వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అమెరికాలో ఆసియా దేశాలకు చెందిన వారిపై జాతి విద్వేష నేరాలు క్రమంగా పెరుగుతున్నాయనీ, దీనితో ఆసియన్‌ అమెరికన్‌ వర్గాలు ప్రమాద పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని అమెరికా ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) తన తాజా ఇంటెలిజెన్స్‌ నివేదికలో పేర్కొంది. హౌస్టన్‌లోని ఎఫ్‌బీఐ కార్యాలయం రూపొందించిన ఈ నివేదికను దేశవ్యాప్తంగా వున్న ఆ సంస్థ కార్యాలయాలకు అందచేశారు. కరోనా వైరస్‌ చైనా, ఇతర ఆసియా దేశాల నుంచి తమకు సోకిందని అమెరికన్లలోని ఒక వర్గం భావిస్తుండటమే ఇందుకు కారణమని తాము భావిస్తున్నట్టు ఎఫ్‌బీఐ తమ నివేదికలో పేర్కొంది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాస్‌ఏంజెల్స్‌, న్యూయార్క్‌, టెక్సాస్‌ తదితర నగరాలలో ఆసియా వాసులపై దాడులు పెరిగిన ఘటనలను తాము ఇప్పటికే గమనించామని బ్యూరో తన నివేదికలో వివరించింది. మార్చి 14న టెక్సాస్‌లో జరిగిన ఒక ఘటనను ఎఫ్‌బీఐ తన నివేదికలో ఉదహరించింది. టెక్సాస్‌లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆసియన్‌ అమెరికన్‌ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై కత్తితో దాడి చేసి వారిని గాయపర్చారనీ, అనుమానితుడిని అరెస్ట్‌ చేసినపుడు వారు చైనీయులనీ, కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారని భావించి దాడి చేసినట్టు అధికారులకు చెప్పాడని ఎఫ్‌బిఐ వివరించింది. ఈ ఘటన కేవలం పరిస్థితి తీవ్రతను తెలియచేస్తోందనీ, దీనిని కొట్టిపారేయటాన్ని విరమించుకునీ, పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించాల్సిన అవసరమున్నదని తన అధికారులకు సూచించింది.

జాతి వివక్ష మనపై ప్రభావం చూపనంత వరకూ దానిని కొట్టిపారేయటం సులభమేనని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆసియన్‌, పసిఫిక్‌ అమెరికన్స్‌ జాతీయ డైరెక్టర్‌ గ్రెగ్‌ ఆర్టన్‌ ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘చైనా వైరస్‌’ అని చేసిన విమర్శల తరువాత ఈ జాతి వివక్ష దాడులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయని ఎఫ్‌బీఐ తన నివేదికలో వివరించింది.

Courtesy Nava Telangana