‘మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం కారణంగా ఏ పౌరుడిపైనా వివక్ష చూపకూడద’ని భారత రాజ్యాంగం (1950) లోని 15వ అధికరణం ఘోషిస్తోంది. కానీ అందుకు భిÛన్నంగా సమాజంలోని అన్ని పార్శ్యాల్లోనూ వివక్ష సాధారణ స్థాయిలోనేకాక అత్యంత క్రూర స్థాయిలో ఉందని అనుదినం వార్తలు చెబుతున్నాయి.

విశ్వవిద్యాలయంలోని కులవివక్ష రోహిత్‌ వేములను బలిగొంటే, తోటి వైద్యుల బ్రాహ్మణాధిపత్యం ప్రియా తడ్విని ఆత్మహత్యకు పురిగొల్పింది. నేలరాలిన మామిడిపండ్లను ఏరుకున్నందుకు బిక్కి శ్రీను, కేవలం ముస్లిం అయినందుకు తబ్రేజ్‌ అన్సారీ… ఇలా కులోన్మాద, మతోన్మాద హత్యల ఉదాహరణలు ఎన్నయినా చెప్పుకోవచ్చు. ఈ వివక్ష అత్యున్నత న్యాయవ్యవస్థనూ, పోలీసు రక్షణవ్యవస్థనూ వదల్లేదు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన పోలీసు ఉన్నతాధికారికి తన విభాగంలోని కుల జాఢ్యం జీర్ణంకాలేదు. అందుకే తన కింది ఉద్యోగులు చదువుకోవడం కోసం ఖైదీల కోసం కేటాయించిన ప్రకటన బోర్డులో ‘ఆర్టికల్‌ 15’ ప్రతిని వేలాడదీస్తాడు.
ఇదీ, ఈ సినిమా కథ
సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఫారిన్‌ చదువు ముగించి, తండ్రి ఇష్టం మేరకు ఇండియన్‌ పోలీసు సర్వీసులో చేరిన బ్రాహ్మణ కులపు ఉన్నతాధికారి అయాన్‌ రంజన్‌ (ఆయుష్మాన్‌ ఖుర్రానా). ఢిల్లీ నుంచి పనిష్మెంట్‌ పోస్టింగుగా ఉత్తరప్రదేశ్‌లోని లాల్‌గంజ్‌కు వస్తాడు. అగ్రవర్ణ ఠాకూర్‌ కులానికి చెందిన సర్కిల్‌ ఆఫీసర్‌ బ్రహ్మదత్‌్‌సింగ్‌ (మనోజ్‌ పహ్వా), చెప్పులు కుట్టే చమార్‌ కులానికి చెందిన ఎస్సై జాతావ్‌ (కుముద్‌ మిశ్రా) తదితర అధికారులు అతడ్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తారు. వస్తున్నప్పుడు దారిలోనే అతడికి ఆ ప్రాంతాల్లో చలామణిలో ఉన్న కులవ్యవస్థ విశ్వరూప దర్శనం జరుగుతుంది. దారిలో దుకాణం నుంచి నీటి బాటిల్‌ కొందామంటే, అది ‘పాసీ’లనబడే అంటరానివాళ్ళ గ్రామమనీ, వారి నీడా సోకకూడదనీ చెబుతాడు వెంట ఉన్న అధికారి. తన స్వాగత పార్టీలో జాతవ్‌ ప్లేట్‌ నుంచి తినడానికి ప్రయత్నిస్తే అతని కోసం తాజా ప్లేట్‌ ఇస్తాడు మరో అధికారి. అయాన్‌ వచ్చేసరికి ఆ ఊరిలో ముగ్గురు దళిత బాలికలు అపహరింపబడ్డారు. వారి ఇంటివారు పోలీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఏమిటని ప్రశ్నిస్తే – ‘వీరింతే సార్‌, ఉత్తుత్త గొడవ చేస్తుంటారు’ అన్నట్టు సర్దేస్తాడు బ్రహ్మదత్‌. మరుసటి రోజు వేకువ జామున ఇద్దరు బాలికలు చెట్టుకు వేలాడుతూ కన్పిస్తారు. మూడవ అమ్మాయి పూజ ఇంకా కనిపించడం లేదు. మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తే రోజుల తరబడి గ్యాంగ్‌రేప్‌ జరిగిందని తెలుస్తుంది దళిత డాక్టర్‌ మాలతీరామ్‌ (రోంజిని చక్రవర్తి) కు. కానీ రిపోర్టును ఆలస్యం చేయించి, దీన్ని పరువు హత్యలా చూపాలని ప్రయత్నిస్తుంటాడు బ్రహ్మదత్‌్‌. 2014లో ఉత్తరప్రదేశ్‌ బదాయూలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ కథను రూపొందించారు. నిజ జీవితంలోని ‘చంద్రశేఖర్‌ రావణ్‌’ అనే దళిత నాయకుడి ఆధారంగా నిషాద్‌ (మహమ్మద్‌ జీషన్‌ ఆయుబ్‌) పాత్రను తయారుచేశారు. ఈయన భీమ్‌ ఆర్మీని నడుపుతూ అండర్‌గ్రౌండ్‌లో పనిచేస్తుంటాడు. పోలీసులు సక్రమంగా కేసును పరిష్కారం చేసేలా తనదైన పద్ధతుల్లో పోలీసులపై ఒత్తిడి తెస్తాడు. చనిపోయిన అమ్మాయిలు సమలైంగిక సంపర్కంలో ఉండటం వల్ల వారి తండ్రులే వారిని ఉరి వేసినట్టు చూపి, కేసును తొందరగా ముగించడానికి ప్రయత్నిస్తాడు బ్రహ్మదత్‌. కానీ అమ్మాయిల బంధువు గౌర (సయాని గుప్తా) అయాన్‌కు నమ్మశక్యం కాని సమాచారం అందిస్తుంది. అమ్మాయిలు అన్షుల్‌ నహారియా అనే స్థానిక బిల్డర్‌ కోసం పని చేసేవారనీ, వారి జీతం మూడు రూపాయలు పెంచమన్నందుకు ఆ ముగ్గురు అమ్మాయిలపై పగ పట్టారనీ చెబుతుంది. వ్యక్తిగత చొరవతో మరింత తీవ్రంగా దర్యాప్తు చేస్తాడు అయాన్‌. పోస్ట్‌మార్టమ్‌ చేసిన డాక్టర్ని భయపడవద్దని చెబుతాడు. బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డవారిలో అన్షుల్‌తో పాటు బ్రహ్మదత్‌, మరో పోలీసు నిహాల్‌ కూడా ఉన్నాడని తెలుస్తుంది. అన్షుల్‌ను చంపి తనను తాను కాపాడుకోవాలనుకున్న బ్రహ్మదత్‌ చివరికి పట్టుబడతాడు. నిహాల్‌ ఆత్మహత్య చేసుకుంటాడు. (బదాయూ సంఘటనలో కూడా ఇద్దరు పోలీసులు నిందితులుగా తేలారు.) ఈలోగా రాజకీయ ఒత్తిడి వచ్చినా, కేసును సీబీఐకి బదలాయించినా, వెనుకాడకుండా మూడో అమ్మాయిని వెదికే పనిలో సఫలీకృతమౌతాడు అయాన్‌ రంజన్‌.
సమకాలీన అంశాలు ఎన్నెన్నో …
ఉనాలో జరిగినట్టు దళితులను వాహనానికి కట్టేసి కొట్టి వాట్సప్‌లో వీడియోలు పెట్టినట్టు చూపారు. గుళ్లో కూర్చుని భోంచేసినందుకు శిక్ష అది! దానికి నిరసనగా జిగేష్‌ మేవానీ పిలుపునిచ్చినట్టే దళితులెవ్వరూ చెత్త ఎత్తకూడదని ప్రభుత్వ కార్యాలయాల ముందు చెత్తను కుమ్మరించాలనీ నిషాద్‌ భీమ్‌ ఆర్మీ తరుపున ఆదేశాలు జారీ చేస్తాడు. మహంత్‌ అనే కాషాయ పార్టీ స్వామీజీ బీజేపీకి ప్రతినిధి అయితే, ఆయనతో చేయి కలిపి ప్రభుత్వం తయారుచేయబోయిన శాంతిప్రసాద్‌ను బీఎస్‌పీ ప్రతినిధిగా పోల్చుకోవచ్చు. ‘అధికారం మరో ప్రత్యేక కులంలా పనిచేస్తుంది. మా ఓట్లతో గద్దెనెక్కిన వారు మా మీదనే స్వారీ చేస్తారు. ఏమీ తెలీని జనాలు నాయకుల నినాదాల వెనుక మూకగా మారిపోతున్నారు. మహంత్‌జీతో మా వాళ్లు చేయబోతున్న ర్యాలీని నేను అడ్డుకుంటాను’ అని చెబుతాడు నిషాద్‌. ‘నేను సైన్సు చదవాలనుకున్నాను. సైన్సు రైటర్ని అవ్వాలనుకున్నాను. నా జన్మే ఒక యాక్సిడెంటులా పరిణమించింది’ అని నిషాద్‌ నోట అనిపించిన మాటలు రోహిత్‌ వేముల ఆత్మహత్య లేఖలోనివే. ‘మా అమ్మాయిలను రాత్రంతా ఉంచుకుని, వదిలేసినా బాగుండేది’ అని చనిపోయిన బాలిక తండ్రి అన్న మాట నిజానికి బదాయూ సంఘటనలోని ఒక తండ్రి అన్నమాటే! ఈ మాట ఆ పాత్ర అసహాయతను కళ్లకు కడుతుంది.
బ్రాహ్మణ హీరోయిజం
సినిమాలో హీరోకు, హీరోయిన్‌ అదితి (ఈషా తల్వార్‌)కి మధ్య వాట్సప్‌లో వాగ్వివాదం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో ఆమె ఆలోచన హీరోకు మించినట్టు ఉంటుంది. ‘గ్రామాల్లో కులవ్యవస్థ బలంగా ఉంది’ అని హీరో అంటే ‘మన ఇళ్లలో మన తల్లులు చిన్న కులాల కోసం వేరేగా గిన్నెలు పెట్టుకోలేదా?’ అని ప్రశ్నిస్తుంది. కులవ్యవస్థ సర్వవ్యాప్తం అని సూచిస్తుంది. లాల్‌గంజ్‌ వార్త ఏడో పేజీలోనే ఎందుకుండాలి? అని ప్రశ్నిస్తుంది. ‘సమాజాన్ని బ్రహ్మ ఒక పద్ధతి ప్రకారం నిర్మించాడు. రాజు ఉంటాడు. ప్రజలు ఉంటారు. సేవకులుంటారు. అంతా సరిగా ఉన్నప్పుడే సమతూకం ఉంటుంది. సమతూకం చెడగొట్టేస్తే రాజెవడవుతాడు?’ అన్న బ్రహ్మదత్‌ మాటకు ‘అసలు ఎవరో వొకర్ని రాజుని చేయాలెందుకు?’ అనే అసలు ప్రశ్న లేవనెత్తుతుంది. దళితుల గ్రామం అంథకారంలో ఉన్నప్పుడే రాముడి రాజప్రాసాదం మరింత అందంగా కనపడుతోంది అన్న పోలీసు వ్యాను డ్రైవరు చెప్పిన మాటా చాలా మార్మికంగా అన్పిస్తుంది. మన సినీరంగం అగ్రవర్ణాల హీరోలతో నిండిపోయింది. ఏ సమస్యనైనా అగ్రవర్ణ హీరోతోనే పరిష్కారం కావాలి. ఈ సినిమాని నిషాద్‌ కోణంలో చూపితే ఎలా ఉండేది? దళితుడిగా అతడి ఆవేదన దళిత సమస్యను మరింత బాగా చూపేదిగా? సినిమాలో అతడి పాత్ర నిడివిని తగ్గించారు. ఒకచోట ప్రేమికురాలి ఒడిలో తలపెట్టి ఏడుస్తున్నట్టు చూపారు. చివరికి అతడు ఎన్‌కౌంటర్‌కి గురైనట్టూ చూపారు. దళిత సమస్య పరిష్కారానికీ బ్రాహ్మణ హీరోనే అవసరమా అన్న విమర్శ ఈ సినిమాపై వచ్చింది. హీరో దళితుడైతే మల్టీప్లెక్సు ప్రేక్షకులకు నచ్చడేమో! ‘ముల్క్‌’ సినిమాలో ముస్లింల పక్షాన హిందూ కోడలు పిల్ల వాదించినట్టు ఈ సినిమాలో దళితుల పక్షాన బ్రాహ్మణ కథానాయకుడు పోరాడతాడు. పూజా అనే మూడో అమ్మాయిని కాపాడిన హీరోకు ఆ పిల్ల అక్కయ్య గౌర చేతులెత్తి నమస్కరించడంతో ఈ సినిమాలో హీరో పూజ పూర్తవుతుంది. ‘హీరోల కోసం ఎదురుచూడని జనాలు నాకు కావాలి’ అని అదితి సినిమాలో ఓ చోట చెప్పిన మాటకు విలువ లేకుండా పోతుంది. ఒక విమర్శకుడు ఉటంకించినట్టు –
మేము వేదికపైకి వెళ్లలేదు
వారు మమ్మల్ని పిలవలేదు కూడా
సభలో మేము కూర్చోవాల్సిన చోటు చూపారు వారు.
వారు వేదిక మీద కూర్చుని మా బాధల గురించి మాట్లాడారు.
మా బాధలు మావిగానే ఉండిపోయాయి.. అవి ఎన్నడూ వారివి కాలేదు‘ 
(వాహారు సోనావాణే; ‘వేదికఅనే మరాఠీ కవిత నుంచి)
హీరోకి ఢిల్లీలో పనిష్మెంట్‌ ఇచ్చినవాడే (‘శాస్త్రి’) ఆఖర్లో చాలా నాటకీయంగా హీరోను సపోర్టు చేస్తున్నట్టు చూపడం విడ్డూరం అన్పిస్తుంది. సినిమాను సుఖాంతం చేయాలన్న తపన వల్ల కులవ్యవస్థ మూలాలేమిటి? అది నిజంగా పోవాలంటే ఏం చేయాలి? అన్న ప్రాథమిక ప్రశ్నలపై కనీసపు చర్చ జరగలేదు. అయాన్‌ కార్యాలయం గోడపై ఒకవైపు గాంధీబొమ్మా, మరోవైపు అంబేద్కర్‌ బొమ్మా ఉంటాయి. ఒకానొక దృశ్యంలో అతడు గాంధీజీ పటంవైపే తీక్షణంగా చూస్తాడు. ‘వైష్ణవ జనతో తేనే కహియె జో పీర్‌ పరాయీ జానేరే’ (ఇతరుల బాధను ఆర్థంచేసుకున్న వారే దేవుని మనుషులు అనిపించుకుంటారు) అనే గాంధీకి ఇష్టమైన పాటతోనే ముగుస్తుంది సినిమా. కాబట్టి అగ్రవర్ణాల వారు దళితుల పట్ల జాలిగా ఉంటే చాలు.. అని దర్శకుడు చెప్పదలిచాడా?
బాగున్న అంశాలు
హీరోతో పాటు చిన్న, పెద్ద పాత్రలు వేసిన ప్రతి ఒక్కరి అభినయం బావుంది. ముఖ్యంగా మనోజ్‌ పహ్వా నటన ‘ముల్క్‌’లో లాగే రాణించింది. ‘బ్రాహ్మణులూ ఏదో రోజు బురదలోకి దిగాల్సి ఉంటుంది’; ‘కొన్నిసార్లు మేము హరిజనులమైపోతాం, ఇంకొన్నిసార్లు బహుజనులమైపోతాం, కానీ జనులమే కాలేకపోతున్నాం – జనగణమనలో మేము కూడా లెక్కలోకి రావడానికి’; ‘ప్రతికులానికీ సమస్యలుంటాయి.. నిజమే కానీ గుళ్లోకి వెళ్లినందుకు మీ ఎముకలు విరగవు కదా?’ అన్న చాలా సంభాషణలు బావున్నాయి. ఇవాన్‌ ములిగాన్‌ సినిమాటోగ్రఫీ, మంగేష్‌ ధాక్డే నేపథ్య సంగీతం చాలా బావున్నాయి. ఒకప్పుడు ‘రా.వన్‌’ లాంటి సినిమాలు తీసిన అనుభవ్‌ సిన్హా ‘ముల్క్‌’ నుంచి తన సినిమాల్ని స్పష్టంగా నిర్వచించుకున్నట్టు సమాకాలీన సమస్యలపై తీస్తున్నాడు. ఇటువంటి సినిమాల్ని కొన్ని లోపాలున్నప్పటికీ తప్పక ఆదరించాలి. ఈ హిందీ సినిమా విడుదలై రెండు వారాలైంది. దగ్గర్లో ఏదైనా హాల్లో ఉంటే తప్పక చూడండి.

బాలాజీ (కోల్‌కతా)

90077 55403

ప్రజాశక్తి  సౌజన్యంతో