– కార్పొరేట్లు బాగుంటే చాలంటున్న మోడీ సర్కార్‌
– ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్న బీజేపీ పెద్దలు

కొండూరి వీరయ్య

భారతీయ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. దివాలా తీస్తున్న బ్యాంకులను నిలబెట్టడం కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని బ్యాంకులకు బదలాయిస్తోంది. ఈ నష్టాలకు కారణం పారుబకాయిలు. బకాయి పడ్డ కార్పొరేట్‌ కంపెనీలు శతకోటీశ్వరుల జాబితాలో చేరుతుంటే అప్పిచ్చిన బ్యాంకులు మాత్రం దివాలా అంచుకు చేరుతున్నాయి. సెప్టెంబరు 2019 నాటికి 7.79 లక్షల కోట్ల రూపాయల పారుబకాయిలు ఉన్నాయి. అయితే, ఏయే కంపెనీ ఎంతెంత బకాయి ఉన్నదో చెప్పటానికి ప్రభుత్వానికి బ్యాంకు నిబంధనలు అడ్డం వస్తున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశించిన తర్వాత కూడా అప్పులు ఎగ్గొట్టిన బడా కంపెనీల వివరాలను ప్రభుత్వం జనం ముందు పెట్టటానికి సిద్ధం కావటం లేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల దిశను తెలియచేసే పరిణామం ఇది. అయితే, బ్యాంకుల్లో జనం దాచుకుంటున్న సొమ్ముకు సంబంధించిన కీలకమైన సమస్య ముందుకొస్తోంది. జనం తమ కష్టార్జితం బ్యాంకుల్లోనే భద్రం అన్న నమ్మకంతో ఉంటున్నారు. కానీ,నోట్లరద్దు తర్వాత ఈ నమ్మకం సడలుతోంది. వాణిజ్య బ్యాంకుల్లో ఇప్పటి వరకు జనం దాచుకున్న సొమ్ము 130 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో 62.5 శాతం అంటే 81.6 లక్షల కోట్లు ప్రభుత్వ బ్యాంకుల్లో ఉంటే, మిగిలింది ప్రయివేట్‌ బ్యాంకుల్లో, సహకార బ్యాంకుల్లో ఉన్న సొమ్ము. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల నమ్మకం కోల్పోయిన పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు తమ సొమ్మును స్టాక్‌ మార్కెట్‌కో, విదేశీ బ్యాంకులకో, సిరాస్థి వ్యాపారాలకో మార్చుకునే శక్తి కలిగి ఉన్నారు. కానీ, చిన్న మొత్తాలు పొదుపుచేసుకునే సాధారణ ఉద్యోగులకు, దినసరి కార్మికులకు ఈ వెసులుబాటు లేదు. గత సంవత్సరం పంజాబ్‌ మహారాష్ట్ర సహకార బ్యాంకు దివాలా తీసినప్పుడు ఈ బ్యాంకు ఖాతాదారులు తమ సొమ్ము వెనక్కు తీసుకోకుండా రిజర్వు బ్యాంకు ఆంక్షలు పెట్టింది. ఆ సమయంలో సోషల్‌ మీడియాలో దుమారం లేచింది. మరో తొమ్మిది బ్యాంకుల్లోని ఖాతాదారులకు కూడా ఇదే గతి పట్టకున్నదన్నది ఈ దుమారం సారాంశం. ఈ దుమారం ఎంత స్థాయిలో ఉందంటే చివరకు ప్రజల్లో భయాందోళనలు పోగొట్టటానికి రిజర్వుబ్యాంకే ఓ ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది.

ఈ పరిస్థితుల్లో బెయిల్‌ ఇన్‌ ప్రతిపాదన గురించిన చర్చ మొదలైంది. 2017లో ద్రవ్య పరిష్కారం, డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది. 2018 ఆగస్టులో ఈ బిల్లును ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. దీనికి కారణం బిల్లుల్లో బెయిల్‌ ఇన్‌ క్లాజు. ఈ బిల్లు ఉద్దేశ్యం పరిష్కారాల కేంద్రం ఏర్పాటు. ఈ కేంద్రం బ్యాంకులు, బీమా కంపెనీలు, సహకార సంస్థలు, మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌, ద్రవ్య వ్యవహారాలు చూసే బ్యాంకింగేతర కంపెనీల ఆర్థిక స్థితిగతులను పర్యవేక్షించాలి. ఏ ఆర్థిక సంస్థ అయినా దివాలా తీసే స్థితికి వస్తే, మరోరకమైన సమస్యను ఎదుర్కొనే పరిస్థితి వస్తే ఆ సమస్యలు పరిష్కారం చేయటం ఈ పరిష్కారాల కేంద్రం విధి. ఇప్పటి వరకు బ్యాంకింగ్‌, బ్యాంకింగేతర సంస్థలు నష్టపోయినా, దివాలా తీసినా వాటిని మరో బ్యాంకుల్లో విలీనం చేయటం, ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఖాతాదారుల సొమ్ముకు గ్యారంటీ ఇవ్వటం వంటి పనులు కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా ఉన్నాయి. ఈ బిల్లు ద్వారా ఈ బాధ్యతను పరిష్కార కేంద్రానికి బదలాయించబోతోంది. అంటే ఇకపై బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఏ సమస్య వచ్చినా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోదు అన్నది ఈ బిల్లు సారాంశం. దానికి పెట్టిన ముద్దు పేరే బెయిల్‌ ఇన్‌ క్లాజు. దీన్ని మరింత తేలిగ్గా అర్థం చేసుకోవటానికి ఈ పోలికను పరిశీలించవచ్చు. ప్రయివేట్‌ కంపెనీలు దివాలా తీస్తే ప్రభుత్వం బ్యాంకుల ద్వారా వాటికి అదనపు నిధులు సమకూరుస్తుంది. దీన్నే బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీలు అంటున్నారు. ఇప్పడు ఆయా ఆర్థిక సంస్థలు దివాలా తీస్తే తమ వద్ద ఉన్న సొమ్మునే ఈ దివాలా నుంచి బయటపడే పెట్టుబడిగా వాడుకోమని ఈ బిల్లు చెప్తోంది. దీన్నే బెయిల్‌ ఇన్‌ అంటున్నారు.

ఇప్పటి వరకు బెయిల్‌ అవుట్‌ పథకం ద్వారా బీజేపీ ప్రభుత్వం బ్యాంకులకు వచ్చిన నష్టాలను పూడ్చటానికి 2.66 లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టింది. అంటే ఏయే బ్యాంకుల్లో ఎంతెంత సొమ్ము ప్రయివేట్‌ కంపెనీలు ఎగ్గొడితే అంతంత సొమ్మును కేంద్రం తన ఖాతా నుంచి ఆయా బ్యాంకుల్లో జమ చేసింది. దీనికి భిన్నమైనది బెయిల్‌ ఇన్‌ పథకం. ఏదైనా బ్యాంకు నష్టపోతే ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి బయటి నుంచి నిధులు సమీకరించటానికి బదులు ఉన్న అప్పులు సవరించుకోవాలి. ఇక్కడ బ్యాంకులకు ఉన్న అప్పులు అంటే ఖాతాదారుల సొమ్ము తిరిగి ఇచ్చే బాధ్యత. ఈ అప్పులను సవరించుకోవటం అంటే ఖాతాదారుల సొమ్మును తిరిగి ఇచ్చే బాధ్యతలో మార్పులే. ఎఫ్‌ఆర్డీఐ బిల్లులోని 52వ క్లాజు ప్రకారం నష్టాల్లో ఉన్న బ్యాంకులు ఖాతాదారుల సొమ్మును ఎగ్గొట్టవచ్చు. లేదా ఓ పదేండ్ల తర్వాతనో, పాతికేండ్ల తర్వాతనో వచ్చి తీసుకొమ్మని అప్పటి వరకు ఖాతాల్లో ఉన్న సొమ్మును తీసుకోవటానికి అవకాశం లేదని ఖాతాదారులకు ఓ ప్రేమ లేఖ పంపొచ్చు. ఇది ఆచరణలో బెయిల్‌ ఇన్‌ క్లాజు రూపం. ఈ విధంగా ఖాతాదారులకు చెల్లించటానికి తిరస్కరించిన సొమ్మును బ్యాంకులు తమ మూలధనంగా మార్చుకుని మళ్లా కార్పొరేట్లకు అప్పులివ్వవచ్చు. ఈ బెయిల్‌ ఇన్‌ క్లాజులో మరో దారుణమైన కోణం కూడా ఉంది. బ్యాంకుకు ఉన్న నష్టాలు, బ్యాంకు ఖాతాలో ఉన్న ఖాతాదారుల సొమ్ము బేరీజు వేసుకుని ఒన్‌ టైం సెటిల్మెంట్‌ తరహాలో ఖాతాదారులకు లక్షలకు వెయ్యో రెండు వేలో, పలుకుబడి కలిగిన ఖాతాదారులైతే పదివేలో ముట్టచెప్పి చేతులు దులిపేసుకోవచ్చు. అంటే ఈ బిల్లు ఆమోదం పొందితే ఖాతాదారుల సొమ్ముపై పూర్తి హక్కులు అధికారాలు బ్యాంకులకే జమపడతాయి తప్ప ఖాతాదారులకు తమ సొమ్ముపై ఎటువంటి హక్కు ఉండబోదు. దీని ప్రమాదాన్ని గుర్తించిన ప్రజలు 2017లో ఒక్కసారిగా రోడ్లమీదకు రావటంతో ప్రభుత్వం తాత్కాలికంగా ఈ బిల్లును వెనక్కు తీసుకుంది. కానీ, రెట్టించిన సంఖ్యాబలంతో ముందుకొచ్చిన బీజేపీ ఈ సారి కొద్దిపాటి సవరణలతో ఎఫ్‌ఆర్డీఐ బిల్లును మళ్లీ ముందుకు తేనుంది. ఖాతాదారులూ …. మీ సొమ్ము భద్రం!

Courtesy Nava telangana