జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు)లో ఆదివారం చోటుచేసుకున్న హింస ఆందోళన కలిగిస్తున్నది. కేంద్రంలో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈ యూనివర్సిటీ ఏదో ఒక కారణంతో వార్తల్లోనూ, వివాదాల్లోనూ నలుగుతూనే ఉన్నది. ఈ దాడులకు భారతీయ జనతాపార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కారణమని కాంగ్రెస్‌, వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపిస్తుండగా, వామపక్ష విద్యార్థులే దాడులు జరిపారని ఏబీవీపీ అంటున్నది. జెఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలు సహా దాడుల్లో తీవ్రంగా గాయపడినవారంతా ఏ విద్యార్థి సంఘానికి చెందినవారో స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్న ఆధారాలను అటుంచితే, ఈ దాడి ప్రజాస్వామ్య సమాజానికి ఓ మాయని మచ్చ.

కొందరు వ్యక్తులు ముసుగులు ధరించి క్యాంపస్‌లోకి చొరబడినవైనం అమితాశ్చర్యం కలిగిస్తున్నది. గంటలపాటు క్యాంపస్‌లో కలయదిరుగుతూ, హాస్టళ్ళల్లోకి చొరబడి మరీ వారు దాడులు కొనసాగించారు. తాము ఎంపిక చేసుకున్న వ్యక్తుల అంతు చూసే లక్ష్యంతో హాస్టల్‌ గదుల తలుపులు తెరిచి మరీ చొరబడ్డారు. దాడులు కొనసాగుతుండగానే, మెయిన్‌ గేట్‌ దగ్గర గుమిగూడిన మరో బృందం పాత్రికేయులపైనా, అక్కడకు చేరిన సామాజిక కార్యకర్తలపైనా వీరంగం వేసింది. జెఎన్‌యులో ఫీజుల హెచ్చింపునకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విద్యార్థులు వింటర్‌ సెమిస్టర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను అడ్డుకొనేందుకు ప్రయత్నించడం ఇప్పటికే ఏబీవీపీ, వామపక్ష విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తత పెంచిన విషయం తెలిసిందే. ఆదివారం ఈ ప్రత్యక్ష దాడులకు పురిగొల్పే ప్రత్యేక ఘటనలేమీ జరగకపోయినా, ఫీజుల పెంపును నిరసిస్తున్నవారే ఇందుకు కారకులంటూ యూనివర్సిటీ అధినేతలు అంతవెంటనే ఎలా నిర్థారించగలిగారో తెలియదు. లోపలివారితో పాటు, బయటివ్యక్తుల చొరబాటుతోనే ఈ దాడులు మరింత ఉధృతంగా, ప్రణాళికాబద్ధంగా సాగాయని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది.

జెఎన్‌యూ క్యాంపస్‌ను ఆనుకొని ఉన్న బాబా గంగ్‌నాథ్‌ మార్గంలో రెండు కిలోమీటర్ల మేరకు ఆదివారం సాయంత్రం నుంచి వీధిలైట్లు పనిచేయడం మానేశాయట. ఈ కారణంగా క్యాంపస్‌ ప్రధాన ద్వారం సహా అనేక గేట్లు చీకట్లో మగ్గిపోవడం, ముసుగులు ధరించిన వ్యక్తులు పోలీసుల సమక్షంలోనే అక్కడ నిలబడి ఉండటం విమర్శలకు తావిస్తున్నది. అలాగే, పోలీసులు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఓ పాతికమందిని క్యాంపస్‌ లోపలకు పంపించడం సైతం అనుమానాలకు తావిచ్చింది. వీరంతా సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులన్న సమర్థన అక్కడ గుమిగూడినవారిలో ఏమాత్రం నమ్మకం కలిగించలేదు. లోపల విద్యార్థులపై దాడులు కొనసాగుతున్నప్పుడు సాయుధ పోలీసులు సైతం చేష్టలుడిగి చూస్తున్నప్పుడు వీరంతా లోపలకు పోయి ఏం చేస్తారన్నది సహజంగానే కలిగే అనుమానం. పౌరసత్వ చట్టసవరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్న కారణంగా, కొద్దిరోజులుగా జెఎన్‌యూ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసుల నిఘా, బందోబస్తు బలంగానే ఉంది.

అనుమానితులను ముందుగానే నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. ఆదివారం క్యాంపస్‌ను ఆనుకొని ఉన్న ఓ ప్రాంతంలో పౌరసత్వచట్ట సవరణకు వ్యతిరేకంగా చిన్న సమావేశం జరుగుతున్నందున పోలీసులు 144వ సెక్షన్‌ కూడా విధించారు. అయినప్పటికీ, చేతిలో కర్రలు, హాకీస్టిక్స్‌ ధరించిన వ్యక్తులు క్యాంపస్‌ లోపలకు స్వేచ్ఛగా పోగలిగారు, రాగలిగారు, కొన్ని గంటలపాటు ఆ ప్రాంతాల్లో సంచరించగలిగారు. యావత్‌ ఘటనలో క్యాంపస్‌ భద్రతాసిబ్బంది, పోలీసులు, దుండగులకు మధ్య ఒక అవగాహన కనిపిస్తున్నది. హాస్టల్లోకి దూరిమరీ చావబాదామంటూ కొందరు గర్వంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టుకోగలగడం మనచుట్టూ అలుముకొని ఉన్న వాతావరణానికి నిదర్శనం.

ముసుగు దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి సంఘం నాయకురాలు ఐషూ ఘోష్‌ వారిని గుర్తించి కేసులు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో ఈ ఘటనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఢిల్లీ పోలీసులు పనిచేసేది కేంద్రహోంశాఖ ఆధ్వర్యంలోనే కనుక అమిత్‌షా రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇవన్నీ అటుంచితే, ఢిల్లీ ఎన్నికల ప్రకటనకు ముందు ఈ దాడులు సాగడం కాకతాళీయం కాకపోవచ్చు. జెఎన్‌యూను విలన్‌గా నిలబెట్టే పని ఇకపై మరింత బలంగా సాగవచ్చు. మా కాలంలో ఈ తుక్డే తుక్డే గ్యాంగ్‌లు లేవంటూ విదేశాంగమంత్రి జయశంకర్‌ చేసిన వ్యాఖ్యలు, కేజ్రీవాల్‌ పెంచిపోషించిన గ్యాంగ్‌లే జెఎన్‌యూను, ఢిల్లీని అప్రదిష్టపాల్జేస్తున్నాయన్న అమిత్ షా విమర్శలు ఎన్నికల వ్యూహానికి అద్దం పడుతున్నాయి.

(Courtesy Andhrajyothi)