* రివర్స్‌గేర్‌లో ఆటోమొబైల్‌ 
* భారీగా తగ్గుతున్న వాహనాల అమ్మకాలు
* మూతపడుతున్న సంస్థలు
* ఉపాధి కోల్పోతున్న ఉద్యోగులు

దేశ ఆర్ధిక ప్రగతికి దర్పణం లాంటి వాహన పరిశ్రమను మాంద్యం ముంచేసింది. వరుసగా 10వ నెలలోనూ విక్రయాలు భారీగా పడిపోయాయని సొసైటీ ఆఫ్‌ ఆటోమొబైల్‌ మాన్‌ఫాక్చరర్స్‌ (సియోమ్‌) వెల్లడించింది. ఈ మేరకు ఒక నివేదికను సోమవారం విడుదల చేసింది. కార్లు, ద్విచక్ర, వాణిజ్య తదితర అన్ని విభాగాల వాహనాల అమ్మకాల్లో పతనం కొనసాగిందనిఈ నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుత ఏడాది ఆగస్టులో మొత్తం దేశీయ ప్రయాణికుల వాహనాల అమ్మకాల్లో ఏకంగా 31.57 శాతం పతనం కనిపించింది. ఉత్పత్తి 1,96,524 యూనిట్లు మాత్రమే! గత 21 సంవత్సరాలో ఇదే అత్యంత కనిష్ట స్థాయి అమ్మకాలు. 2018 ఇదే మాసంలో 2,87,198 యూనిట్ల అమ్మకాలు జరిగాయని సియోమ్‌ తెలిపింది. సియోమ్‌ రిపోర్టు ప్రకారం ఈ ఏడాది ఆగస్టులో ప్యాసింజర్‌ వాహనాలు (పివి), ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలు (సివి) 18,21,490 యూనిట్ల విక్రయాలు జరిగాయి. 2018 ఇదే ఆగస్టులో 23,82,436 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. 1997-98 నుంచి సియోమ్‌ రికార్డులను భద్రం చేస్తున్నప్పటి నుంచి ఇంత భారీగా పడిపోవడం ఇదే తొలిసారి. గడిచిన జులై మాసంలోనూ వాహన అమ్మకాలు 18.71 శాతం పతనమై 18,25,148 యూనిట్లకు పరిమితమైంది. అప్పట్లో 19 ఏళ్లలో కనిష్ట అమ్మకాలుగా పేర్కొన్నారు. తాజాగా ఆ పతనం మరింతగా కొనసాగి 21 ఏళ్లలో కనిష్టానికి చేరుకున్నాయి.
2019 ఆగస్టులో ద్విచక్ర వాహన అమ్మకాలు 22.24 శాతం పడిపోయి 15,14,196 యూనిట్లు అమ్ముడయాయి,. ఇదే సమయంలో వాణిజ్య వాహన అమ్మకాలు 38.71 శాతం దిగజారి 51,897 యూనిట్లుగా చోటు చేసుకున్నాయి. 2018 ఆగస్టులో ఈ విభాగంలో 84,668 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గడిచిన మాసంలో మోటార్‌ సైకిల్‌ అమ్మకాలు 22.33 శాతం తగ్గాయి. 2018 ఇదే మాసంలో 12,07,005 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇదే నెలలో 6,69,416 యూనిట్ల స్కూటర్లు అమ్మకాలు క్రితం ఆగస్టులో 22.19 శాతం తగ్గి 5,20,898 యూనిట్లకు పరిమితమయ్యాయి.

దిగ్గజ కంపెనీలు కూడా…
ఇప్పటికే ఉత్పత్తి చేసిన వాహనాలను కొనే వారు దిక్కు లేకపోవడంతో కంపెనీలు అగమ్య గోచరంలో పడ్డాయి. దీంతో ఉత్పత్తిని నిలిపి వేస్తున్నాయి. మాంద్యం దెబ్బతో ఈ రంగంలో అమ్మకాలు లేక సుజుకి మోటార్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతి సుజుకి, అశోక్‌ లేలాండ్‌, టాటా మోటార్స్‌ లాంటి దిగ్గజ కంపెనీలు కూడా ఉత్పత్తికి కోత పెడుతున్నాయి. క్రితం ఆగస్టులో దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) విక్రయాలు 16.58 శాతం కోల్పోయి 38,205 యూనిట్లకు పరిమితమయ్యాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాలు 31.58 శాతం దిగజారి 13,504 యూనిట్లుగా చోటు చేసుకున్నాయి.

ప్రమాదంలో 10 లక్షల ఉద్యోగాలు..
అమ్మకాలు లేకపోవడంతో వాహన కంపెనీలు ఇప్పటికే 15,000 మంది పైగా తాత్కాలిక ఉద్యోగులను తొలగిం చాయి. గత మూడు నెలల్లో దాదాపు 300 డీలర్‌షిప్‌లు మూత పడ్డాయి. డీలర్లు దేశవ్యాప్తంగా 3 లక్షల ఉద్యోగులను తొలగించారు. ఇదే మాంద్యం కొనసాగితే మరో పది లక్షల ఉద్యోగాలు పోతాయనే భయాందోళనలు నెలకొన్నాయి.

(Courtacy Prajashakti)