ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా మహా ప్రదర్శన: మందకృష్ణ

మహాదీక్షలో ఐక్యత చాటుతున్న దీపక్ కుమార్, దాస్ సురేశ్, ఆర్.కృష్ణయ్య, జేబీ రాజు, మందకృష్ణ మాదిగ, రాములు నాయక్, కుతాడి కుమార్, చెన్నయ్య

కవాడిగూడ, న్యూస్టుడే: మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగినపుడు అగ్రవర్ణాలకు ఒక న్యాయం, అణగారిన వర్గాలకు మరో న్యాయం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా లక్షలాది మందితో హైదరాబాద్ లో ప్రదర్శన చేపడతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ ధర్నాచౌక్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ హైదరాబాద్ లో ఉన్నపుడే ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న అగ్రవర్ణ పెత్తందార్ల అహం అణచడానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. దిశ అగ్రవర్ణ మహిళ కావడం వల్లే నిందితులను ఏకపక్షంగా కాల్చివేసి, కుల ప్రతీకారం తీర్చుకున్నారని ఆరోపించారు. అణగారిన వర్గాల మహిళల మాన, ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. హాజీపూర్ ఘటన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు శిక్షించడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాములు నాయక్, అంబేడ్కర్ వాది జేబీ రాజు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, కుతాడి కుమార్, స్కైలాబ్, దీపక్ కుమార్, గుజ్జ కృష్ణ, దాస్ సురేశ్ తదితరులు మాట్లాడారు.

Courtesy Eenadu