– ఢిల్లీలో ఆటో డ్రైవర్‌కు రూ. 10 వేల జరిమానా

న్యూఢిల్లీ : తన ఆటోపై ‘ఐ లవ్‌ కేజ్రీవాల్‌’ అని పోస్టర్‌ అంటించినందుకు ఢిల్లీ పోలీసులు ఓ డ్రైవర్‌కు రూ. 10 వేల జరిమానా విధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే… ఢిల్లీకి చెందిన రాజేశ్‌ తన ఆటోపై ‘ఐ లవ్‌ కేజ్రీవాల్‌’ అనే పోస్టర్‌ను అతికించినందుకు ఈనెల 15న పోలీసులు జరిమానా విధించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదనీ, కేజ్రీవాల్‌పై ఉన్న అభిమానంతో గతేడాదే తన ఆటోపై ఆ పోస్టర్‌ అంటించానని బాధితుడు చెబుతున్నా వినకుండా పోలీసులు ఫైన్‌ వేశారు. దీంతో పోలీసులు తన ప్రాథమిక హక్కును కాలరాశారని ఆరోపిస్తూ అతడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై హైకోర్టు ఆమ్‌ఆద్మీ పార్టీ, ఢిల్లీ పోలీసులు, ఎలక్షన్‌ కమిషన్‌ స్పందన కోరింది. బహుశా అతడు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు పోలీసులు ఫైన్‌ వేసి ఉండొచ్చునని ఈసీ తరఫు న్యాయవాది వాదించడం గమనార్హం. అయితే, అదేం రాజకీయ పార్టీ ప్రచారం కాదనీ, డ్రైవర్‌ అభిమానం కొద్ది గతేడాది అతికించిన పోస్టర్‌ అని అతడి తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. వాదనలు విన్న కోర్టు.. ఈ కేసును మార్చి 3కి వాయిదా వేసింది. ఇదే విషయమై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ స్పందిస్తూ… కేంద్రంలోని బీజేపీ సర్కారు పోలీసుల సాయంతో పేదవారిని టార్గెట్‌ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Courtesy Nava Telangana