– అసోం, పశ్చిమ బెంగాల్‌ సహా
– దేశవ్యాప్తంగా పౌరసత్వ ప్రదర్శనలు
– జేఎంఐ వర్సిటీ బయట విద్యార్థుల ఆందోళనలు.. ఢిల్లీలో నిషేధాజ్ఞలు

న్యూఢిల్లీ : మోడీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు బుధవారమూ కొనసాగాయి. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిలరేకంగా నిరసనకారు ఆందోళనలు, పోలీసుల హింసాత్మక చర్యలతో నిన్నటి వరకు అట్టుడికిన అసోం, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ లతో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలు, యూపీ, కర్నాటక, తమిళనాడులలో ఎలాంటి అవాంఛీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరసనలు జరిగాయి. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా(జేఎంఐ) విశ్వవిద్యాలయంలో విద్యార్థులు మూడో రోజూ ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా పలు వర్సిటీలు, విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు.. జేఎంఐ, ఏఎంయూ విద్యార్థులకు సంఘీభావాన్ని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ వరసగా మూడో రోజు తన నిరసన ర్యాలీని చేపట్టారు. సీఏఏ, ఎన్నార్సీలపై మోడీ సర్కారుపై ఆమె విమర్శల దాడి చేశారు.

కేంద్రానికి బీజేడీ షాక్‌
అసోం, పశ్చిమ బెంగాల్‌లలో పౌరసత్వ ఆందోళనలు శాంతియుతంగా జరిగాయి. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా వరసగా మూడో రోజూ పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ చేపట్టిన నిరసన ర్యాలీ కోల్‌కతాలోని హౌరా మైదాన్‌ నుంచి డోర్నియా క్రాస్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సీఏఏకు పార్లమెంటులో అనుకూలంగా ఓటేసిన ఒడిషాలోని అధికార బిజూజనతా దళ్‌(బీజేడీ).. కేంద్రానికి షాకిచ్చింది. ఒడిషాలో ఎన్నార్సీకి మద్దతునిచ్చే ప్రసక్తేలేదని బీజేడీ చీఫ్‌, ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌ స్పష్టం చేశారు.
జేఎంఐ విశ్వవిద్యాలయం బయట విద్యార్థులు, స్థానికులు మూడో రోజు శాంతియుతంగా నిరసనలు తెలిపారు. వర్సిటీ ఏడో గేటు వద్ద భారత చిత్రపటాన్ని వేలాడదీసి.. దేశంలోని ఏయే యూనివర్సిటీల్లో పౌర నిరసనలు కొనసాగుతున్నాయో విద్యార్థులు అందులో చూపించారు. క్యాంపస్‌ బయట జేఎంఐ విద్యార్థులు చేస్తున్న నిరసనలకు జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ నేత కన్హయ్య కుమార్‌ సాయంత్రం వచ్చి మద్దతు పలికారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులనుద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. దేశాన్ని రక్షించుకోవడం కోసమే ఈ ఆందోళనలు అనీ, సీఏఏ కంటే ఎన్నార్సీ మరింత ప్రమాదకరమనీ, వీటికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించాలని ఆయన అన్నారు.

కమల్‌ హాసన్‌ అడ్డగింత
సీఏఏకు వ్యతిరేకంగా మద్రాసు యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు కొనసాగాయి. ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను కలుసుకోవడానికి వచ్చిన మక్కల్‌ నీదిమయం(ఎంఎన్‌ఎం) చీఫ్‌ కమల్‌ హాసన్‌ను పోలీసులు గేటు బయటే అడ్డుకున్నారు. గేటు బయట నుంచే విద్యార్థులతో ఆయన మాట్లాడారు. కేంద్రం నియంతృత్వం వైపు పయనిస్తోందన్న ఆయన.. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనను కొనసాగించాలని విద్యార్థులనుద్దేశించి వ్యాఖ్యానించారు.
పౌరతస్వ చట్టం, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా జేఎంఐ, డీయూ, ఏఎంయూ విద్యార్థుల ఆందోళనలకు ముంబయిలోని కేసీ కాలేజీ పూర్వ విద్యార్థులు సంఘీభావం తెలిపారు. సీఏఏపై బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) ఎంపీల బృందం.. భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కలిసింది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో కర్ఫ్యూను కొన్ని గంటల పాటు సడలించిన అధికారులు.. మొబైల్‌ ఇంటర్నెట్‌పై నిషేధాన్ని అలాగే కొనసాగించారు.

నిరసనలు, ఆందోళనలతో మంగళవారం నాడు మరోసారి హింసాత్మకంగా మారిన ఢిల్లీలోని సీలంపూర్‌ ఘటనలో పోలీసులు 18 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. మూడు ఎఫ్‌ఐఆర్‌లను దాఖలు చేశారు. హింసాత్మక ఘటనలు మళ్లీ చెలరేగే అవకాశం ఉన్నదని ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. జామియా ఘటనపై నిజ నిర్ధారణ కమిటీ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిని న్యాయస్థానం నేడు(గురువారం) విచారించనున్నది. సీఏఏకు వ్యతిరేకంగా యూపీలో ప్రగతిశీల సమాజ్‌పార్టీ ఆధ్వర్యంలో భారీస్థాయిలో నిరసనలు జరిగాయి. అక్కడ పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు. సీఏఏకు వ్యతిరేకంగా తమిళనాడులో డీఎంకే అన్ని పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

శ్రీనగర్‌లో జర్నలిస్టులపై విరుచుకుపడ్డ పోలీసులు
సీఏఏకు వ్యతిరేకంగా శ్రీనగర్‌లోని ఇస్లామియా కాలేజీలో విద్యార్థులు చేస్తున్న నిరసనలు కవర్‌ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు దాడి చేశారు. అత్యంత దారుణంగా ప్రవర్తించారు. పోలీసుల దాడిలో ముగ్గురు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ప్రముఖ జర్నలిస్టులు ఆజాన్‌ జావేద్‌, అనీస్‌ ఝర్గార్‌, హకీం ఇర్ఫాన్‌లు ఉన్నారు.

నదీ జలాల అంశంపై
భారత్‌తో బంగ్లా సమావేశాలు వాయిదా
పౌరసత్వ నిరసనల ఎఫెక్ట్‌ భారత్‌, బంగ్లాదేశ్‌ లమధ్య నదీజలాల అంశంపై జరగాల్సిన సమావేశాలపై పడింది. గురు, శుక్రవారాల్లో బంగ్లాదేశ్‌.. భారత్‌తో రెండు సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే సీఏఏపై నిరసనల నేపథ్యంలో అది వాయిదా పడింది. ఇరు దేశాల మధ్య జరగాల్సిన సమావేశాల వాయిదాను బంగ్లాదేశ్‌ కోరిందని జల శక్తి మంత్రిత్వ శాఖలోని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈశాన్యంలో పౌరసత్వ ఆందోళనల నేపథ్యంలో.. బంగ్లా విదేశాంగశాఖ మంత్రి ఎ.కె. అబ్దుల్‌ మోమెన్‌, హౌం మంత్రి అసదుజ్జామాన్‌ ఖాన్‌లు ఇటీవల తమ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.
‘పోలీసుల దుశ్చర్య’ను ఖండించిన 10వేల మందికి పైగా స్కాలర్లు, అధ్యాపకులు
సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఢిల్లీలోని జేఎంఐ యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ) విద్యార్థులకు దేశ, విదేశాల నుంచి మద్దతు లభిస్తున్నది. ఈ రెండు వర్సిటీలకు చెందిన విద్యార్థులపై పోలీసులు దారుణంగా వ్యవహరించిన తీరును ప్రపంచవ్యాప్తంగా పదివేల మందికి పైగా విద్యార్థులు, స్కాలర్లు, అధ్యాపకులు, పౌర సమాజంలోని నాయకులు, కార్యకర్తలు ఖండించారు. రెండు వర్సిటీల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి వారు తమ మద్దతును ప్రకటించారు. మోడీ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కును, సెక్యులర్‌ భావనలను అతిక్రమిస్తుందని వారు తెలిపారు.

సీఏఏపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
చట్టం అమలుపై స్టేకు నిరాకరణ
వివాదాస్పద ‘పౌరసత్వ సవరణ చట్టం, 2019’ రాజ్యాంగబద్దతను సవాలు చేస్తూ దాఖ లైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సీఏఏ అమలుపై స్టే విధించాలంటూ చట్టానికి వ్యతిరేకంగా దాదాపు 60 పిటిషన్లు సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఎస్‌.ఎ బోబ్డే, న్యాయమూర్తులు బి.ఆర్‌ గవారు, సూర్యకాంత్‌ లతో కూడి ముగ్గురు సభ్యుల సుప్రీం ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. చట్టం నిలుపుదలకు తిరస్కరించిన న్యాయస్థానం.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. జనవరి రెండోవారంలోగా స్పందన తెలియజేయాల్సిందిగా ఆదేశించింది. పిటిషన్లపై తదుపరి విచారణను జనవరి 22కు న్యాయస్థానం వాయిదా వేసింది.

యూనివర్సిటీలు మూత.. విద్యార్థులకు కేరళ భవన్‌ ఆశ్రయం
పౌర నిరసనల నేపథ్యంలో మూతపడిన జేఎంఐ, ఏఎంయూ లకు చెందిన విద్యార్థులకు ఢిల్లీలోని కేరళ భవన్‌ ఆశ్రయం కల్పిస్తున్నది. నిరసనల నేపథ్యంలో ఈ రెండు వర్సిటీలకు వచ్చే నెల 5 వరకు అధికారులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులకు ఇబ్బందులకు గురిచేసింది. దీంతో ఈరెండు వర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థులను కేరళ భవన్‌ అక్కున చేర్చుకుంటున్నది. దీంతో విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా వారి ప్రయాణానికయ్యే ఏర్పాట్లను చూసుకునే వెసులుబాటు కలిగింది. ప్రస్తుతం కేరళకు చెందిన దాదాపు 70 మంది విద్యార్థులు ఇక్కడ తలదాచుకుంటున్నారు.

Courtesy Nava telangana