ఆర్‌టిసి కార్మికులకు పేరుకుపోయిన బకాయిలు
* పరిష్కారానికి దూరంగా అనేక సమస్యలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:
సమస్యల పరిష్కారం కోసం తెలంగాణలో ఆర్‌టిసి కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతోంది. 28 రోజులుగా కార్మికులు సమ్మెలోనే ఉన్నా,హైకోర్టు పదేపదే అక్షింతలు వేస్తున్నా తెలంగాణ ప్రభుత్వ వైఖరిలో మార్పు కనిపించడంలేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆర్‌టిసి కార్మికులకు సంబంధించిన అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద తేడా లేదనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రూ.3796 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ.3606 కోట్లు బకాయిలు ఉన్నాయి. కార్మికులకు 2013కు సంబంధించి వేతన సవరణలో బకాయి ఉన్న 40 శాతాన్ని ఉగాది నాటికే చెల్లిస్తామని గత ప్రభుత్వం చెప్పినా, ఆ తరువాత ప్రస్తుత ప్రభుత్వం సెప్టెంబర్‌ 30 నాటికి చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకూ ఆ మొత్తం కార్మికులకు చేరలేదు. ప్రావిడెంట్‌ ఫండ్‌ (పిఎఫ్‌) కోసం కార్మికుల వేతనాల్లో కోత విధించినా ఆ మొత్తాన్ని పిఎఫ్‌ ట్రస్ట్‌కు జమ చేయకుండా యాజమాన్యం ఖర్చులకు వాడేసుకుంది. దాదాపు ఏడాదికి పైగా చెల్లించకపోవడంతో ఆ బకాయి రూ.814 కోట్లకు చేరుకుంది. . ఎస్‌ఆర్‌బిఎస్‌, ఎస్‌బిటి ట్రస్ట్‌, సిసిఎస్‌ తదితర అంశాల పరిస్థితి కూడా ఇంతే! ఆర్టీసిలో ఉద్యోగ విరమణ చేసిన వారికి కూడా యాజమాన్యం బకాయి ఉంది. సమైక్య రాష్ట్ర సమ్మె కాలానికి సంబంధించిన లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ను ఇంతవరకూ చెల్లించలేదు. మొత్తంగా రిటైర్డ్‌ ఉద్యోగులకు రూ.15 కోట్లు చెల్లించాల్సి ఉంది. రిటైర్డ్‌ ఉద్యోగులకు తెల్ల రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ, పెన్షన్‌ సదుపాయాలను కల్పించాలని తెలంగాణలో రిటైర్డ్‌ ఆర్‌టిసి కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

అద్దె బస్సులపైనా అదే తీరు…
అద్దె బస్సుల పెంపు విషయంలో ఎపిఎస్‌ ఆర్‌టిసి కూడా తెలంగాణలోలాగే వ్యవహరిస్తోంది. ఆర్‌టిసిలో మొత్తం 12,027 బస్సులు ఉండగా అందులో 2568 అద్దె బస్సులే ఉన్నాయి. కొత్తగా ప్రవేశపెట్టనున్న విద్యుత్‌ బస్సులను ప్రయివేటు సంస్థలకే అప్పగించేలా టెండర్లు పిలిచారు. ఈ ప్రక్రియ ఇప్పటికే తుదిదశకు చేరుకుంది. విద్యుత్‌ బస్సులను ప్రయివేటుకు అప్పగించడం ద్వారా ఫేమ్‌-2 పథకం కింద కేంద్రం ఇచ్చే రాయితీ బస్సులు నడిపే ప్రయివేటు సంస్థలకే అందనుంది. ఖాళీల భర్తీలో తెలంగాణలో వైఖరే ఎపిలోనూ కనిపిస్తోంది. పదేళ్లుగా ఆర్‌టిసిిలో ఉన్న ఖాళీలను భర్తీ చేయలేదు. 2015-16లో 59,372గా ఉన్న ఉద్యోగుల సంఖ్య 2018-19 నాటికి 53,263కు పడిపోయింది.

ప్రభుత్వం నిధులు అందించాలి
ఆర్‌టిసి బడ్జెట్‌లో కేటాయించిన నిధుల మొత్తాన్ని తక్షణమే ఆర్‌టిసికి అందించాలి. ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చేలా ఆర్‌టిసి అధికారులు కూడా ప్రభుత్వానికి విన్నవించాలి. కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడంపై యాజమాన్యం దృష్టి పెట్టాలి. విద్యుత్‌ బస్సులను ప్రయివేటుకు ఇవ్వడాన్ని విరమించుకోవాలి. ఖాళీలను భర్తీ చేసి ఆర్‌టిసిని పటిష్టపరచాలి.
సిహెచ్‌ సుందరయ్య, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ప్రధాన కార్యదర్శి

బకాయిలను తక్షణమే చెల్లించాలి
యజమాన్యం కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ తక్షణమే చెల్లించాలి. వేతన సవరణ బకాయిల్లో 40 శాతాన్ని గత నెల చివరికి చెల్లిస్తామని చెప్పి ఇప్పటి వరకూ చెల్లించకపోవడం శోచనీయం. విలీన ఉప కమిటీల్లో కార్మిక సంఘాలను భాగస్వాములను చేయాలి. కార్మికుల తరపున సలహాలు, సూచనలు చేసే అవకాశం కల్పించాలి.
పి దామోదరరావుఇయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Courtesy prajasakthi…