వాస్తవాల వెల్లడికి వెబ్‌సైట్‌
గాయకుడు, నటుడు జుబిన్‌ గార్గ్‌

గువహటి : అసోంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిసూ గళమెత్తితే దాన్ని దేశ ద్రోహం కింద పరిగణించకూడదని గాయకుడు, నటుడు జుబిన్‌ గార్గ్‌ అన్నారు. అసోంలో సీఏఏకు వ్యతిరేకంగా పోరాడుతున్నవారికి అంకితమిస్తూ ఓ వెబ్‌సైట్‌ను తన సహనటులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘దవైర్‌’తో మాట్లాడారు. ‘అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా, అది బీజేపీ లేదా కాంగ్రెస్‌ అయినా సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు చేపడతాం. ఇది మా ప్రజాస్వామ్య హక్కు. సీఏఏ వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న ప్రజలపై కక్ష కట్టడం కేంద్రం చేసిన పెద్ద తప్పు.’ అని వ్యాఖ్యానించారు. అసోం ప్రజల సంస్కృతి, వారసత్వాన్ని ప్రమాదంలో పడవేసే ఇటువంటి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని గార్డ్‌ డిమాండ్‌ చేశారు.

అసోం నటులు బరాష రాణి బిషాయ, రవి శర్మ, సింగర్‌ మానస్‌ రాబిన్‌, గార్గ్‌ భార్య గరిమా సైకియా గార్గ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ వెబ్‌సైట్‌ అస్సామీ ఉనికిపై శద్ధ్ర చూపించే వారికి, రాష్ట్రంలో సీఏఏకు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనలపై సమాచారం, వివరాలు తెలుసుకునేందుకు చేస్తున్న ప్రయత్నమని అన్నారు. అసోం ప్రవాసులు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు, ఆందోళనలను ఎలా ముందుకు తీసుకెళ్లవచ్చుననే అంశంపై ఈ వెబ్‌సైట్‌ ద్వారా సలహాలను అందించవచ్చునని చెప్పారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో కూడా ఫేజీలు ఉన్నాయని అన్నారు. సీఏఏ వ్యతిరేక నిరసనలపై తప్పుడు సమాచారం వ్యాప్తిని నిలువరించడంతోపాటు ఈ చట్టం పూర్తి వివరాలను అందించడం డిజిటల్‌ ప్లాట్‌ఫాం లక్ష్యమని వారు తెలిపారు. నిరసనకారులను క్రమం తప్పకుండా ట్రోల్‌ చేసే ‘ఐటీ సెల్‌’ను ఎదుర్కోవటానికి ఇది మంచి ప్రయత్నమని వారు తెలిపారు. ఈ చట్టం ద్వారా విదేశీయులకు స్థానం కల్పించడాన్ని రాష్ట్రం సహించదని అన్నారు.

నిరసనలతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో స్థానికులు, ప్రవాసీయులు, ఇతరులు తెలుసుకోవాల్సిన ఆవశ్యం ఉందని నటి బిషాయ అన్నారు. ఈ సైట్‌ సీఏఏకి వ్యతిరేకంగా ఉన్న వారందరికీ వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరస్తుందనీ, తమ గొంతును అణచివేయాలనుకునేవారికి వ్యతిరేకంగా ఇది ఒక డిజిటల్‌ యుద్ధమని శర్మ చెప్పారు.

Courtesy Nava Telangana