-అమెరికాలో ఆఫ్రో-అమెరికన్‌పై పోలీసులు కాల్పులు
– అట్లాంటాలో రేగిన ఆందోళనలు
-నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జీ.. బాష్పవాయుగోళాల ప్రయోగం

వాషింగ్టన్‌: జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతం మరువక ముందే.. జాత్యహంకార ఘటనకు మరొకరు బలయ్యారు. పోలీసుల క్రూరత్వానికి అమెరికాలో మరో ఆఫ్రో-అమెరికన్‌ ‘రెషార్డ్‌ బ్రూక్స్‌ (27) అనే వ్యక్తి బలయ్యాడు. శుక్రవారం రాత్రి అట్లాంటాలో శ్వేతజాతి పోలీసులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ బ్రూక్స్‌ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల నివేదిక ప్రకారం, అట్లాంటా నగరంలోని ఒక రెస్టారెంట్‌ సమీపంలో కారు పార్క్‌ చేసి అందులో నిద్రిస్తున్న రేష్‌హార్డ్‌ బ్రూక్స్‌ను పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. అయితే అతడు అరెస్టు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. అనంతరం సమీపంలోని ఒక హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి బ్రూక్స్‌ మరణించినట్టు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

ఈ ఘటనతో అమెరికాలో మరోసారి ఆందోళనలు భగ్గుమన్నాయి. అట్లాంటా నగరంలోని అతిపెద్ద హైవేను ఆందోళనకారులు బ్లాక్‌ చేశారు. ఘటన జరిగిన వెండీస్‌ రెస్టారెంట్‌కు నిప్పంటించారు. బ్రూక్స్‌పై పోలీసు అధికారి కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇప్పటికే ‘బ్లాక్‌ లైవ్స్‌ మూవ్‌మెంట్‌’తో అట్టుడుతు కున్న అమెరికాలో తాజా ఘటన మరోసారి ఉద్రిక్తతలు రేకెత్తించే అవకాశం ఉంది. ఈ ఘటనపై అట్లాంటా నగర మేయర్‌ స్పందించారు. రెషార్డ్‌ బ్రూక్స్‌పై కాల్పులు జరిపిన పోలీసులను సస్పెండ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, ఈ కాల్పులకు బాధ్యత వహిస్తూ అట్లాంటా పోలీస్‌ చీఫ్‌ ఎరిక్‌ షీల్డ్‌ శనివారం రాజీనామా చేశారు.
పోలీసుల వైఖరికి నిరసనగా ఆందోళనకారులు నగరంలో ప్రదర్శనకు దిగారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు స్వ్కాడ్‌ కార్లను అడ్డుపెట్టారు. కాల్పులు జరిగిన వెండీస్‌ రెస్టారెంట్‌ సమీపంలో భారీ ఆందోళనలు జరిగాయి. హత్యకు పాల్పడిన అధికారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. ఒక పోలీసు బ్రూక్స్‌ను తుపాకీతో కాల్చగా అక్కడికక్కడే కుప్పకూలడం స్థానికులు తీసిన వీడియోల్లో స్పష్టంగా ఉంది.

Courtesy Nava Telangana