Image result for Are women now Safe?"‘‘హత్యాచారం చేసిన దుండగులను చంపిపడెయ్యాలి!
ఆ దుర్మార్గులను ఉరి తీయాలి…. కాల్చి పారేయాలి!!
దిశకు సత్వర, సహజ న్యాయం కావాలి!!’’
అవును… ఆ ఆగ్రహావేశాలకు తగినట్టుగానే అంతా జరిగింది.
విచారణ జరుగుతుండగానే… కోర్టు మెట్లెక్కకుండానే…
నిందితులకు ఎన్‌కౌంటర్‌ శిక్ష పడింది.
పంటికి పన్ను… కంటికి కన్ను… సూత్రం గెలిచింది.
కానీ, ఈ దెబ్బతో వ్యవస్థ మారుతుందా? అసలు సమస్య తీరిందా?
సమాజం, సర్కారు చూపుతున్న దిశా నిర్దేశం ఇదేనా?
ఇప్పటికీ న్యాయం వాకిట నిలుచున్న
ఎందరో నిర్భయలు… కఠువాలు… ఉన్నావ్‌ల సాక్షిగా…
ఇక… మన ఇంట్లోని పిల్లా పాపల భయం తీరినట్టేనా?
నిజంగా… భయం తీరిందా… పాపా?
నిర్భయ
ఏడేళ్లయినా ఏదీ న్యాయం?
ఎక్కడ?: దేశ రాజధాని ఢిల్లీలో
ఎప్పుడు?: 2012 డిసెంబరు 16న,
ఏం జరిగింది?: ఇరవైమూడేళ్ళ ఫిజియోథెరపీ విద్యార్థిని నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు అత్యాచారం జరిపారు. ఆమెను అతి క్రూరంగా హింసించారు. తీవ్రంగా గాయపడిన ఆమె 13 రోజులపాటు మృత్యువుతో పోరాడింది. 2012 డిసెంబరు 29న మరణించింది. ఈ సంఘటన దేశమంతటా పెను ప్రకంపనలు సృష్టించింది. ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. నిందితులను 24 గంటల్లో అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనతో నిర్భయ చట్టానికి కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా రూపకల్పన చేసింది. చట్టం 2013 ఏప్రిల్‌ 3 నుంచి అమలులోకి వచ్చింది.
కేసు ఏమైంది?నిందితుల్లో ఒకడైన రామ్‌ సింగ్‌ జైల్లో ఉరి వేసుకున్నాడు. మరొక నిందితుడు మైనర్‌ కావడంతో బాల నేరస్థుల చట్లాల ప్రకారం అతనికి గరిష్ఠంగా మూడేళ్ళ జైలు శిక్ష విధించారు. మిగిలిన నిందితులకు మరణ శిక్ష విధిస్తూ 2013 సెప్టెంబరులో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పును 2014 మార్చిలో ఢిల్లీ హైకోర్టు, 2017 మేలో సుప్రీకోర్టు సమర్థించాయి. కాగా, వినయ్‌ శర్మ అనే నిందితుడు తనకు మరణశిక్ష నుంచి క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు విజ్ఞప్తి చేసుకున్నాడు. దాన్ని తిరస్కరించాలని హోమ్‌ మంత్రిత్వశాఖ, ఢిల్లీ ప్రభుత్వం సిఫారసు చేశాయి. మహిళపై అత్యాచారం కేసుల్లో మరణ శిక్ష పడిన నిందితులకు క్షమాభిక్ష కోరే అర్హత లేదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వినయ్‌ శర్మతో పాటు పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌, ముఖేశ్‌ సింగ్‌ అనే మరో ముగ్గురు నిందితులకు కూడా ఉరి శిక్షను తీహార్‌ జైలు అధికారులు త్వరలోనే అమలు చేసే అవకాశం ఉంది.
ఉన్నావ్‌- 2017
ఒక అత్యాచారం- మూడు హత్యలు
ఎక్కడ?: ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో
ఎప్పుడు?: 2017 జూన్‌ 4న
ఏం జరిగింది?: ఉద్యోగం ఇప్పిస్తానని ఒక యువతిని ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌కి చెందిన బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ దగ్గరకు శశిసింగ్‌ అనే మహిళ తీసుకువెళ్ళింది. అప్పుడు ఎమ్మెల్యే తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆ యువతి ఆరోపించినా, పోలీసులు మొదట్లో పట్టించుకోలేదు. ప్రతిపక్షాలు, పౌర సంఘాలు ఆందోళనలకు దిగాయి. తరువాత కేసు నమోదు చేసిన పోలీసులు బాధిత యువతి తండ్రిని నిర్బంధించారు, అతను పోలీస్‌ కస్టడీలో మరణించాడు. కాగా, ఈ ఏడాది జూలైలో బాధిత యువతి, ఆమె బంధువులు, న్యాయవాది ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టడంతో ఆమె బంధువులు ఇద్దరు మరణించారు. ఆ యువతికీ, న్యాయవాదికీ తీవ్రంగా గాయాలయ్యాయి. చంపుతామని బెదిరింపులు వస్తున్నట్టు అంతకు పది రోజుల ముందే సుప్రీంకోర్టుకు లేఖ కూడా రాయడం గమనార్హం. కాగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు, ఆమె చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే తాత్కాలిక న్యాయస్థానాన్ని ప్రత్యేక న్యాయమూర్తి నిర్వహించారు. బాధితురాలి వాఙ్మూలాన్ని రికార్డు చేసుకున్నారు. నిందితుణ్ణి, అతని సోదరుణ్ణి పోలీసులు అరెస్ట్‌ చేశారు.
కేసు ఏమైంది?: కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ను పార్టీ నుంచి బిజెపి సస్పెండ్‌ చేసింది. ఆ తరువాత బహిష్కరించింది. కుల్దీప్‌ సింగ్‌పై అత్యాచారం, (బాధితురాలి తండ్రి) హత్య కేసుల్లో ఆరోపణల మీద ప్రత్యేక కోర్టులో వాదోపవాదాలు పూర్తయ్యాయి. ఈ కేసులో కుల్దీప్‌ సింగ్‌, అతని సహచరురాలు శశి సింగ్‌, ముగ్గురు మాజీ పోలీసులు, కుల్దీప్‌ సింగ్‌ సోదరుడు అతుల్‌తో సహా పదకొండు మంది నిందితులుగా ఉన్నారు. ఈ నెల 15న తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఉన్నావ్‌- 2018
బెయిల్‌ మీద వచ్చి మంట పెట్టారు!
ఎక్కడ?: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో
ఎప్పుడు?: 2018 డిసెంబరులో
ఏం జరిగింది?ఇరవై రెండేళ్ళ యువతిని శివం, శుభం త్రివేదీ అనే వ్యక్తులు ఎత్తుకుపోయి, అత్యాచారం చేశారు. ఎన్నో ప్రయత్నాల తరువాత ఈ ఏడాది మార్చిలో నిందితులపై కేసు నమోదైంది. పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. అయితే వారం రోజుల కిందట, నవంబరు 30న నిందితులు బెయిల్‌ మీద బయటకు వచ్చారు. అప్పటి నుంచీ శుభం త్రివేదీ ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. దీనిపై పోలీసులకు బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో, గురువారం ఆ యువతిపై మరో ముగ్గురితో కలిసి నిందితులు దాడి చేశారు. ఆమెపై పెట్రోలు పోసి నిప్పు అంటించారు. దాదాపు కిలోమీటర్‌ దూరం ఆమె శరీరాన్ని దహిస్తున్న మంటలతోనే ‘కాపాడండి’ అంటూ పరుగులు పెట్టింది. ఇప్పుడు ఆమె 90 శాతం గాయాలతో ప్రాణాల కోసం పోరాడుతోంది.
కేసు ఏమైంది?నిందితులు అయిదుగురిలో నలుగురిని వాళ్ళ ఇళ్ళలోనే పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయిదో నిందితుడు సరిహద్దు రాష్ట్రమైన బీహార్‌లోని పోలీస్‌ స్టేషన్లో లొంగిపోయాడు. అత్యాచారం కేసు విచారణ ఇంకా నడుస్తోంది. కొత్తగా హత్యాయత్నం కేసు తోడయింది.
కఠువా
శిక్ష పడినా… ఉరి తప్పింది!
ఎక్కడ?: కాశ్మీర్‌లోని కఠువాలో
ఎప్పుడు?: 2018 జనవరిలో
ఏం జరిగింది?కఠువా గ్రామంలో ఎనిమిదేళ్ళ బాలిక కిందటి ఏడాది జనవరి 10న అదృశ్యం అయింది. ఆమెను కిడ్నాప్‌ చేసిన నిందితులు గ్రామంలోని ఒక ఆలయంలో నిర్బంధించారు. నాలుగు రోజులపాటు అఘాయిత్యాలు సాగించి, చంపేశారు. ఆమె మృతదేహం జనవరి 17న గ్రామ శివార్లలో కనిపించింది. ఈ సంఘటన కాశ్మీర్‌ లోయలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. నిందితులు కేసు నుంచి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. కేసు సంచలనం కావడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.
 కేసు ఏమైంది?: ఈ కేసులో నిందితులకు మరణశిక్ష విధించాలన్న డిమాండ్లు విస్తృతంగా వచ్చాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ న్యాయస్థానంలో విచారించారు. ఈ ఏడాది జూన్‌ 10న తీర్పు ప్రకటించారు. ఆలయ పూజారి సాంఝీరాం, ప్రత్యేక పోలీస్‌ అధికారి దీపక్‌ ఖజూరియా, పర్వేష్‌ కుమార్‌లకు జీవిత ఖైదు విధిస్తూ, వారు మరణించేవరకూ ఈ శిక్ష అమలు అవుతుందని న్యాయస్థానం పేర్కొంది.
ఎన్‌కౌంటర్‌ పరిష్కారమా?
దిశా ఘటనలో ఎన్‌కౌంటర్‌ వార్త వినగానే ఒక మహిళగా, తల్లిగా సంతోషించాను. కానీ ఎంతమందిని ఎన్‌కౌంటర్‌ చేసుకుంటూ వెళ్తారు. ఎన్‌కౌంటర్‌ అన్నింటికీ సమాధానం కాదు. దీని వల్ల బాధిత కుటుంబ సభ్యులకు కొంత ఉపశమనమే తప్ప, వారి బాధ ఎప్పటికీ తీరదు. పెద్ద కుటుంబాలకు చెందిన వారు ఇలాంటి కేసుల్లో ఉంటే ఇలాగే ఉరి తీయగలరా? అని కూడా సోషల్‌ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం నిజమైన పరిష్కారమా? ఇలా ఆలోచిస్తే అంటే చాలా ప్రశ్నలొస్తాయి. నిర్భయ కేసులో నిందితులను 7 ఏళ్లుగా జైలులో పెట్టి మేపుతున్నారు. వాళ్లల్లో ప్రధాన నిందితుడు హాయిగా బయట తిరుగుతున్నాడు..? ఇదెక్కడి న్యాయం? ఆ విషయం గురించి కూడా ప్రశ్నించాలి? దేశం మారాలి, జనాలు మారాలి అన్నదాని కంటే ముందు మనం మారి దేశాన్ని బాగుచేసుకోవాలి. న్యాయ వ్యవస్థను మార్చుకోవాలి. చట్టాలు మారాలి. ఎడ్యుకేషన్‌ సిస్టం నుండి, తల్లిదండ్రులు ఆడపిల్లల ను పెంచే తీరులో సమానత్వం రావాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పెరగాలి.’’
మంచు లక్ష్మీ ప్రసన్న

(Courtesy Andhrajyothi)