– వాషింగ్టన్‌ కాదది…సైనిక దుర్గం
– కర్ఫ్యూ నీడలో మరిన్ని పట్టణాలు

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన సొంత పౌరులపైకి సైన్యాన్ని ప్రయోగించారు. నిరసనకారులను అణచివేసేందుకు 1600 మంది సైనికులను మోహరించారు. వాషింగ్టన్‌ డీసీని సైనిక దుర్గంగా మార్చేశారు. రాష్ట్రాలు, స్థానిక సంస్థలు నేషనల్‌ గార్డ్స్‌, పోలీసులను ఉపయోగించి నిరసనకారులను అణచివేయడంలో విఫలమైతే సైన్యాన్ని దించుతానని ట్రంప్‌ ప్రకటించి 24 గంటలు కూడా కాకమునుపే వాషింగ్టన్‌లో సైన్యం కదం తొక్కింది. మరిన్ని పట్టణాలకు కర్ఫ్యూను విస్తరించారు. సైన్యం భారీ మోహరింపులు, ట్రంప్‌ బెదిరింపులు, కర్ఫ్యూలు,ఆంక్షలు ఎన్ని విధించినా, లెక్క చేయకుండా వరుసగా ఎనిమిదో రోజు కూడా నిరసనలు హోరెత్తాయి. రోజు రోజుకీ ‘ఐకాంట్‌ బ్రీత్‌’ ఉద్యమం విస్తరిస్తున్నది. బుధవారం అమెరికాలోని మరిన్ని ప్రాంతాలకు ఈ నిరసనలు విస్తరించాయి. అమెరికాను ఇది ఓ కుదుపు కుదిపేయడమే కాదు, యూరప్‌లో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, గ్రీస్‌, స్పెయిన్‌ తదితర దేశాలకు కూడా విస్తరించింది. బ్లాక్‌ లైవ్స్‌మేటర్‌ ఆధ్వర్యాన నిరసనలతో పారిస్‌ నగరం అట్టుడికింది.

అమెరికాలో చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా మొత్తం మీద ఈ రోజు ఆందోళనలు ప్రశాంతంగానే సాగినట్టు అధికారులు తెలిపారు. లాస్‌ ఏంజిల్స్‌, ఫిలడెల్ఫియా, అట్లాంటా, సీటెల్‌లో చాలా వరకు ప్రశాంతంగానే సాగాయి. నిరసనలను అదుపులోకి తేచ్చేందుకు వాషింగ్టన్‌లో సైనిక శిబిరాలు ఏర్పాటు చేసినట్టు పెంటగాన్‌ ప్రతినిధి జోనాథన్‌ రాత్‌ హాఫ్మన్‌ తెలిపారు. సొంత పౌరుల పైకి సైన్యాన్ని ప్రయోగించడమంటే అమెరికాలో సైనిక పాలన విధించడమేనని, ట్రంప్‌ ఫాసిస్టు పాలన దిశగా అడుగులేస్తున్నారని విమర్మకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరసనకారుల్లోకి అరాచక శక్తులను చొప్పించడం ద్వారా హింస, విధ్వంసాలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందన్న విమ ర్శలు వినిపిస్తున్నాయి. ఈ హింసను చూపి ట్రంప్‌ తన నియంతృత్వ పోకడలను సమర్థించుకోవాలని చూస్తున్నారని విమర్శకులు పేర్కొన్నారు.

Courtesy Nava Telangana