Arundathi Roy 

“ఆర్ఎస్ఎస్ అనే సంస్థ సుశిక్షితులైన, క్రమశిక్షణ కలిగిన దాదాపు 6 లక్షల మంది కార్యకర్తలను ఎన్నికల నిమిత్తం నియమించగలదు. కానీ మిగిలిన పార్టీల వారికి అలాంటి తర్ఫీదు పొందిన కార్యకర్తలు దాదాపు లేరు. మిగిలిన పార్టీల వారందరి దగ్గర ఉన్న మొత్తం నిధులకు 20 రెట్లు ఎక్కువ నిధులు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దగ్గర ఉన్నాయి. తరువాత జరిగే ఎన్నికలకు వారి దగ్గర పోగుపడే నిధులు బహుశా 50 రెట్లు కావచ్చు. భారత దేశంలో ఎన్నికలంటే డబ్బు పాత్ర ఇంకా ఇంకా పెరగటం, పెద్ద ఆర్భాటం చెయ్యడం, ప్రధాన జనజీవన స్రవంతిని, సోషల్ మీడియాను తన గుప్పెట్లో ఉంచుకోవడంలాంటి పోల్ మేనేజ్మెంట్ గా మారిపోయింది. ఎన్నికల కమీషన్ తో సహా ఈ దేశంలోని ప్రతి వ్యవస్థ, ప్రతి సంస్థ ఆర్ఎస్ఎస్ ఇష్టానికి తలవంచక తప్పటం లేదు. బహుశా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు సైతం ఇందుకు అతీతం కాకపోవచ్చు. ఆ డబ్బుతో వారు కొన్నివేల వాట్సప్ గ్రూపులను నడిపే వేలాది మంది ఐటి నిపుణులను, డేటా విశ్లేషకులను, సోషల్ మీడియా కార్యకర్తలను కొంటారు. వాళ్లు అత్యంత జాగరూకతతో నిర్ధేశించిన జనం మధ్య, సమాజంలోని ప్రాంతం, కులం, వర్గాలవారీగా ప్రతి నియోజకవర్గంలోని, ప్రతి పోలింగ్ బూత్ లోని ప్రతి గుంపు ఆలోచనలను తమ వైపుకు తిప్పుకునే విధంగా ప్రచారం కొనసాగిస్తారు.
ఆ డబ్బు తాము చలామణి చేయాలనుకున్న దేన్నయినా చలామణి చేస్తుంది. ప్రస్తుత సందర్భంలో వాళ్లు చలామణి చేస్తున్నది అత్యంత విషపూరితమయిన వస్తువు. అది ఒక భయంకరమయిన అంటు వ్యాధిని సృష్టించింది. వారు చలామణి చేస్తున్న భావజాల ప్రచార కార్యక్రమంలో ప్రజాఉపయోగమైనది ఏదీలేదు. పెద్ద ఎత్తున ప్రవహించే మద్య యుగాల మూర్ఖత్వ విషం తప్ప అందులో పర్యావరణంలో మార్పుల గురించి కానీ, కమ్ముకొస్తున్న ఆర్ధిక సంక్షోభం గురించి కానీ, విద్యా – ఆరోగ్య విషయాల గురించి కానీ ఎలాంటి ప్రస్తావన ఉండదు.

ఇలాంటి అక్రమాలతో కూడుకున్న ఈ ఎన్నికల్ని సక్రమంగా జరిగిన ఎన్నికలుగా మనం ఎలా పరిగణించగలం? ఇది ఒక పెద్ద మరోబోటుకి కొన్ని సైకిళ్లకు మధ్య జరిగిన అసమాన పరుగుపందెం తప్ప సమాన పోటీ కాదు. అసాధారణమయిన అంశం ఏది తన ద్రుష్టికి రాకపోయినా ఈ మరబోటునే మీడియా – పారా హుషార్ అంటూ ఉత్తేజపరిచింది. ప్రస్తుతం మీడియా మరబోటు సామర్ధ్యాన్ని ఆకాశానికి ఎత్తుతూ, సైకిళ్ళ చేతగానితనాన్నిఎద్దేవా చేస్తున్నది.

భాజపాకి వెన్నుదన్నుగా నిలిచే ఈ ఆర్ఎస్ఎస్ నిర్మాణాన్ని సవాలు చెయ్యగల అవకాశాలు మనకు ఏమి మిగిలి ఉన్నాయి? డబ్బు, విద్వేషం నిండిన ఈ ఆర్ఎస్ఎస్ యంత్రాగాన్ని, ప్రస్తుతం రంగంలో ఉన్న క్రియాశీల రాజకీయ పార్టీలేవీ ఎదిరించ గలిగిన స్థితిలోలేవు. ప్రజల తిరుగుబాటే ఏదో ఒక రోజు ఈ యంత్రాంగాన్ని ధ్వంసం చేస్తుంది. నేను విప్లవాన్నిగురించి చెప్పటం లేదు, పెల్లుబుకే ప్రజా ఆగ్రహాన్ని గురించి చెపుతున్నాను. స్వచ్చంద సంస్థలతో సంభంధం లేకుండా పునరుద్భవించే సామాజిక (ప్రజాస్వామ్య) ఉద్యమాన్ని గురించి చెపుతున్నాను. ఆ విధంగా జరిగే ఉద్యమమే ఒక కొత్త రాజకీయ శక్తిని సృష్టిస్తుంది. ఈ నూతన ప్రత్యామ్నాయ పక్షాన్ని ఎవరూ మ్యానేజ్ చెయ్యలేరు.
అలా మనం ఒక కొత్త ఆట ఆడాలి. ఇప్పుడు మనం చెపుతున్న లాంటి సాంప్రదాయ రహితమైన ఒక వినూత్న ఆట ఆడాలి. ఈ ఎన్నిక ప్రజాస్వామ్యంలో చేయబడిన ఒక పెద్ద కసరత్తుగా పొగుడుతున్నారు. కాని జరిగింది పూర్తి వ్యతిరేకం. ఇది ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉండాలో అలా ఉండకుండా దాన్ని అపహాస్యం చేయడం మాత్రమే”

[avatar user=”subbarao@desidisa.com” size=”thumbnail” align=”right”] అనువాదం: మల్లి సుబ్బారావు[/avatar]