ప్రతిజిల్లాలో 100పైగా పెండింగ్‌ కేసులు
వచ్చే నెల 2నుంచి జిల్లాకో ఎఫ్‌టీఎస్‌ కోర్టు
న్యూఢిల్లీ: దేశంలో మహిళలకే కాదు చిన్నారులకూ రక్షణలేకుండా పోతుంది. ఏటేటా చిన్నారులపై వేధింపులు పెరిగిపోతుండటంతో అదే క్రమంలో వాటికి సంబంధించిన కేసులూ పెరిగిపోతున్నాయి. దీంతో బాలల వేధింపులకు సంబంధించిన కేసులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. న్యాయమంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 389 జిల్లాల్లో.. ప్రతి జిల్లాలోనూ 100కు పైగా కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అంటే ఆ కేసుల సంఖ్య సుమారు 38వేలకు పైమాటే. ఈ కేసులను ప్రత్యేకంగా విచారించడానికి ప్రతి జిల్లాలోనూ ఫాస్ట్‌ ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు (ఎఫ్‌టీఎస్‌సీ) ఏర్పాటు చేయాలని న్యాయమంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.
ఈ 389జిల్లాల్లో కేవలం పోక్సో కేసులనే విచారించేందుకు ప్రత్యేకంగా పోక్సో కోర్టు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
మహిళలపై లైంగికదాడి, పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో దేశవ్యాప్తంగా వివిధ కోర్టులలో మొత్తం 1,66,882కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని త్వరితగతిన విచారించడానికి మొత్తం 1,023 ఎఫ్‌టీఎస్‌సీలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
వీటిలో 389 కోర్టులు కేవలం పోక్సో కేసులనే విచారించనుండగా.. మిగతా 634 ఎఫ్‌టీఎస్‌సీలు లైంగికదాడి కేసులతో పాటు అవసరాన్ని బట్టి పోక్సో కేసులనూ విచారించనున్నాయి. ఈ ప్రత్యేక న్యాయస్థానాలు ఏడాదికి కనీసం 165 కేసులను పరిష్కరిస్తాయని న్యాయ మంత్రిత్వ శాఖ న్యాయ శాఖ తన నివేదికలో పేర్కొంది. ఈ ఎఫ్‌టీఎస్‌సీల ఏర్పాటు ప్రక్రియ అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

Courtesy Navatelangana