20 పడకల ఆస్పత్రులకు కూడా వర్తింపు
*పిహెచ్‌సిల స్థాయి నుంచే బలోపేతం పై దృషి
* ముగిసిన ఆరోగ్య సంస్కరణల కమిటీ కసరత్తు
* 18న ముఖ్యమంత్రికి నివేదిక
డెంగీ వంటి జ్వరాలకు కూడా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ చికిత్స అందనుంది. తీవ్ర అనారోగ్యం కలిగించే దాదాపు 168 రకాల జ్వరాలకు ఈ పథకం కింద ఉచిత వైద్యసేవలు అందనున్నాయి. ప్రస్తుతం ఉన్న చికిత్సలకు అదనంగా మొత్తం దాదాపు 2100 వ్యాధులకు పథకం అమలుకానుంది. అంతేకాక 20 పడకల ఆస్పత్రిలో కూడా ఆరోగ్యశ్రీ వర్తించేలా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల పరిధి కూడా విస్తరించనుంది. ప్రభుత్వం నియమించిన ఆరోగ్య సంస్కరణల కమిటీ గురువారం ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీలో తుదిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా పలు వైద్యఆరోగ్య పథకాలు, సేవలు సమావేశంలో చర్చకు వచ్చాయి. వంద పడకల ఆస్పత్రుల్లో వసతులు, వైద్యులు, సిబ్బందిని నియమించి బలోపేతం చేసేలా కమిటీ నివేదికలో సూచించినట్లు తెలిసింది. ఏరియా ఆస్పత్రులతోపాటు, జిల్లా, బోధనాస్పత్రులకు అనుసంధానంగా బిఎస్సీ నర్సింగ్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని కమిటీ అభిప్రాయపడింది. అన్ని ఆస్పత్రుల్లోనూ వైద్యులు, రోగుల నిష్పత్తి ప్రకారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, సిహెచ్‌సిలో గైనకాలజిస్ట్‌ ఎప్పుడూ అందుబాటులో ఉండేందుకు షిఫ్ట్‌ పద్ధతిలో వారిని మరింత మందిని నియమించాలని సూచించినట్లు తెలిసింది. మాతా శిశు మరణాలను తగ్గించేందుకు సబ్‌ సెంటర్స్‌, పిహెచ్‌సిల్లో ప్రసవాలను చేయరాదని, వారిని దగ్గర్లోని సిహెచ్‌సి, పెద్దాస్పత్రికే ..108 ద్వారా తరలించేలా కమిటీ సమా వేశంలో చర్చించింది. పిహెచ్‌సిల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, టిబి, హెచ్‌ఐవి, మానసిక వికలాంగులు, మద్యానికి బానిసైనవారికి కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు, ఆరోగ్య అలవాట్లు, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించేలా ప్రతి పిహెచ్‌సిలో కౌన్సిలర్‌, ఆరోగ్య కార్యకర్తను అందుబాటులో ఉంచాలని అభిప్రాయపడింది. వైద్య విద్య పరంగా సీనియర్‌ రెసిడెంట్లకు ఇచ్చే పారితోషకాలు రూ.30 వేల నుంచి రూ.75 వేలకు పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. గిరిజన ప్రాంతాల్లో వైద్యఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అందుకు అక్కడ పనిచేసే వైద్యులతోపాటు వైద్య సిబ్బందికీ పారితోషకాలు ఇవ్వాలని కమిటీ అభిప్రాయపడింది. అంతేకాక ప్రతి పదివేల జనాభాకు ఒక ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ విధానాన్ని తీసుకువచ్చే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం వైద్యసేవలు నిర్వహిస్తున్న ప్రయివేటు సంస్థలు 80 శాతం సంస్థల సేవలను రద్దు చేసి, ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కేవలం రూ. 1 కోటి లోపు అయ్యే కాంట్రాక్ట్‌, పారిశుధ్య సేవలు, మహా ప్రసాధనం వంటివి మాత్రమే కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉన్నపళంగా సేవలు నిలిపివేస్తే రోగులకు ఇబ్బంది కనుక ప్రభుత్వం సేవలను నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకొని, ప్రయివేటు సంస్థల సేవలు డిసెంబర్‌ వరకు కొనసాగించి, ఆ తర్వాత రద్దు చేయనుంది. ఇక 30 పడకలు ఉన్న ఏరియా ఆస్పత్రులను 50 పడకలకు అప్‌గ్రేడ్‌ చేయడం, వాటిలో ఆప్తమాలజిస్ట్‌ అందుబాటులో ఉంచడంతోపాటు కంటి శస్త్ర చికిత్సలకు అవసరమైన సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచాలని కమిటీ సూచించినట్లు తెలిసింది. ఇలా … ప్రతి అంశంలోనూ తగు సూచనలు ఇస్తూ దాదాపు 150 పేజీల నివేదికను 18న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి అందించనుంది.

Courtesy Prajashakthi…