• సీఎం జగన్‌ విస్పష్ట నిర్ణయం
 • కేబినెట్‌ భేటీలో అదే మాట.. 
 • వ్యూహం అమలుకు ఒక పద్ధతి
 • జీఎన్‌రావు, బీసీజీ వైఖరి విస్పష్టం
 • హైపవర్‌ కమిటీ ఇక లాంఛనమే
 • అసెంబ్లీలో చర్చతో ఆమోదం
 • కేబినెట్‌లో జగన్‌ సుదీర్ఘ ప్రసంగం
 • రైతుల భూములు వెనక్కి
 • అభివృద్ధి చేసిన భూములు మినహా మిగిలినవన్నీ తిరిగి అప్పగించేద్దాం
 • రాజధాని ఎందుకు మారుస్తున్నామో వివరిద్దాం.. 
 • మంత్రివర్గ భేటీలో సీఎం
 • నిర్ణయం మాత్రమే వాయిదా పడింది! 
 • రాజధాని మార్పు దాదాపుగా ఖాయమైంది!

జీఎన్‌ రావు కమిటీ సిఫారసులు, బీసీజీ నివేదిక… వీటిపై హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామనడం ఒక వ్యూహమే అని తెలుస్తోంది. ఎందుకంటే… జీఎన్‌రావు కమిటీకి, ప్రభుత్వ ఆలోచనలకు భిన్నంగా బీసీజీ నివేదిక వెలువడే అవకాశం లేదు. ‘అమరావతి గ్రీన్‌ సిటీ సాధ్యం కాదు’ అనేలా బీసీజీ ఇప్పటికే తన మధ్యంతర నివేదికను ఇచ్చేసింది. హైపవర్‌ కమిటీ కూడా ఇదే చెప్పడం ఖాయమని… ఆ తర్వాత అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి… రాజధాని తరలింపుపై ‘తీర్మానం’ చేయడమే మిగులుతుందని తెలుస్తోంది. వెరసి… ‘మాది తొందరపాటు నిర్ణయం కాదు. అందరూ వద్దన్నాకే, అమరావతిని కొనసాగించడం సాధ్యంకాకే పరిపాలనను విశాఖకు తరలిస్తున్నాం’ అని చెప్పడమే రాష్ట్ర ప్రభుత్వం వ్యూహం! శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్‌ ఈ దిశగా తన ఆలోచనలను స్పష్టంగా పంచుకున్నట్లు సమాచారం! ఆయన మాటల్లో పూర్తిగా ‘విశాఖ వీచికలే’ కనిపించాయి.

జరిగేది ఇదేనా!?

 • జనవరి 3: ఇప్పటికే జీఎన్‌ రావు నేతృత్వంలోని కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. బోస్టన్‌ కన్సల్టెన్సీ జనవరి 3న నివేదిక ఇవ్వనుంది.
 • జనవరి 18: మంత్రులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో హైపవర్‌ కమిటీ 15 రోజుల్లో రెండు నివేదికలపై అధ్యయనం చేస్తుంది. అంటే జనవరి 18 నాటికి తన నివేదిక సమర్పిస్తుంది.
 • జనవరి 19: కేబినెట్‌ సమావేశంలో చర్చించి హైపవర్‌ కమిటీ నివేదికను ఆమోదిస్తారు.
 • జనవరి 20: అసెంబ్లీ ఉమ్మడి సమావేశం ఉదయం 9 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ జరుగుతుంది. రాజధాని నగరం తరలింపు నిర్ణయాన్ని ఆమోదిస్తారు.
కేబినెట్‌లో సీఎం వెల్లడి!
చంద్రబాబు తరహాలో ఏటా రూ.5,000 కోట్లు ఖర్చు చేస్తే.. దశాబ్దాలు గడచినా అభివృద్ధి చేయలేం. ప్రతి ఐదేళ్లకోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. కట్టిన భవనాలన్నీ కుంగిపోతుంటాయి. ‘విశాఖలో సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించి.. మెట్రో రైలును ఏర్పాటు చేస్తే హైదరాబాద్‌, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోటీ పడేవాళ్లం.’ ఇప్పటికే రాజధాని అభివృద్ధి కోసం వినియోగించుకున్న భూములకు బదులు వేరే చోట భూములిద్దాం. కౌలు చెల్లింపుల భారం తగ్గించుకోవాలంటే.. భూములు వెనక్కి ఇచ్చేయాల్సిందే.’

అమరావతి: రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి మార్చడం ఖాయమని ముఖ్యమంత్రి వైఎస్‌ స్పష్టమైన సంకేతాలు పంపించారు. జనవరి 20వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరిపి… తన నిర్ణయానికి ఆమోదం తీసుకోనున్నారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన కేబినెట్‌ భేటీలో రాజధాని నగరం మార్పు.. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, పంచాయతీ ఎన్నికలకు పాత విధానంలోనే రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చ జరిపారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సమావేశం ప్రారంభమైన వెంటనే.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సీఎంకు నివేదిక సమర్పించింది. దాదాపు 4,075 ఎకరాల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు ఆధారాలున్నాయని తెలిపింది. మరికొంత గడువు ఇచ్చి ఉంటే.. దాదాపు 10 వేల ఎకరాల సమాచారం సమర్పించేవాళ్లమని బుగ్గన తెలిపారు. ఈ సందర్భంగా రాజధానిని విశాఖకు తరలించాల్సిన అవసరంపై ముఖ్యమంత్రి 45 నిమిషాలు మాట్లాడారు.

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి క్యార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో చోటు చేసుకున్న అవినీతిపై అధ్యయనానికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఉపసంఘం శుక్రవారం ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో కలసి పాక్షిక నివేదికను జగన్‌కు సమర్పించింది.

అమరావతి ప్రాంత పరిధిలో తెల్లరేషన్‌ కార్డుదారులూ లక్షలు, కోట్లతో భూములు కొన్నారని తెలిపింది. 2014 జూన్‌ నుంచి నవంబరు నెలాఖరులోపు 4,075 ఎకరాల మేర రిజిస్ట్రేషన్‌ జరిగిందని.. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ స్థాయిలో క్కడ రిజిస్ట్రేషన్లు జరగలేదని పేర్కొన్నారు. నివేదికను బుగ్గన ఇంగ్లీషులో చదువుతున్నప్పుడు సీఎం కలుగజేసుకుని.. తెలుగులో చదువన్నా అని అన్నారు. దీంతో.. బుగ్గన తెలుగు పదాలను వెతుక్కుని చదువుతుంటే సహచర మంత్రులు ఒక్కసారిగా నవ్వారు. వారితో సీఎం కూడా జత కలిపారు.

తొందరపడొద్దంటూ…
తక్షణమే అసెంబ్లీని సమావేశపరచి.. విశాఖకు రాజధాని తరలింపును ఆమోదింపజేసుకుందామని పలువురు మంత్రులు సూచించారు. అయితే.. సీనియర్‌ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన, బొత్స సత్యనారాయణ, పినిపె విశ్వరూప్‌, పేర్ని వెంకట్రామయ్య (నాని) తదితరులు తొందరపాటువద్దన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటోందన్న ముద్ర పడకుండా చూసుకోవాలన్నారు. న్యాయపరమైన ప్రతిబంధకాలు ఎదురుకాకుండా.. అంతా సవ్యంగా జరిగేలా చూడాలని.. హైపవర్‌ కమిటీ వేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి ఏకీభవించారు. ‘3న బోస్టన్‌ నివేదిక వస్తుంది. వెంటనే మంత్రులు, సీనియర్‌ ఐఎఎ్‌సలతో హైపవర్‌ కమిటీ వేద్దాం. అధ్యయనానికి 15 రోజుల గడువిద్దాం. జనవరి 18న నివేదిక ఇస్తే.. 19న రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమోదిద్దాం. మర్నాడు అసెంబ్లీ ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం. విశాఖకు రాజధాని నగరాన్ని ఎందుకు మార్చాల్సి వస్తుందో ప్రజలకు వివరిద్దాం’ అని జగన్‌ చెప్పారు.
బడ్జెట్‌ భేటీ అక్కడే
రాజధాని తరలింపుపై ముఖ్యమంత్రి కేబినెట్‌ భేటీలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖలోనే సచివాలయం ఉంటుందని.. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు అక్కడే జరుగుతాయన్నారు. దీంతో ఇక అమరావతిలోని అసెంబ్లీ భవనం శీతాకాల సమావేశాలకే పరిమితమవుతుందా అని మంత్రులు సందేహం వెలిబుచ్చుతున్నారు. కాగా.. శాసనమండలిలో టీడీపీకి మెజారిటీ ఉన్న నేపథ్యంలో.. రాజధాని మార్పునకు వ్యతిరేకంగా ఓటేస్తుందని ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ నెల 17న అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బిల్లు, ఎస్సీ కార్పొరేషన్‌ ఏర్పాటు బిల్లులకు వ్యతిరేకంగా ఓటేసి సర్కారుకు టీడీపీ షాకిచ్చింది. ఈ పరిస్థితి రాజధాని మార్పు విషయంలో ఎదురుకాకుండా.. అసెంబ్లీలో వైసీపీకి 150 మంది (స్పీకర్‌ మినహా) ఎమ్మెల్యేలు ఉన్నందున రెండు సభల ఉమ్మడి సమావేశం ఏర్పాటుచేసి ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు.
ఎకరా అభివృద్ధికి 2 కోట్లని బాబే అన్నారు
‘ఎవరిపైనా కక్షతోనో.. కోపంతోనే రాజధానిని మార్చడం లేదు. రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయాలంటే ఎకరానికి రెండు కోట్లు ఖర్చవుతాయని చంద్రబాబే చెప్పారు. అంటే 53 వేల ఎకరాలకు రూ.లక్షా ఆరు వేల కోట్లు కావాలి. గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రూ.5,800 కోట్లు ఖర్చు చేసింది. చంద్రబాబు చెప్పినట్లుగా రాజధానిని అభివృద్ధి చేయాలంటే రూ.1,10,000 కోట్లు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అంత డబ్బును ఖర్చు చేయగలదా?’’ అని జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబు తరహాలోనే ఏటా రూ.5,000 కోట్లు ఖర్చు చేస్తే.. దశాబ్దాలు గడచినా అభివృద్ధి చేయలేం.

ప్రతి ఐదేళ్లకోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. కట్టిన భవనాలన్నీ కుంగిపోతుంటాయన్నారు. అమరావతిలో రోడ్లు నిర్మించాలంటే.. కిలోమీటరుకు రూ.42 కోట్ల వ్యయమవుతుందని… ఇంత ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. ‘‘అదే విశాఖలో రాజధానిని నిర్మించి ఉంటే.. పరిస్థితి ఈరోజు మరోలా ఉండేది. అక్కడ సచివాలయం, అసెంబ్లీ నిర్మించి.. మెట్రో రైలును ఏర్పాటు చేస్తే హైదరాబాద్‌, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోటీ పడేవాళ్లం. రూ.10 వేల కోట్లు ఖర్చుచేస్తే విశాఖ మహానగరంగా ప్రపంచంతోనే పోటీ పడుతుంది’’ అని వివరించారు. అమరావతి అభివృద్ధి మాత్రమే ప్రభుత్వ ప్రాధాన్యం కాదని స్పష్టం చేశారు.

‘‘జలయజ్ఞం కింద రూ.23 వేల కోట్లు వ్యయం చేయాలి. గోదావరి జలాలను బానకచర్ల ద్వారా రాయలసీమకు తీసుకెళ్లాలి. దీనికి రూ.65 వేల కోట్లు కావాలి. వాటర్‌ గ్రిడ్‌ కింద ఉపరితల జలాలను ప్రతి ఇంటికీ అందజేయాలి. రూ.40 వేల కోట్లకు పైగా ఖర్చవుతాయి. ఇంకోవైపు నవరత్నాల సంక్షేమ పథకాలు అమలు చేయాలి. బందరు పోర్టును అభివృద్ధి చేయాలి. అప్పుడే కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మన ప్రాధాన్యం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి. అందుకే రాజధానిని విశాఖకు తరలించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపారు.

రాజధాని రైతులతో మాటల్లేవ్‌!
ఆందోళనలు చేస్తున్న రాజధాని ప్రాంత రైతులతో సంప్రదింపులు జరపాలని గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి సూచించారు. దానిపై కృష్ణా జిల్లా మంత్రులు, సీఎం సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. రాజధాని పోతోందన్న ఆగ్రహంతో వారున్నారని.. చంద్రబాబు వారిని మోసం చేశారని.. వారితో ఏం సంప్రదింపులు జరుపుతామని అన్నట్లు సమాచారం. అలాగే… రాజధాని ప్రాంత రైతులు భూములు వెనక్కి ఇచ్చేయాలని కోరితే.. ఇప్పటి వరకూ ఉపయోగించని భూములను తిరిగి యథాతథంగా వారికి ఇచ్చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే రాజధాని నగర అభివృద్ధి కోసం వినియోగించుకున్న భూములకు బదులు వేరే చోట భూములు ఇద్దామన్నారు.

కౌలు చెల్లింపుల భారం తగ్గించుకోవాలంటే.. భూములు వెనక్కి ఇచ్చివేయాల్సిందేనని స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతంలో 20 వేల ఎకరాల అసైన్డ్‌ భూములు ఉన్నాయని.. వాటిని వాస్తవ లబ్ధిదారులకు అందజేద్దామని అన్నారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని పునరుద్ఘాటించారు. ఈ కుంభకోణంపై సీబీఐ లేదా ఏసీబీ/సీఐడీ లేదా లోకాయుక్తతో విచారణ జరిపించాల్సి ఉందని చెప్పారు. అయితే… న్యాయపరమైన అంశాలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని.. అందువల్ల ఎలాంటి లోపాలూ లేకుండా క్షుణ్ణంగా ఆయా అంశాలను పరిశీలించాల్సి ఉందని తెలిపారు.

29 గ్రామాల్లోనే ఆందోళనలు..
రాజధాని ప్రాంత రైతులు వారం రోజులుగా చేస్తున్న ఆందోళనలు కేబినెట్‌ సమావేశంలో చర్చకు వచ్చాయి. వారు తమకు న్యాయం చేయాలని కోరడం లేదని.. రాజధానిని తరలించవద్దని చెబుతున్నారని కొందరు మంత్రులు అన్నారు. మంత్రుల అభిప్రాయాలను సీఎం అడిగారు. రాజధాని తరలింపుపై కేవలం 29 గ్రామాల్లోనే ఆందోళనలు ఉన్నాయని.. వాటిని మరో గ్రామానికి విస్తరించకుండా చూడాలని మంత్రి కొడాలి నాని సూచించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసమే విశాఖలో సచివాలయం, అసెంబ్లీ నిర్మించాలన్న ఆలోచనకు సీఎం వచ్చారని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని అన్నారు. బొత్స జోక్యం చేసుకుని రాజధానిని మార్చడం లేదని.. పరిపాలనను విస్తరిస్తున్నామని చెప్పారు. అమరావతిని అభివృద్ధి చేస్తామని.. విద్యా నగరంగా రూపుదిద్దుతామని తెలిపారు.

(Courtesy Andhrajyothi)