రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పెత్తందారీ శక్తులు రెచ్చిపోవడం, పోలీసులు వారికి వత్తాసుగా నిలవడంతో దళితులకు, బలహీన వర్గాలకు నానాటికీ రక్షణ కొరవడుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడ్ని చితకబాది శిరోముండనానికి పాల్పడడం పోలీసుల అమానుషత్వానికి పరాకాష్ట. సీతానగరం మండలం మునికూడలిలో ఈ నెల 18వ తేదీ రాత్రి ఇసుక లారీ ఢకొీని ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో ఆ గ్రామానికి చెందిన దళిత యువకుడు వరప్రసాద్‌ ఆ లారీని అడ్డుకున్నాడు. ఇసుక వ్యాపారి, వైఎస్‌ఆర్‌సిపి నాయకుల ఫిర్యాదు మేరకు (కాదు కాదు వారి ఆదేశానుసారం) ఎస్‌ఐ ఫిరోజ్‌ ఖాన్‌ 20వ తేదీన వరప్రసాద్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాది, శిరోముండనం చేయించారు. యువకుడ్ని ఢకొీట్టిన లారీని, దాని యజమానిపై చర్యలు తీసుకోవలసిన పోలీసులు అది మానేసి అన్యాయాన్ని ప్రశ్నించిన దళితునిపై దాష్టీకానికి తెగబడడం దారుణం. ప్రజలకు రక్షకులుగా వుండాల్సిన పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరించడం పరిపాలనా వ్యవస్థ దిగజారుడుకు సంకేతం.

అదే రోజున ప్రకాశం జిల్లా చీరాలలో దళిత యువకుడు కిరణ్‌ కుమార్‌ను మాస్క్‌ ధరించలేదన్న సాకుతో పోలీసులు కొట్టడం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన 21న మరణించడం హృదయ విదారకం. మాస్క్‌ వేసుకోలేదని నిర్బంధించి, జీపులో తీసుకువెళ్లినపుడు కిరణ్‌ దూకడం వల్ల గాయపడ్డాడన్నది పోలీసుల కథనం. ఏది ఏమైనా కిరణ్‌ మృతికి పోలీసుల ‘అత్యుత్సాహమే’ కారణమన్నది జనవాక్యం. ఒక్క వారంలోనే రెండు జిల్లాల్లో ఈ దుర్మార్గాలు చోటుచేసుకోవడంతో రాష్ట్రంలో తమకు రక్షణ కొరవడుతోందన్న భావన దళితుల్లో కలగడం సహజం. చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో దళిత, మైనారిటీ బాలికలపై అత్యాచార ఘటనలు ఇటీవల వెలుగులోకొచ్చాయి. ఘటనలపై విచారణ, పోలీసులపై కేసు నమోదు, సస్పెన్షన్‌వంటి చర్యలు ప్రభుత్వం ప్రకటించినా బాధిత తరగతుల్లో విశ్వాసం కలిగిందని చెప్పలేం.

సంచలనం సష్టించిన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దళితుల శిరోముండనం జరిగి ఇరవై మూడేళ్లు గడిచినా బాధితులకు న్యాయం జరగలేదు. ముగ్గురు దళిత యువకులకు శిరో ముండనం చేయించిన ఆ కేసులో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత అధికార పార్టీ నేత ప్రధాన నిందితుడు. దళితులపై దాడులకు తెగబడిన పెత్తందార్లు అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో నాయకులుగా చలామణీ అవుతున్నారు. దోషులకు శిక్ష పడకపోవడంతో సీతానగరం లాంటి ఘటనలు పునరావతమవుతున్నాయన్న ప్రజా సంఘాల ఆక్షేపణ అక్షర సత్యం. అలాగే దోషులపై ఆయా రాజకీయ పార్టీలు వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే ఇలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట పడుతుంది.

కుల వివక్షను కట్టడి చేయడానికి, బలహీనులపై దాడులను అరికట్టడానికి జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలి. ఎస్‌సి, ఎస్‌టిల మీద జరిగే దౌర్జన్యాలను అరికట్టడానికి, నిందితులపై తగిన చర్యలు తీసుకునేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకు ఉద్దేశించిన వివిధ స్థాయిల్లోని మానిటరింగ్‌ సెల్స్‌ సరిగా పని చేయడంలేదు. జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష జరగాలని నిబంధనలున్నా రాష్ట్రంలో ఐదారు జిల్లాల్లోనే అది కూడా ఆరు నెలలకు లేదా ఆపైన ఒకసారి చొప్పున జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అధ్యక్షతన మూడునెలలకొకసారి, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆరు నెలలకొకసారి పరిస్థితిని సమీక్షించాలని నిబంధనలున్నా అవి అమలు కావడం లేదు. ఈ ఏడాది కాలంలో జగన్మోహన్‌ రెడ్డి కాని, గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు కాని ముఖ్యమంత్రి హోదాలో ఈ సమీక్షలు జరపలేదంటే ఈ తరగతులపట్ల వారికెంత శ్రద్ధ వుందో తేటతెల్లమవుతోంది. ఇప్పటికైనా దోషులను శిక్షించడానికి ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి. బాధిత ప్రజానీకం సమాజంలోని మిగిలిన అణగారిన ప్రజలతో కలిసి అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. తద్వారా పెత్తందార్ల దౌర్జన్యాలకు ముకుతాడు వేయడమేగాక ప్రభుత్వాలను కూడా కదిలించడం సాధ్యమవుతుంది.

Courtesy Prajasakti