రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి సాధించాలంటే వివిధ ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తూ, అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యత సాధించాలి. అభివృద్ధి 13 జిల్లాలకు వికేంద్రీకరణ జరగాలి. రాష్ట్ర అభివృద్ధిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలి. మేధావులను, అభ్యుదయవాదులను, ప్రగతిశీల శక్తులను, సామాజిక, ప్రజా సంఘాలను సమగ్రాభివృద్ధి సాధనలో కార్యోన్ముఖులను చేయాలి.

సమాజంలో అన్ని తరగతుల ప్రజలు, వివిధ సామాజిక వర్గాలు అభివృద్ధి చెందితే సమ్మిళిత అభివృద్ధి అవుతుంది. ఎస్‌.సి/ఎస్‌.టి సబ్‌ ప్లాన్‌ ఉన్నప్పటికి దళితులు, గిరిజనుల అభివృద్ధి ఆశించిన విధంగా లేదు. భూసమస్యలపై నియమించిన కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు జరగలేదు. భూ కేంద్రీకరణ కొనసాగుతూనే ఉన్నది. భూ పంపిణీ గురించి ప్రభుత్వాలు మాట్లాడడం లేదు.

ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నవంబరు 1న జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఐదేళ్లుగా ‘నవ నిర్మాణ దీక్ష’ పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హడావిడి చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. గతంలో, ఇప్పుడు కూడా స్వర్ణాంధ్రప్రదేశ్‌, సంతోష ఆంధ్రప్రదేశ్‌, హరితాంధ్ర ప్రదేశ్‌, నవ్యాంధ్ర ప్రదేశ్‌ సాధిస్తామని చెబుతున్నారు. అభివృద్ధి అంటే ఆర్థికాభివృద్ధి మాత్రమే అని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. గత ఐదేళ్లుగా రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సంవత్సరానికి 11 శాతం పైగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధించామని, ఇది జాతీయ స్థాయి కంటే ఎక్కువని ప్రచారం చేసుకున్నప్పటికి ఎన్నికలలో ప్రజలు దారుణంగా ఓడించారు. 2019 మేలో గెలుపొందిన జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ప్రకటిస్తున్న ‘నవరత్నాలు’ సంక్షేమానికి కొంత మేరకు దోహదపడవచ్చుగాని, దీర్ఘకాల దృష్టితో పరిశీలించినప్పుడు సమగ్ర అభివృద్ధికి దోహదపడేవిగా లేవు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర, సమ్మిళిత, సుస్థిర, మానవాభివృద్ధి జరగాలని ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

సమగ్ర అభివృద్ధి-ఆలోచనలు
1956లో ఏర్పడిన ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధిని హైదరాబాద్‌ చుట్టూ కేంద్రీకృతం చేశారు. ప్రభుత్వ రంగ భారీ పరిశ్రమలు, ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు, ఐ.టి పరిశ్రమలు, కేంద్ర కార్యాలయాలన్నీ హైదరాబాదు లోనే అభివృద్ధి చేశారు. రాష్ట్ర విభజనకు గల కారణాలలో అభివృద్ధి కేంద్రీకరణ కూడా ప్రధానమైంది. రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజధాని పేరుతో కేంద్రీకరణకు పూనుకున్నది. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూసమీకరణ, నవ నగరాల నిర్మాణ ఆలోచనలు, సింగ్‌పూర్‌ కంపెనీలతో స్టార్టప్‌ ఒప్పందం, స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతి, ప్రైవేటు సంస్థలకు భూముల కేటాయింపు మొదలైన చర్యలన్నీ కేంద్రీకరణలో భాగమే. విభజన చట్టంలో సెక్షన్‌ 94(3) పాలనా రాజధాని గురించి మాత్రమే పేర్కొన్నది.
13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో 7 జిల్లాలను విభజన చట్టం వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించింది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించి, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పేర్కొన్నది. ఇతర జిల్లాలలో కూడా అనేక ప్రాంతాలు వెనుకబడి వున్నాయి. ప్రకాశం, గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతం, తూర్పు గోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం, పశ్చిమ గోదావరి జిల్లాలో గిరిజన ప్రాంతం, కృష్ణా జిల్లాలో ఎ. కొండూరు, గంపల గూడెం వంటి ప్రాంతాలు వెనుకబడి వున్నాయి.
రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి జలవనరులు దోహద పడతాయి. గోదావరి నదీ జలాలతో రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయవచ్చు. విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం ‘హడావిడి’ ఎక్కువగా చేసింది. రూ.33 వేల కోట్లతో చేయవలసిన పునరావాస పనులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. నూతన ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు వివరించి, పునరావాసంతో సహా ప్రాజెక్టును పూర్తి చేయాలి. గోదావరి నదీ జలాలను కృష్ణానదికి తరలింపుపై నిపుణులతో, అఖిల పక్షాలతో చర్చించిన తరువాత నిర్ణయాలు చేయాలి. ఉత్తరాంధ్రాలో వంశధార, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులను పూర్తి చేయాలి. ప్రకాశం జిల్లాకు ప్రాణప్రదమైన వెలిగొండ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. నూతన ప్రభుత్వ బడ్జెట్‌లో జల వనరులకు రూ.13,139 కోట్లు కేటాయించారు. ఇవి గత బడ్జెట్‌ కేటాయింపుల కంటే తక్కువగా ఉన్నాయి. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ఒక సంవత్సరంలో పూర్తి చేస్తామని పేర్కొని బడ్జెట్‌లో కేవలం రూ.481 కోట్లు కేటాయించారు. రాయలసీమలో హంద్రీ-నీవా ప్రాజెక్టు, గాలేరు-నగరి, సుజల స్రవంతి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాలి.
13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్‌లో విశాఖపట్నం మినహా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు భారీ పరిశ్రమలు లేవు. పరిశ్రమలు లేకుండా ఉపాధి అవకాశాలు పెరగవు. విభజన చట్టంలో చెప్పిన విధంగా కడప ఉక్కు కర్మాగారం, దుగ్గరాజపట్నం/రామాయ పట్నం ఓడరేవు ప్రభుత్వ రంగంలో నిర్మాణం జరగాలి. ప్రకాశం, అనంతపురం, కర్నూలు మొదలైన జిల్లాలలో ప్రభుత్వ భూముల లభ్యత ఎక్కువగా ఉన్నది. ఉదాహరణకు ప్రకాశం జిల్లా దొనకొండలో 30 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిని ఆధారం చేసుకొని ప్రభుత్వ రంగ పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నించి వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పాలి. నీటి వనరుల ఆధారంగా వ్యవసాయం, వెనుకబాటుతనం ఆధారంగా పరిశ్రమలు స్థాపించినప్పుడే సమగ్ర అభివృద్ధి జరుగుతుంది.

సమ్మిళిత అభివృద్ధి
సమాజంలో అన్ని తరగతుల ప్రజలు, వివిధ సామాజిక వర్గాలు అభివృద్ధి చెందితే సమ్మిళిత అభివృద్ధి అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో 17 శాతం దళితులు, 6 శాతం గిరిజనులు, 9 శాతం మైనారిటీలు, 47 శాతం బి.సిలు ఉన్నారు. ఎస్‌.సి/ఎస్‌.టి సబ్‌ ప్లాన్‌ ఉన్నప్పటికి దళితులు, గిరిజనుల అభివృద్ధి ఆశించిన విధంగా లేదు. భూసమస్యలపై నియమించిన కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు జరగలేదు. భూ కేంద్రీకరణ కొనసాగుతూనే ఉన్నది. భూ పంపిణీ గురించి ప్రభుత్వాలు మాట్లాడడం లేదు. డెల్టా ప్రాంతాలలో దళితులకు కనీసం స్మశానాలు కూడా లేని ఎన్నో గ్రామాలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాలలో వైద్య సదుపాయాలు అందక కిలోమీటర్ల దూరం నడచి వెళుతున్నారు.
రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. గత ఐదేళ్లలో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, 2019 జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు 100 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో కౌలు రైతులే ఎక్కువ. 2011లో చేసిన కౌలు రైతుల రక్షణ చట్టం కౌలు రైతుల ప్రయోజనాలను కాపాడలేక పోయింది. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆమోదించిన నూతన కౌలు చట్టంలో కూడా కౌలు రైతులకు ఉపయోగపడే అంశాలు లేవు. భూయజమానులు కౌలు రైతులతో రాత పూర్వక ఒప్పందానికి సిద్ధంగా లేరు. రైతు భరోసా పథకం కూడా కౌలు రైతులకు ఉపయోగకరంగా లేదు.
దళితులు, గిరిజనులు మొదలగు సామాజిక వర్గాల అభివృద్ధి భూ సమస్యతో ముడిపడి ఉన్నది. ఎస్‌.సి/ఎస్‌.టి/బి.సి/మైనారిటీ తరగతుల ప్రజలు రాష్ట్ర జనాభాలో 80 శాతం మంది ఉన్నారు. ఈ సామాజిక తరగతుల అభివృద్ధి వారి జీవితాలను, జీవన ప్రమాణాలను సృజించే విధంగా జరిగినప్పుడే అది సమ్మిళిత అభివృద్ధి అవుతుంది.

సుస్థిర అభివృద్ధి
రాష్ట్రంలో సహజ వనరులను ఉపయోగించు కొని సుస్థిర అభివృద్ధి సాధించాలి. సహజ వనరులు దోపిడీ చేయడానికి అభివృద్ధి పేరుతో పర్యావరణ విధ్వంసానికి ప్రయత్నం జరుగుతున్నది. రాష్ట్రంలో కడప జిల్లాతో సహా అనేక ప్రాంతాలలో జరుగుతున్న యురేనియం తవ్వకాలు దీనికి ఒక ఉదాహరణ. ఉత్తరాంధ్రలో బాక్సైట్‌ గనులను దోపిడీ చేయడానికి జిందాల్‌ వంటి కంపెనీలు ప్రయత్నించాయి. ఇసుక మాఫియా ప్రకృతిని, నదులను నాశనం చేస్తున్నది. అటవీ ప్రాంతాన్ని విధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రంలో అటవీ ప్రాంతం 19 శాతం మాత్రమే ఉన్నది. పర్యావరణ సమతుల్యానికి 33 శాతం అడవులు అవసరం. ప్రకృతి వనరులను కాపాడుకొంటూ భావితరాలకు ఉపయోగపడే విధంగా సుస్థిర అభివృద్ధి కొనసాగించాలి.

మానవాభివృద్ధి
అమర్య్తసేన్‌ చెప్పినట్లు అభివృద్ధిలో మానవాభివృద్ధి ముఖ్యమైనది. మానవాభివృద్ధి సూచికలలో ఆంధ్రప్రదేశ్‌ బలహీనంగా ఉన్నది. జాతీయ స్థాయిలో 12వ స్థానంలో ఉన్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ అక్షరాస్యత సగటు 74 శాతం ఉంటే, ఎ.పిలో 67 శాతం మాత్రమే ఉన్నది. పాఠశాలలో డ్రాపౌట్స్‌ రేటు ఎక్కువగా ఉన్నది. 1వ తరగతిలో 100 మంది పిల్లలు చేరితే 10వ తరగతికి వచ్చే నాటికి 26 మంది బడి మానేస్తున్నారు. రాష్ట్రంలో విద్యారంగం పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ జరిగింది. విద్యారంగంలో రెండు సమాంతర వ్యవస్థలు కొనసాగుతున్నాయి. బడికి వెళ్లే 70 లక్షల మంది పిల్లలలో 38 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో, 32 లక్షల మంది ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ విద్యా రంగాన్ని పటిష్ట పరచాలి. ‘అమ్మ ఒడి’ వంటి పథకాలు విద్యా రంగంలో మౌలిక మార్పులకు దోహదపడవు. ఉన్నత విద్యారంగం, ఇంటర్‌ విద్యను మార్కెట్‌ శక్తుల నుంచి విముక్తి చేయాలి.
వైద్య, ఆరోగ్య రంగంలో రాష్ట్రంలో 1134 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 21 బోధన ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు పని చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులలో మౌలిక వసతులు, డాక్టర్ల కొరత సమస్యలు వున్నాయి. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ ప్రజలకు ఉపశమనం లేదు. ఆరోగ్యంపై నియమించిన సుజాతారావ్‌ కమిటీ సిఫార్సులను అధ్యయనం చేసి, ప్రభుత్వం ఆస్పత్రులను పటిష్ట పరచాలి.
రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి సాధించాలంటే వివిధ ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తూ, అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యత సాధించాలి. అభివృద్ధి 13 జిల్లాలకు వికేంద్రీకరణ జరగాలి. రాష్ట్ర అభివృద్ధిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలి. మేధావులను, అభ్యుదయవాదులను, ప్రగతిశీల శక్తులను, సామాజిక, ప్రజా సంఘాలను సమగ్రాభివృద్ధి సాధనలో కార్యోన్ముఖులను చేయాలి.

– కె.ఎస్‌ లక్ష్మణరావు 
(వ్యాసకర్త శాసనమండలి సభ్యులు )