• ఆరోగ్యసేతు యాప్‌లో సాంకేతిక లోపాలు
  • తప్పుడు పాజిటివ్‌లు, నెగెటివ్‌ల ముప్పు

ప్రజల్లోకి అందుబాటులోకి తెచ్చిన 13 రోజుల్లో 5 కోట్ల డౌన్‌లోడ్‌లు.. 40 రోజుల్లో 10 కోట్ల డౌన్‌లోడ్‌లు.. ప్రపంచంలోనే అతితక్కువ కాలంలో ఎక్కువ డౌన్‌లోడ్‌లు అయిన ఘనత పొందిన యాప్‌.. ఆరోగ్యసేతు. కానీ.. కోట్లాదిమంది డౌన్‌లోడ్లు చేసుకుంటే, విమానాలు, రైళ్ల ప్రయాణికులకు ఇది తప్పనిసరి చేస్తే లక్ష్యం నెరవేరుతుందా..? అసలు ఈ యాప్‌ లక్ష్యం ఏమిటి? ఆ యాప్‌ను వాడేవారి గోప్యత సంగతేంటి? అందులోని సాంకేతిక లోపాలేమిటి? ఆరోగ్యసేతు అప్లికేషన్‌ ప్రారంభించి 100 రోజులు దాటిన సందర్భంగా ప్రత్యేక కథనం.

ఆరోగ్య సేతు.. కరోనా సోకినవారు లేదా సోకినవారికి సన్నిహితంగా మెలిగినవారు (హై రిస్క్‌ పీపుల్‌) మన చుట్టుపక్కల ఉంటే వెంటనే మనను అప్రమత్తం చేసే యాప్‌. కరోనా వైరస్‌ సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వైద్యసేవల గురించి తెలిపే యాప్‌. అయితే, ఈ యాప్‌ ప్రధాన లక్ష్యాలలో ఒకటైన కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ లక్ష్యం నెరవేరుతోందా అంటే.. ఆ విషయంలో సాంకేతికంగా పలు లోపాలు ఉన్నాయని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా.. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌కు, గోప్యతకు సంబంధించి ఆ లోపాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. వైరాలజిస్టులు చెబుతున్నదాని ప్రకారం కొవిడ్‌-19 రెండు రకాలుగా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఒకటి.. వైరస్‌ సోకినవారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు వారి నోటి నుంచి వెలువడిన తుంపర్ల ద్వారా సోకడం.

రెండోది.. ఆ తుంపర్లు తలుపు గొళ్లేలు, బల్లలు వంటివాటిపై పడినప్పుడు, ఆ వస్తువులపై మరొకరు చేతులు పెట్టి, ఆ చేత్తో తమ ముఖం తుడుచుకుంటే వ్యాపించే విధానం. ఇందులో రెండో విధానం ద్వారా వైరస్‌ సోకే ముప్పు విషయంలో ఆరోగ్యసేతు ఏమీ చేయలేదు. ఇక మిగిలింది మొదటి విధానం ద్వారా వైరస్‌ సోకకుండా కాపాడడం. వైరస్‌ సోకిన వ్యక్తులెవరైనా మన సమీపానికి వస్తే ఈ యాప్‌ మనను హెచ్చరిస్తుంది. ఇందులో కీలకపాత్ర పోషించేవి.. జీపీఎస్‌, బ్లూటూత్‌ విధానాలు. మన ఫోన్‌లోని జీపీఎస్‌ ద్వారా లేదా బ్లూటూత్‌ ప్రాగ్జిమిటీ ఎప్పుడూ ఆన్‌లో ఉంటూ.. మన సమీపంలోకి ఎవరైనా వైరస్‌ పాజిటివ్‌ వ్యక్తులు/హై రిస్క్‌ వ్యక్తులు వస్తే లేదా వారు ఉండే చోటుకు మనం వెళ్తే.. వెంటనే హెచ్చరిస్తాయి.

ఎంత దూరం సురక్షితం?
వైరస్‌ సోకిన/హై రిస్క్‌ వ్యక్తి నుంచి ఎంత దూరంలో ఉంటే మనం సురక్షితం అనే విషయంలో భేదాభిప్రాయలున్నప్పటికీ.. కనీసం ఆరడుగుల దూరం పాటించాలని అందరూ చెబుతున్నారు. జీపీఎస్‌ అయినా, బ్లూటూత్‌ ప్రాగ్జిమిటీ అయినా అంత దూరంలోనే హెచ్చరించాల్సి ఉంటుంది. ఇందులో సాంకేతిక అంశాల విషయానికి వస్తే..  చాలా సందర్భాల్లో జీపీఎస్‌ మనం ఉండే లొకేషన్‌ను 100 శాతం కచ్చితత్వంతో గుర్తించదు. మనం ఉన్న ప్రదేశాన్ని బట్టి కొన్ని మీటర్ల తేడా (ప్లస్‌ ఆర్‌ మైనస్‌) ఉంటుంది. అదే మనం ఇన్‌డోర్స్‌లో (అంటే ఆఫీసుల్లో, పనిప్రదేశాల్లో ఉన్నప్పుడు) కచ్చితత్వంలో తేడా ఇంకా ఎక్కువ ఉంటుంది. దీన్ని నమ్ముకుంటే 2 మీటర్ల దూరాన్ని పాటించడం కష్టమే. ప్రజల కదలికలు ఎక్కువగా ఉండే మార్కెట్ల వంటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇది మరింత కష్టం.

బ్లూటూత్‌.. తక్కువ శక్తి
బ్లూటూత్‌ ప్రాగ్జిమిటీ విధానం విషయానికి వస్తే.. అది తక్కువ శక్తిగల రేడియో తరంగాల ఆధారంగా పనిచేస్తుంది. మన ఫోన్‌లోని బ్లూటూత్‌ పరిజ్ఞానం నిర్ణీత సమయాల్లో అన్ని వైపులకూ రేడియో తరంగాలను పంపుతుంది. వైరస్‌ పాజిటివ్‌/హై రిస్క్‌ వ్యక్తుల ఫోన్‌లోని బ్లూటూత్‌ ఆ తరంగాలకు ప్రతిస్పందించడంతో రెండు ఫోన్ల మధ్య కమ్యూనికేషన్‌ ఏర్పడుతుంది. రెండు ఫోన్లూ డిజిటల్‌ ఐడీలను ఇచ్చిపుచ్చుకుంటాయి. తద్వారా మనకు దగ్గర్లో వైరస్‌ పాజిటివ్‌/హై రిస్క్‌ వ్యక్తి ఉన్న విషయం తెలుస్తుంది. నిర్ణీత ఇంటర్వెల్స్‌లో బ్లూటూత్‌ పరిజ్ఞానం ఈ తరంగాలను విడుదల చేస్తుందిగానీ.. ఎంత సమయం తేడాతో తరంగాలు విడుదలైతే మనం ఆ వ్యక్తులను సమీపించకుండా ఉండగలమనే అంశంపై స్పష్టత లేదు. త్వరత్వరగా తరంగాలు విడుదలైతే ఫోన్‌లో బ్యాటరీ త్వరగా అయిపోతుంది. అదే ఎక్కువ సమయం తేడాతో విడుదల చేస్తే మనం ఆ వ్యక్తులకు అత్యంత సమీపంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీంట్లో మరో సమస్య ఏమిటంటే.. ఇద్దరు వ్యక్తులు పక్కపక్క గదుల్లో ఉన్నారనుకోండి. ఇద్దరి మధ్య గోడ అడ్డు ఉంది. ఇద్దరిలో ఒకరు హై రిస్క్‌ అయి ఉంటే.. రెండో వ్యక్తిని ఆరోగ్యసేతు యాప్‌ అప్రమత్తం చేస్తుంది. కానీ, ఆ గోడను రేడియో తరంగాలు అధిగమించగలవుగానీ.. వైరస్‌ అధిగమించలేదు. అంటే హై రిస్క్‌ వ్యక్తి నుంచి మనకు ఏ ముప్పూ ఉండదు. సాంకేతికంగా ఇది ఫాల్స్‌పాజిటివ్‌ కిందే లెక్క. కొన్ని సందర్భాల్లో ఫాల్స్‌ నెగెటివ్‌లు కూడా వస్తాయి. ఉదాహరణకు మీరు క్యూలో నిలబడి ఉన్నారు. మీ చొక్కా జేబులో మీ ఫోన్‌ ఉంది. మీ వెనుక నిలబడింది హై రిస్క్‌ వ్యక్తి. కానీ.. బ్లూటూత్‌ పరిజ్ఞానం విడుదల చేసే తక్కువ శక్తిగల తరంగాలు మన శరీరం గుండా అవతలికి వెళ్లేసరికి మరింత బలహీనమైపోతాయి. అప్పుడు ఆ వ్యక్తిని ఆరోగ్యసేతు యాప్‌ గుర్తించలేదు. కాబట్టి యాప్‌లో ఈ లోపాలను సవరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రైవసీపై ఆందోళన
ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌  చేసుకున్న వారి వివరాల గోప్యతపైన కూడా టెక్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాపిల్‌, గూగుల్‌ వంటివి విడుదల చేసిన ప్రపోజల్‌, డీపీ3టి, మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన ప్రైవేట్‌ కిట్‌ ప్యాక్ట్‌, సింగపూర్‌ అభివృద్ధి చేసిన ట్రేస్‌ టుగెదర్‌ వంటి యాప్స్‌లాగా కాకుండా.. ఆరోగ్యసేతు యాప్‌ ప్రతి స్మార్ట్‌ఫోన్‌కూ స్టాటిక్‌ ఐడీని ఉపయోగిస్తుంది. ఆ యాప్‌లతో పోలిస్తే ఆరోగ్యసేతు యాప్‌ మన ఫోన్లకు సంబంధించిన మెటాడేటాను ఎక్కువగా సేకరిస్తుంది. ఈ లోపాలవల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆస్పత్రుల సమాచారమేదీ?
కొవిడ్‌-19పై అవగాహన కోసం, ముందుజాగ్రత్తల కోసం ఆరోగ్యసేతు యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు ప్రభుత్వం  చెబుతోంది. ఆ ఉద్దేశం మంచిదేగానీ.. ఏయే ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్స జరుగుతోంది? ఆయా ఆస్పత్రుల్లో బెడ్‌ల లభ్యత ఎంత? టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఎక్కడున్నాయి? క్వారంటైన్‌ కేంద్రాలు ఎక్కడున్నాయి? తదితర అంశాలకు సంబంధించి సమగ్రమైన సమాచారం ప్రస్తుతం ఎక్కడా లభ్యం కావట్లేదు. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆ సమాచారాన్ని కూడా ఆరోగ్యసేతు ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచితే బాగుంటుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

Courtesy Andhrajyothi