2018లో ఆరుగురిపై హత్యాచారం..
వరకట్నానికి 186 మంది బలి
పది మందిపై యాసిడ్‌ దాడి
చిన్నారులపై పెరిగిన నేరాలు
కొత్త నేరస్థుల సంఖ్యా అధికమే
దేశంలో రోజూ 80 హత్యలు
రేప్‌ కేసుల్లో శిక్షలు 27శాతమే
జాతీయ నేరాల నమోదు
సంస్థ నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌: మహిళలపై నేరాల్లో జాతీయ స్థాయిలో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. 2018లో రాష్ట్రంలో మహిళలపై నేరాలకు సంబంధించి 16,027 కేసులు నమోదయ్యాయి. వరకట్న వేధింపుల వల్ల 186 మంది మృతిచెందారు. 10 మందిపై యాసిడ్‌ దాడి, ఐదుగురిపై యాసిడ్‌ దాడి యత్నం జరిగింది. వివిధ కారణాలతో 459 మంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆరుగురు హత్యాచారానికిబలయ్యారు.

అత్తింటి వేధింపులపై 6,286 కేసులు నమోదయ్యాయి. ఈ వివరాలను నేషనల్‌ క్రైం రికార్డు బ్యూరో 2018 నివేదిక వెల్లడించింది. 2017తో పోలిస్తే 2018లో రాష్ట్రంలో ఈ నేరాల సంఖ్య తగ్గింది. 2017లో 17,521 కేసులు నమోదయ్యాయి. అంటే ఏడాదిలో 1,494 కేసులు తగ్గాయి. కానీ, చిన్నారులపై నేరాల సంఖ్య పెరిగాయి. దేశవ్యాప్తంగా ఐపీసీ కింద 31,32,954 కేసులు నమోదవగా రాష్ట్రంలో వాటి సంఖ్య 1,13,951. 2017లో ఐపీసీ కింద నమోదైన కేసుల సంఖ్య 1,19,858. ఏడాది కాలంలో 5,907 కేసులు పెరిగాయి. ఐపీసీ కింద నమోదైన నేరాల్లో 19 నగరాల జాబితాలో హైదరాబాద్‌కు 11వ స్థానం దక్కింది. మహిళలపై నేరాల్లో 5వ స్థానంలో నిలిచింది.

తీవ్రమైన నేరాలు 7,652 నమోదయ్యాయి. జాతీయ స్థాయిలో తెలంగాణ వాటా 1.8 శాతం.
2017లో 805 హత్యలు జరగ్గా 2018లో ఆ సంఖ్య 786కు తగ్గింది.
దేశవ్యాప్తంగా 30 కులోన్మాద హత్యలు జరగ్గా తెలంగాణలో ఒక కేసు నమోదైంది.
2017లో 1,560 కిడ్నాప్‌ కేసులు నమోదు కాగా 2018లో సంఖ్య 1,810కు పెరిగింది.
18 ఏళ్లలోపు కనిపించకుండాపోయిన వారికి సంబంధించి 3,090 కేసులు నమోదవగా వీరిలో 75 శాతం మందిని పోలీసులు వెతికి పట్టుకున్నారు.
వివిధ కేసుల్లో 1,408 మంది బాలలు నిందితులుగా ఉన్నారు.
అవినీతి నిరోధక చట్టం కింద 2018లో 139 నమోదయ్యాయి. 2017లో ఈ సంఖ్య 55గా ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా రూ.160.6 కోట్ల సొత్తు చోరీకి గురయింది. పోలీసులు రూ.113.4 కోట్లు రికవరీ చేశారు.
ఐదేళ్లుగా దేశవ్యాప్తంగా ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోందని నివేదిక వెల్లడించింది. తెలంగాణలో 7,845 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
అత్యాచార కేసుల సత్వర పరిష్కారానికి 1,023 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు
మహిళలపై అత్యాచారాలు, చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల కేసుల సత్వర పరిష్కారానికి దేశంలోని 1,023 కేంద్రాల్లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని న్యాయ శాఖ నిర్ణయించింది. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ సహా 24 రాష్ట్రాలు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు పథకంలో చేరాయి. మిగతా రాష్ట్రాలు కూడా అంగీకరిస్తే అక్కడా ఏర్పాటు చేస్తారు.

(Courtesy Andhrajyothi)