• ఆయన ఇంట్లో గద్వాల పోలీసుల సోదాలు
  • అరెస్టు అక్రమం: విరసం కార్యదర్శి పాణి

ఉస్మానియా యూనివర్సిటీ/హైదరాబాద్‌ : విరసం నేత, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జగన్‌ను హైదరాబాద్‌లో గద్వాల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ గురువారం తార్నాకలోని జగన్‌ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. జగన్‌కు చెందిన ల్యాప్‌టాప్‌, కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. జగన్‌ ప్రస్తుతం సికింద్రాబాద్‌ పీజీ కాలేజీలో ఆర్థికశాస్త్రం విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. విరసం కార్యవర్గ సభ్యుడు జగన్‌ అరెస్టును ఆ సంఘం కార్యదర్శి పాణి ఖండించారు. ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో జగన్‌ 15 సంవత్సరాలు పోరాడారని తెలిపారు. అరెస్టు చేసిన జగన్‌ను వెంటనే విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి ఎన్‌. నారాయణరావు డిమాండ్‌ చేశారు.

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ) నాయకులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని కేసీఆర్‌ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని విద్యార్థి సంఘాల జేఏసీ ఆరోపించింది. టీవీవీపై తప్పుడు ప్రచారం చేయొద్దని డిమాండ్‌ చేసింది. టీవీవీ నేతలు నాగన్న, బలరాంను తక్షణమే విడుదల చేయాలని పేర్కొంది. టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి, సీఎంఎస్‌ కార్యదర్శి శిల్ప, స్టూడెంట్‌ మార్చ్‌ ఎడిటర్‌ జగన్‌పై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేసింది. జగన్‌తోపాటు టీవీవీ నాయకుల్ని విడుదల చేయాలని తెలంగాణలో చీకటి నిర్బంధాన్ని వ్యతిరేకించాలని వివిధ సంఘాల నేతలు ధ్వజమెత్తారు.

Courtesy Andhra Jyothy..