మండలిలో అధికార పక్షానికి టీడీపీ షాక్‌
అనూహ్య అస్త్రంగా రూల్‌ 71 నోటీసు
రాజధాని మార్పు, సీఆర్డీయే రద్దుపై
సర్కారు విధానంపై మండలి అవిశ్వాసం
తీర్మానానికి పెద్దల సభలో ఆమోదం
రోజంతా శాసన మండలిలో ఉత్కంఠ
బిల్లులకు అనుమతిపై హైటెన్షన్‌
అవి ప్రవేశపెట్టడానికి సాయంత్రం ఓకే
ఆ వెంటనే టీడీపీ సెలెక్ట్‌ కమిటీఅస్త్రం
కమిటీకి పంపితే మూడు నెలలు ఆగాల్సిందే!
బిల్లుల్లో సవరణలకూ ప్రతిపాదనలు
మండలిలో నేడు తేలనున్న బిల్లుల భవితవ్యం

అమరావతి : మూడు రాజధానుల బిల్లుకు విపక్ష తెలుగుదేశం ‘తాత్కాలికంగా’ బ్రేకులు వేసింది. శాసన మండలిలో తనకున్న ఆధిక్యాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంది. సీఆర్డీయే రద్దు, ఆంధ్రప్రదేశ్‌ పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లులకు రూల్‌ 71తో అడ్డుకట్ట వేసింది. ‘‘రాజధాని మార్పు, సీఆర్డీయే రద్దుపై ప్రభుత్వ విధానాన్ని తిరస్కరిస్తున్నాం. ఈ అంశాలపై ప్రభుత్వ విధానం పట్ల అవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాం’’ అని మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. సోమవారం ఇవే బిల్లులను శాసనసభలో ప్రభుత్వం విజయవంతంగా ఆమోదించుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం మండలిలో ఏం జరుగుతుందన్న దానిపై తొలినుంచీ ఉత్కంఠ నెలకొంది. పెద్దల సభలో విపక్షాలకు అధికబలం ఉండటమే దీనికి కారణం. అంతా అనుకున్నట్లుగానే… మండలిలో ఉదయం నుంచీ హైడ్రామా నెలకొంది. ఎలాగైనా బిల్లు ఆమోదం పొందేలా చూసేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది.

ఏకంగా 14మంది మంత్రులు శాసన మండలికి వచ్చారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి గ్యాలరీలో కూర్చుని పరిస్థితి సమీక్షించారు. సభ ప్రారంభంలోనే టీడీపీ రూల్‌ 71 అస్త్రాన్ని ప్రయోగించింది. మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీయే రద్దుపై ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ రూల్‌ 71 కింద నోటీసు ఇచ్చింది. ‘‘ఈ ప్రభుత్వం నిర్ణయాలు చేయడంలో శాసన మండలిని పరిగణలోకి తీసుకోవడం లేదు. మంత్రి మండలి నిబంధనలకు విరుద్ధంగా విధానాలు రూపొందిస్తోంది. దీనిపై మా అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు రూల్‌ 71కింద చర్చ జరపాలి’’ అని మండలి చైర్మన్‌ ఎంఏ షరీ్‌ఫకు లేఖ ఇచ్చారు. అందుకు ఆయన అంగీకరించారు. ఇది అధికారపక్షానికి తొలి షాక్‌! ప్రభుత్వ బిల్లులపై ఆమోదం పొందడం సంగతి అటుంచితే… వాటి ప్రవేశానికి అనుమతి పొందేందుకే మంత్రులు, వైసీపీ వ్యూహకర్తలు విశ్వప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. బీజేపీ, పీడీఎస్‌ సభ్యులు కూడా జోక్యం చేసుకుని… బిల్లులను తీసుకోవాలని కోరారు.

‘‘ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బిల్లులపై కాలయాపన చేయడం తగదు. అందువల్లవాటిని ప్రవేశపెట్టడానికి అనుమతిస్తున్నాను’’ అని సాయంత్రం 6.21 గంటలకు ప్రకటించారు. దీంతో మంత్రులు బొత్స, బుగ్గన ఈ బిల్లులను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. దీనిపై టీడీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిసేపటికి… రూల్‌ 71పై చర్చ మొదలై వాడివేడిగా కొనసాగింది. రాత్రి 10.10 గంటల సమయంలో ఈ తీర్మానాన్ని మండలి ఆమోదించింది. దీనిపై విపక్షానికే విజయం దక్కింది.

తదుపరి అస్త్రం సెలెక్ట్‌
మంగళవారం ఉదయం 71 నిబంధనను తెరపైకి తెచ్చిన టీడీపీ… రాత్రి ‘సెలెక్ట్‌ కమిటీ’ వ్యూహాన్ని సంధించింది. మూడు రాజధానులు, సీఆర్డీయే బిల్లులపై చర్చ తర్వాత వీటిని సెలెక్ట్‌ కమిటీకి పంపాలంటూ మండలి చైర్మన్‌కు ఒక లేఖ అందించింది. మరో ప్రత్యామ్నాయంగా… బిల్లులకు సవరణలు కూడా ప్రతిపాదించారు. అమరావతి నుంచి సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు సంబంధించి 7, 8 సెక్షన్లు తొలగించాలని, సీఆర్డీయే చట్టం ఉపసంహరణ కుదరదని ఈ సవరణల్లో ప్రతిపాదిస్తున్నారు. అంటే… అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు కుదరదు. సవరణలతో వచ్చిన బిల్లులను అసెంబ్లీ చర్చించి, తిరస్కరించి మళ్లీ మండలికి పంపాల్సి ఉంటుంది. రెండోసారి కూడా మండలి తిప్పి పంపితే ఇక దాని పాత్ర ముగిసినట్టే. శాసనసభ ఏం ఆమోదిస్తే అదే చట్టం అవుతుంది.
సెలెక్ట్‌ కమిటీకి పంపితే…
టీడీపీ కోరినట్లుగా ఈ బిల్లులను సెలెక్ట్‌ కమిటీ పంపితే…మరింత లోతుగా ఈ బిల్లులను పరిశీలించి కమిటీ తన నిర్ణయం తెలపాల్సి ఉంటుంది. ఈ పరిశీలనకు మూడు నెలల వరకూ సమయం ఉంటుంది. అప్పటివరకూ ఈ బిల్లుల ఆమోదం నిలిచిపోతుంది. ఈ బిల్లులను ఆధారం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయలేదు. వెరసి…రాజధాని తరలింపుపై సర్కారు వేగానికి బ్రేకులుపడతాయని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. సెలెక్ట్‌ కమిటీకి పంపడంపై మండలిలో ఓటింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. టీడీపీకి మెజారిటీ ఉన్నందువల్ల ఆ పార్టీ ప్రతిపాదన నెగ్గడం ఖాయం.

(Courtesy Andhrajyothi)