ప్రకాశ్‌ కరత్‌ 

మన ఫెడరల్‌ రాజ్యాంగంపై మోడీ ప్రభుత్వం మెరుపుదాడి చేసింది. మోడీ-షా ద్వయం ఆధ్వర్యంలో 370 ఆర్టికల్‌ రద్దు చేయబడింది. దానికి అనుబంధంగా ఉన్నటువంటి 35ఎ అధికరణం నిర్వీర్యం చేయబడింది. వాళ్లు అక్కడితో ఆగకుండా జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర ఉనికి మీదనే దాడిచేశారు. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీయడం ద్వారా రాష్ట్రాన్ని రద్దుచేశారు. ఇదంతా కూడా వాళ్లు రహస్యంగా జమ్మూకాశ్మీర్‌ ప్రజలను నిర్బంధంలో ఉంచి చేశారు. దీనికి సంబంధించిన రాష్ట్రపతి ఆదేశం, 370 అధికరణాన్ని రద్దు చేస్తూ బిల్లు తీర్మానాలు, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం ఇదంతా కూడా రాజ్యాంగంపై చేసిన కుట్రలా జరిగింది.

ఆగస్టు 6 వరకూ దేశంలో 29 రాష్ట్రాలుండేవి. పార్లమెంటు ఉభయ సభలు జమ్మూకాశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించడంతోనే ఈ సంఖ్య 28కి తగ్గింది. స్వతంత్ర భారత చరిత్రలో ఇటువంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. రాష్ట్ర శాసనసభ అభిప్రాయాలను తెలుసుకోకుండా రాష్ట్రాల సరిహద్దులు మార్చడం లేదా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడాన్ని నిషేధిస్తున్న రాజ్యాంగంలోని మూడవ అధికరణాన్ని బీజేపీ ప్రభుత్వం ఉల్లంఘించింది. రాష్ట్రాల హక్కుల మీద, ఫెడరలిజం మీద ఇంతటి నగమైన దాడి గతంలో ఎన్నడూ జరగలేదు.

జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిస్తున్న 370 అధికరణాన్ని రాజ్యాంగసభ మన రాజ్యాంగంలో చేర్చింది. ఈ అధికరణం జమ్మూకాశ్మీర్‌కు దేశంలోని ఇతర రాష్ట్రాలకు లేని స్థాయి కల్పించింది. దీనివల్ల ఆ రాష్ట్రానికి తన సొంత రాజ్యాంగాన్ని రాసుకునే రాజ్యాంగ అసెంబ్లీ ఉంటుంది. జమ్మూకాశ్మీర్‌కు దీని ద్వారా విస్తృతమైన స్వయంప్రతిపత్తి కల్పించబడింది. రాష్ట్ర శాసనసభ ఏర్పాటు అయినప్పుడు అది పార్లమెంటు చేసిన చట్టాల్లో ఏ చట్టాలనూ రాష్ట్రానికి వర్తింపజేయొచ్చో నిర్ణయిస్తుంది.

370 అధికరణం పూర్వ రంగం

స్వాతంత్య్రానికి ముందు సంస్థాన రాజ్యంగా ఉన్న జమ్మూకాశ్మీర్‌లో రెండు భాగాలుండేవి. ఇప్పుడు భారత దేశంలో ఉన్న భాగం, పాక్‌ ఆక్రమిత కాశ్మీరు. అప్పటి మహారాజు హరిసింగ్‌ ఈ సంస్థానాన్ని భారత్‌లో కలపడానికి ఇష్టపడలేదు. జమ్మూకాశ్మీర్‌ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని ఆయన కోరుకున్నాడు. అందువల్ల 1947 ఆగస్టు 15 నాటికి దీనిపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఆనాడు షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ జమ్మూకాశ్మీర్‌ ఫ్యూడల్‌ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఆనాడు అనేక సంస్థానాల్లో జరిగిన ఫ్యూడల్‌ వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో ఇది ఒక భాగంగా నడిచింది.
ఎప్పుడైతే పాకిస్థాన్‌ నుంచి – వాయువ్య సరిహద్దుల్లోని పఠాన్లు జమ్మూ కాశ్మీర్‌పై దురాక్రమణం చేస్తూ శ్రీనగర్‌ నగర సరిహద్దులకు చేరుకున్నారో అప్పుడు, అంటే 1947 అక్టోబర్‌ 26న కాశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేయడానికి మహారాజు అంగీకరిస్తూ సంతకం చేయడానికి సిద్ధపడ్డాడు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వెనుక సమీకృతమైన కాశ్మీర్‌లోయకు చెందిన ప్రజలు దురాక్రమణదారులకు వ్యతిరేకంగా పోరాడారు. భారత సైన్యం విమానాల ద్వారా శ్రీనగర్‌కు చేరుకుంది. దురాక్రమణదారులను వెనక్కుగొట్టింది.
ఇటువంటి పరిస్థితుల్లో మన రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగసభ 370 అధికరణాన్ని అందులో చేర్చింది. అందువల్ల 370వ అధికరణం అనేది భారత ప్రభుత్వానికీ కాశ్మీర్‌ ప్రజల ప్రతినిధులకూ మధ్య జరిగిన ఒడంబడిక. తమ సొంత గుర్తింపును, ”కాశ్మీరియత్‌” అని సాధారణంగా పిలిచే తమ సొంత జీవన విధానాన్ని భారతదేశంలో అంతర్భాగంగా నిలుపుకోవాలని కాశ్మీర్‌ ప్రజలు వాంచించారు.
భారతదేశానికి సంబంధించి ఈ ఒప్పందం ప్రాముఖ్యత ఏమిటంటే… మొత్తం దేశం ద్విజాతి సిద్ధాంతం ఆధారంగా మతప్రాతిపదికపై విడిపోయినప్పుడు ముస్లిమ్‌ మెజారిటీగా ఉన్న ఒక రాష్ట్రం లౌకిక రాజ్యమైన భారతదేశంలో కలవడానికి సిద్ధపడింది. దేశవిభజన సమయంలో వాయువ్య భారతదేశమంతా మత ఘర్షణలతో అట్టుడికిపోయినప్పుడు కాశ్మీర్‌లోయ మాత్రం శాంతికి, మతసామరస్యానికి స్వర్గధామంగా మారింది.

370 అధికరణాన్ని క్రమంగా నీరుగార్చారు

ఈ ఒప్పందం నుంచి క్రమంగా వెనుక్కుపోవడమే కాశ్మీర్‌ సమస్యలకు మూలకారణం. 1953 నుంచి వరుసగా అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలన్నీ 370 అధికరణం కింద జమ్మూకాశ్మీర్‌కు లభించిన పౌర ప్రతిపత్తిని హరించేేస్తూ వచ్చాయి. ఈ రకంగా అధికార కేంద్రీకరణ, రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని హరించడం 1960, 70, 90 దశకాల్లో కూడా కొనసాగింది. రాష్ట్రానికి ఇచ్చిన స్వయం ప్రతిపత్తికి సంబంధించిన అనేక అంశాలను తొలగిస్తూ 370 అధికరణాన్ని తొత్తడం చేశారు. ‘రాజ్యాంగం, జమ్మూకాశ్మీర్‌కు వర్తించే ఆదేశం’ 1954 దగ్గర నుంచి 2010 వరకూ దీనికి సంబంధించి 42 ఆదేశాలు జారీచేశారు. ఇవన్నీ కూడా 370 అధికరణం ఆమోదించినప్పుడు లేని కేంద్రం జోక్యాలను, చట్టాలను ముందుకు తీసుకొచ్చాయి. ఎజి నూరాని సోదాహరణమైన పత్రాల ద్వారా పేర్కొన్నట్టు ఈ అధికార కేంద్రీకరణ క్రమంలో 370 అధికరణాన్ని అధికరణంలోని అసలు సారాన్ని లేకుండా చేసింది. కేంద్ర జాబితాలోని మొత్తం 97 అంశాల్లో (చట్టం చేయబడ్డ అంశాలు) 94 అంశాలు జమ్మూకాశ్మీర్‌కు వర్తింపజేశారు.
పరాయీకరణ, మిలిటెన్సీ పెరుగుదల
స్వయంప్రతిపత్తిని నీరుగార్చడంతోపాటు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయడం, ప్రజాస్వామ్య హక్కులను అణిచివేయడం జరిగింది. ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టారు. 1987 మాదిరిగా అనేకమార్లు కేంద్రం ప్రోద్బలంతో ఎన్నికలను నగంగా రిగ్గింగ్‌ చేశారు. ఇటువంటివి పూర్వరంగంలోనే పరాయీకరణ పెరిగి మిలిటెన్సీ ‘ఆజాద్‌’ నినాదంతో సాయుధ పోరాటాలు పెరిగాయి. కాలం గడిచేకొద్దీ ఈ అసంతృప్తిని పాకిస్థాన్‌ మద్దతుగల పిగ్బుల్‌ ముజాహిద్దీన్‌ తరువాత కాలంలో జైష్‌-ఇ-మహమ్మద్‌, లష్కర్‌్‌-ఇ-తోయిబా వంటి పాకిస్థాన్‌ కేంద్ర పచ్చి టెర్రరిస్టు సంస్థలు ఉపయోగించుకున్నాయి.
ఫ్యూడల్‌ పాలనకు వ్యతిరేకంగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ జరిపిన ఉద్యమాన్ని ప్రారంభం నుంచి హిందూ మతతత్వ శక్తులు వ్యతిరేకిస్తూ వచ్చాయి. జనసంఫ్‌ుకు పూర్వరూపమైన ప్రజాపరిషత్‌ వాస్తవానికి మహరాజాకు మద్దతిచ్చింది. జనసంఫ్‌ు హిందూ మహాసభలు 370 అధికరణాన్ని, జమ్మూకాశ్మీర్‌కు ఎటువంటి స్వయం ప్రతిపత్తినైనా యివ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. ఈ హిందూత్వ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుతో పనిచేసే జనసంఫ్‌ు దాని తరువాత రూపొందిన బీజేపీ 370 అధికరణాన్ని నిరంతరం వ్యతిరేకించాయి. ఏకీకృత కేంద్రీకృత భారతదేశం వారి సిద్ధాంతం. అంతే కాకుండా కాశ్మీర్‌లోయ ముస్లిమ్‌ ఆధిపత్య ప్రాంతంగా ఉండడం కూడా వారి వ్యతిరేక భావనకు కారణం.
జమ్మూ కాశ్మీర్‌ విచ్ఛిన్నం : హిందూత్వ కుట్ర
సరిహద్దుకు అవతల ఉన్న ఇస్లాంవాదుల మాదిరిగానే ఇక్కడ హిందూత్వవాదులు, అరెస్సెస్‌ వాళ్లు జమ్మూ, కాశ్మీర్‌ను మతప్రాతిపదికపై మూడు ముక్కలుగా చేయాలని అంటే హిందూ మెజారిటీగల జమ్మూ, ముస్లిమ్‌ ఆధిపత్య కాశ్మీర్‌లోయ బుద్ధిస్టులు కొద్ది మెజారిటీగా గలిగిన లఢక్‌గా విడగొట్టాలని యోచిస్తూ వచ్చారు. ముస్లిమ్‌ మెజారిటీ గల జమ్మూకాశ్మీర్‌ ఒక సర్వమత రాష్ట్రంగా ఉండడం అనేది వారికి రుచించని విషయం.
ఆరెస్సెస్‌ – బీజేపీ కథనం ప్రకారం కాశ్మీర్‌ లోయలో ముస్లిమ్‌లు అధికంగా ఉండడం వల్లే అది వేర్పాటువాదం, ఉగ్రవాదాలకు నిలయంగా ఉంది. వాళ్లలో గూడుకట్టుకున్న ఈ ముస్లిమ్‌ వ్యతిరేకత వల్లే వాళ్లు కాశ్మీర్‌ ప్రజల ప్రజాతంత్ర ఆంక్షలకు వ్యతిరేకంగా మారారు. 370 అధికరణం రద్దు చేయడం అంటే వాళ్ల ఉద్దేశం కాశ్మీర్‌ లోయలోని ప్రజలను భద్రతాదళాల యంత్రాంగంతో అణిచివేయవచ్చుననే. ఆరెస్సెస్‌, మోడీ-షా ద్వయం ఉద్దేశంలో కాశ్మీర్‌ అనేది అఖండ భారత్‌లో భాగమైన ఒక ప్రాంతం మాత్రమే. అందులోని ప్రజలు మాత్రం ముస్లిములు కాబట్టి వాళ్లని పరాయివారిగా చూశారు. జమ్మూను, కాశ్మీర్‌లోయను మతపరంగా విభజించడానికి ఆరెస్సెస్‌, బీజేపీలు విశ్వప్రయత్నాలు చేశాయి. 2014లో మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రయత్నాలు మరింత ఊపందుకున్నాయి. మిలిటెన్సీని అణిచివేసినట్టే రాష్ట్రంలోని ప్రజల నిరసనలు కూడా అణిచివేయడానికి, రాజకీయ చర్చలకు తలుపులు మూసేయడానికి బీజేపీ ప్రభుత్వం తీసుకున్న దుందుడుకు విధానం ఆ రాష్ట్రంలో పరిస్థితిని మరింత దిగజార్చింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆ రాష్ట్రంలోని యువకులు ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో మిలిటెంట్లుగా మారిపోతున్నారు. ఒకవైపు చనిపోతున్న రక్షణదళాల సంఖ్య, మరోవైపు మిలిటెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రాన్నే పెద్ద జైలుగా మార్చేశారు. బీజేపీ పాలకులు ప్రజల పట్ల ఎంత క్రూరంగా వ్యవహరిస్తారో ఇటీవల పార్లమెంటులో ఆ రాష్ట్ర ప్రతిపత్తిని మార్చే రాజ్యాంగ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ముందు వాళ్లు నిర్వహించిన భారీ సైనిక చర్య తెలియజేస్తోంది. వేలాదిమంది అదనపు కేంద్ర బలగాలను, సైన్యాన్ని విమానాల్లో తీసుకొచ్చి రాష్ట్రంలో మోహరించారు. ప్రధాన రాజకీయపార్టీల నాయకుల్ని నిర్బంధించారు. ఇంటర్నెట్టు, మొబైల్‌ ఫోన్‌ సర్వీసులను నిలిపి వేయడం ద్వారా సమాచార బ్లాక్‌అవుట్‌ అమలుచేశారు. అమర్‌నాధ్‌ యాత్రను రద్దుచేశారు. టూరిస్టులను వెనక్కు పంపించేశారు. కాశ్మీర్‌ను ఒక పెద్ద జైలుగా మార్చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఒక ప్రభుత్వం ఈ విధంగా ఒక రాష్ట్ర ప్రజలతో వ్యవహరించింది. వాళ్ల పేరుతో, వాళ్ల ప్రమేయం లేకుండా వాళ్ల జీవితాల్లో పెనుమార్పులు సృష్టించింది.
తప్పుడు వాదనలు
370 అధికరణాన్ని రద్దు చేసేందుకు హోమ్‌ మంత్రి అమిత్‌షా పార్లమెంట్‌లో ముందుకు తెచ్చిన వాదనలన్నీ కట్టుకథలు, హిందూత్వ శిబిరం కోసం అల్లిన కథలే. జమ్మూ, కాశ్మీర్‌ భారతదేశంలో విలీనం కావడానికి 370 అధికరణం అడ్డంకిగా ఉందని ఆయన అన్నాడు. నిజానికి కాశ్మీర్‌ లోయలోని ప్రజలు భారత ప్రభుత్వం ఇచ్చిన హామీల ఆధారంగానే భారత్‌లో ఐచ్ఛికంగా కలిశారు. ఆ హామీలే తరువాత 370 అధికరణంలో చేర్చబడ్డాయి. కాశ్మీర్‌ ప్రజలకు ఇచ్చిన ఈ రాజ్యాంగ రక్షణ పైనే భారతదేశంలో కాశ్మీర్‌ ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉంది.
370వ అధికరణం జమ్మూ కాశ్మీర్‌లో వేర్పాటువాదం, ఉగ్రవాదం పెరగడానికి కారణం అని అమిత్‌ షా మరోవాదన చేశారు. కానీ వాస్తవం ఏంటంటే 370 అధికరణంలోని స్వయం ప్రతిపత్తిని హరించేయడం, రాష్ట్రంలోని ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడం వీటివల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగి పరాయీకరణ తీవ్రమైంది. దీనివల్ల వేర్పాటువాదం, పాకిస్థాన్‌ ఉగ్రవాదం పెరిగాయి. అందువల్ల స్వయంప్రతిపత్తిని పునరుద్ధరించడం, ప్రజల్లో పరాయీకరణ తగ్గించడం ద్వారా మాత్రమే ఈ సమస్య పరిష్కరించగలం.
370 అధికరణం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి, ఆర్థిక పెరుగుదల లేకుండా పోయాయని అమిత్‌షా అంటున్నారు. కానీ గత మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో పెరిగిన మిలిటెన్సీ, అస్థిర వాతావరణం వలననే అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. ఆర్థిక అభివృద్ధి అవకాశాలు తగ్గాయి. రాజకీయ పరిష్కారం కనుగొనకుండా శాంతి, సాధారణ పరిస్థితి పునరుద్ధరించకుండా అమిత్‌షా చెప్పిన అభివృద్ధి గానీ, అభివృద్ధిని పెంచడం గానీ, నిరుద్యోగాన్ని తగ్గించడంలో గానీ, రాష్ట్రంలోకి ప్రయివేటు పెట్టుబడులు వస్తాయనుకోవడం గానీ కేవలం భ్రమలే అవుతాయి.
చివరిగా రాష్ట్రంలో అవినీతికీ, ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి కూడా 370 అధికరణమే కారణమని అమిత్‌షా పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌ అవినీతికీ, అధికార అసమర్థతకూ గురైన మాట వాస్తవమే. అటువంటి పరిస్థితి జవాబుదారీతనం లేకపోవడం వల్ల ప్రజాతంత్ర క్రమం నాశనమవడం వల్ల ఏర్పడుతుంది. చాలాకాలంగా జమ్మూ, కాశ్మీర్‌ ఒక పోలీస్‌రాజ్యంగా మారింది. ఈ సుదీర్ఘకాలం (అంతా కలిపి 10 ఏండ్ల వరకూ) కేంద్ర పరిపాలనలో ఉంది. కేంద్రీకృతమైన అధికారుల – భద్రతాదళాల యంత్రాంగం, జవాబుదారీతనంలేని వారి రాజకీయ సహచరులు.. వీళ్లు రాష్ట్రంలో అవినీతికి కారకులు.
రాజ్యాంగ విద్రోహం
రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం చేసిన ఈ కుట్ర ఒక నిరంకుశ ప్రభుత్వ లక్షణం. ఈ రోజు అటువంటి ప్రభుత్వం మన దేశాన్ని పరిపాలిస్తోంది. 370 అధికరణం కింద రాష్ట్రపతి ఆదేశాన్ని ఉపయోగించుకొని 367 అధికరణాన్ని మార్పు చేశారు. ఈ మార్పులను ఉపయోగించుకొని 370వ అధికరణం యొక్క సారాంశాన్ని రద్దు చేశారు. జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రపతి పాలనకింద ఉంది కాబట్టి రాష్ట్రశాసనసభ ఆమోదం తెలపాలన్న నిబంధనను ఈ కుట్రద్వారా తోసిపుచ్చారు.
పాలకపార్టీ వ్యూహాలు, మోడీ ప్రభుత్వ ఒత్తిళ్ల ప్రభావం ప్రతిపక్ష పార్టీల మీద కూడా ఉంది. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ ఫెడరల్‌ వ్యతిరేక చర్యలకు బీజేడీి, వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌ ఇంకా ఇతర రాష్ట్రీయపార్టీలు వరుసపెట్టి మద్దతు ఇవ్వడానికి కారణం ఇదే. తను కూర్చొన్న కొమ్మను తానే నరుక్కున్న సామెత లాగ ఈ పార్టీలు వ్యవహరించాయి. 370 అధికరణం కింద జమ్మూకాశ్మీర్‌కు ఉన్న స్వయంప్రతిపత్తిని హరించి వేయడంలో అసలు దోషి అయిన కాంగ్రెస్‌ పార్టీ ఏకమాట మీద వ్యవహరించలేకపోయింది. దీనిని ప్రతిఘటించడంలో అసమర్థంగా వ్యవహరించింది.

సుదీర్ఘపోరాటం ముందుంది

రాష్ట్రపతి ఆదేశం మీద, ఆమోదింపబడిన బిల్లులు మీద న్యాయస్థానాల్లో సవాలు చేస్తారనే విషయంలో సందేహం లేదు. అయితే కాశ్మీర్‌ ప్రజలకిచ్చిన హామీలకు ద్రోహం తలపెట్టడానికి వ్యతిరేకంగా రానున్న కాలంలో సుదీర్ఘమైన పోరాటం చేయాల్సి ఉంది. ఇది కేవలం జమ్మూ, కాశ్మీర్‌ కోసం మాత్రమే కాదు. ఇది మొత్తం భారతదేశ ప్రజాస్వామ్యం, ఫెడరలిజాలకోసం జరిగే పోరాటం.
రాజ్యాంగంలోని 370వ అధికరణం కింద జమ్మూకాశ్మీర్‌కు కల్పించిన స్వయంప్రతిపత్తిని రక్షించడంకోసం సీపీఐ(ఎం) స్థిరంగా నిలబడుతుంది. 370వ అధికరణం కింద స్వయంప్రతిపత్తిని రాష్ట్రానికి లభించిన అధికారాలను హరించేయడానికి వ్యతిరేకంగా పార్టీ నిరంతరం పోరాడింది. బీజేపీ వైఖరికి భిన్నంగా సీపీఐ(ఎం) జమ్మూకాశ్మీర్‌కు గరిష్ట స్వయంప్రతిపత్తి కావాలని, దాని కింద ఉన్న మూడు ప్రాంతాలు – జమ్మూ, కాశ్మీర్‌లోయ, లఢక్‌లకు ప్రాంతీయ స్వయంప్రతిపత్తి కావాలని సీపీఐ(ఎం) కోరుతోంది. ఒకవైపు ఉగ్రవాదుల సాయుధ హింసాకాండను గట్టిగా ఎదుర్కొంటూ సరిహద్దు ఆవలినుండి వచ్చే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చురుకైన చర్యలు తీసుకోవాలని పార్టీ కోరుతూనే మరోవైపు ఈ సమస్యకు పరిష్కారం కోసం రాష్ట్రంలోని అన్ని రకాల రాజకీయ అభిప్రాయాలు గల వ్యక్తులతోనూ, శక్తులతోనూ చర్చలు నడపాలని పార్టీ పిలుపునిస్తోంది.

370 అధికరణాన్ని రద్దు చేయడం ద్వారా జమ్మూకాశ్మీర్‌ను భారతదేశంతో ‘విలీనపరచాల’ని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యకు వివిధ సెక్షన్ల ప్రజల నుండి మద్దతు లభించింది. మోడీ ప్రభుత్వం అధికారిక కథనం ప్రచారంలో పెట్టినట్టు రాష్ట్రంలో వేర్పాటువాదాన్ని, ఇతర వాదాన్ని అంతం చేయడానికి ఇది ఒక నిర్ణయాత్మక చర్యగా భావిస్తున్నారు. కానీ ఈ చర్య దీర్ఘకాలిక పర్యవసానాలు జమ్మూకాశ్మీర్‌కు గానీ, భారతదేశానికి గానీ ఎలా ఉంటాయో ప్రజలకింకా తెలియలేదు. వామపక్ష ప్రజాతంత్రశక్తులు, జమ్మూకాశ్మీర్‌ భిన్న సంస్కృతిని, లౌకికతత్వాన్ని కాపాడేందుకు జరిపే పోరాటాన్ని మొత్తం హిందూత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, భారతదేశంలో ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, ఫెడరలిజాన్ని రక్షించుకోవడం కోసం జరిగే పోరాటంతో జతపరచాల్సిన అవసరం ఉన్నది.

 

(Courtacy Nava Telangana)