ఎటువంటి ప్రయత్నాలు లేకుండా కొంచెం కూడా డబ్బులు ఖర్చు చేయకుండా చంద్రుడిపైకి వెళ్లొచ్చాడు బెంగళూరుకు చెందిన ఒక యువకుడు. చంద్రుడిపైకి అంటే నిజంగా వెళ్లిరాలేదు. కానీ అలాంటి ప్రయత్నమే చేశాడు. అసలు విషయం ఏంటంటే…!

బృహత్‌ బెంగళూరు మహానగర పాలిత ప్రాంతంలో ఎక్కడ చూసినా గుంతలతో కూడిన రోడ్లు దర్శనమిస్తున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పెడచెవిన పెట్టడంతో బాదల్ నంజుండస్వామి వ్యోమగామిగా నడుస్తూ రోడ్ల గుంతలను తెలియజేశాడు. వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతలతో తమకు ఎదురవుతున్న ప్రమాదాలను ప్రపంచం దృష్టికి తెచ్చేందుకు బాదల్  ఈ ప్రయత్నం చేశాడు. వీడియోను ట్విట్టర్‌ లో పోస్ట్ చేస్తూ.. బృహత్ బెంగళూరు ఐఏఎస్‌ అధికారి అనిల్ కుమార్‌, మేయర్‌ గంగంబికే మల్లికార్జున్‌ ను ట్యాగ్‌ చేస్తూ పోస్ట్ పెట్టాడు.

రోడ్లపై పడిన గుంతల్లోనే వ్యోమగామిగా నెమ్మదిగా అడుగులు వేశాడు. 5 సెకన్ల పాటు వీడియో చూసిన నెటిజన్లు నిజంగా చంద్రుడిపై నడిచాడా అన్నట్లు ఉండేలా క్రియేట్ చేశాడు. తర్వాత ఆ రోడ్డు పైనుండి ఆటో వెళ్లడంతో అప్పుడు అర్థం అయింది అది గుంతలు ఉన్న రోడ్డు అని. వీడియోకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కానీ బాదల్ మాత్రం అధికారులు త్వరగా స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నాడు.