.151 పడుతున్నదని ప్రభుత్వ లెక్కలు చెబుతుండగా క్షేత్రస్థాయిలో రూ.125 కూడా దక్కట్లేదని సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా కూలీలకు చెల్లించాల్సిన పెండింగ్‌ వేతనాలు రూ.1000 కోట్ల వరకు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పెండింగ్‌ వేతనాల సమస్యతో కూలీలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇదే సందర్భంలో కేరళ రాష్ట్రం మాత్రం ఉపాధి కూలీలకు రూ.211 ఇస్తున్నది. పట్టణప్రాంతా ల్లోనూ అమలు చేసే చర్యలు తీసుకుంటున్నది. మన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను ఇతర పనులకు మళ్లిస్తుంటే కేరళ రాష్ట్రమేమో కేంద్రం ఇస్తున్న నిధులకు అదనంగా రూ.1000 కోట్లను వెచ్చించి కూలీలకు న్యాయం జరిగేలా చూస్తున్నది. మన రాష్ట్రంలో కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో ఎక్కువగా ప్రాజెక్టులు, శ్మశాన వాటికలు, హరితహారం, కొత్త గ్రామపంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్లు, స్వచ్ఛభారత్‌ బాత్‌రూమ్‌లకు, ఇంకుడుగుంతలకు మళ్లిస్తున్న దుస్థితి నెలకొంది.

చట్టం వచ్చిన కొత్తలో 90 శాతం నిధులను వేజ్‌ కాంపోజినెంట్‌కు వెచ్చించేవారు. యంత్రాల వాడకానికి కేవలం 10 శాతం మాత్రమే వాడేవారు. ప్రస్తుతం యంత్రాల ద్వారా జరుగుతున్న పనులకే 40 శాతం నిధులను మళ్లిస్తున్నారు. ‘ఉపాధి అడగ్గానే పని చూపెట్టాలి…అభివృద్ధి పనులు చేపట్టాలి…గ్రామీణ ప్రజల కొనుగోలు స్థాయి పెంచాలి’ అనే ప్రాథమిక మౌలిక లక్ష్యానికి నేటి పాలకులు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ లెక్కలను బట్టి చూస్తేనే ఉపాధి హామీ చట్టం అమలు తీరు ఎలా ఉందో అర్ధమవుతున్నది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది.

ఎక్కడి సమస్యలు అక్కడే…
ఉపాధి హామీ చట్టం నిర్వహణలో అడుగడుగునా సమస్యలే ఎదురవుతున్నాయి. పనిప్రదేశాల్లో కూలీలకు దెబ్బతగిలితే వెంటనే ప్రాథమిక చికిత్స అందించేందుకు ప్రతి గ్రూపునకూ మెడికల్‌ కిట్లు ఉండాలి. ఇది చట్ట నిబంధన. కానీ, రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదు. ఉపాధి హామీ కూలీలకు రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మెడికల్‌ కిట్లే ఇవ్వలేదు. చాలా మెడికల్‌ కిట్లలో గడువు ముగిసిన పరికరాలు, మెడిసిన్‌ ఉన్నాయి. గడ్డపారలు, పారలు, ఇతర పనిముట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. గడ్డపారకు మొన పెట్టే పైసలు ఇచ్చే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మరిచింది. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు పనిప్రదేశా ల్లో టెంట్లు ఇవ్వాల్సి ఉండగా…వేడిని ఎక్కువగా శోచించే టార్పాలిన్‌ కవర్లను ఇస్తున్నది. గతంలో కూలి తక్కువ పడ్తే కూలీలు ప్రశ్నిస్తుండటం తో మన రాష్ట్ర ప్రభుత్వం ప్లే స్లిప్పులను ఇచ్చే పద్ధతినే ఎత్తేసి ఎంత కూలి పడ్తున్నదో తెలుసుకోకుండా గందరగోళ పరిస్థితిని సృష్టించింది.

నిధుల్లో కేంద్రం కోత…
దేశవ్యాప్తంగా ఈ చట్టం నిర్వీర్యానికి మోడీ సర్కారు పూనుకున్నది. 2009లో రూ.10 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌లో రూ.40 వేల కోట్లు అనగా నాలుగు శాతం కేటాయించారు. ఈసారి రూ. 30 లక్షల కోట్ల బడ్జెట్‌లో ఉపాధి హామీకి వాస్తవానికి రూ.1.20 లక్షల కోట్లు కేటాయించాలి. ఈసారి రూ.61 వేల కోట్లకు కుదించారు. బడ్జెట్‌లో కేటాయింపులు పెంచడానికి బదులుగా 2 శాతానికి కుదించడం దారుణం. నేటికీ మన దేశంలో నూటికి 65 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. కార్పొరేట్లకు ఎలా మేలు చేయాలనే ఆలోచనే తప్ప పేదలకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనే మోడీ ప్రభుత్వానికి లేదనే విమర్శ ఉపాధి కూలీల నుంచి వినిపిస్తున్నది.

Courtesy Nava Telangana