• శాసన ప్రక్రియలోనే ఉంది
  • బడ్జెట్‌ ప్రసంగంలో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

అమరావతి: పరిపాలన వికేంద్రీకరణలో కీలకమైన 3 రాజధానుల ఏర్పాటు అంశం శాసన ప్రక్రియలోనే ఉందని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటాయని స్పష్టం చేశారు. బడ్జెట్‌ సమావేశాల తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి ఆన్‌లైన్‌లో ప్రసంగించిన ఆయన.. ప్రాథమిక పాలనలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ గొప్ప మార్పు తెచ్చిందని పేర్కొన్నారు. ‘ప్రపంచం మాంద్యంలో ఉన్నా.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన పురోగతి చూపింది. 2019-20లో 8.16% వృద్ధి రేటు నమోదు చేసింది. ఇదే కాలంలో జాతీయ సగటు 5% కంటే రాష్ట్ర వృద్ధిరేటు అధికం. సేవల రంగంలో 9.1% అత్యధిక వృద్ధి నమోదైంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8%, పారిశ్రామిక రంగంలో 5% వృద్ధి నమోదైంది. ప్రస్తుత ధరల ప్రకారం మన తలసరి ఆదాయం రూ.1,51,173 నుంచి.. రూ.1,69,519కు అంటే 12% పైగా పెరిగింది.’ అని అన్నారు.

Courtesy Eenadu