‘నాకు ఊపిరాడట్లేదు’ అంటూ ఆరునిముషాల పాటు తీవ్ర మరణయాతన అనుభవించి చివరకు ఊపిరివదిలేశాడు ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జి ఫ్లాయిడ్‌. అతడి చేతులకు సంకెళ్ళువేసి, రోడ్డుమీద బోర్లా పడేసి, మెడను మోకాలుతో తొక్కిపెట్టి ఉంచిన ఆ తెల్లజాతి పోలీసు అధికారి మొఖంలో ఆ అహంకారాన్ని గమనించారా? తన మోకాలి కింద ఉన్న ఆ పీకను నలిపేస్తూ ఎనిమిదిన్నర నిముషాలపాటు అతడు ప్యాంటు జేబుల్లోంచి చేతులు బయటకు తీయలేదు. ‘అతనికి ఊపిరాడటం లేదు, చచ్చిపోయేట్టున్నాడు, కాలు కాస్త పక్కకు జరపండి’ అని చుట్టూ చేరినవారు మొత్తుకుంటున్నా వీసమెత్తు కదల్లేదు. ఎనిమిదిన్నర నిమిషాల వీడియోలో ఆరోనిముషం నుంచి ఫ్లాయిడ్‌లో కదలికలు ఆగిపోయాయి. ప్రాణం పోయిందని అందరికీ అర్థమైపోయింది. ఆ తరువాత ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం ఏముంటుంది? విడియోలో ఈ అమానవీయమైన దృశ్యాన్ని చూసిన మనకే మనసు ద్రవించిపోతుంటే, అమెరికాలో ఉంటూ నిత్యమూ జాత్యహంకారాన్ని అనుభవిస్తున్న లక్షలాదిమంది ఆఫ్రికన్‌ అమెరికన్ల గుండెలు రగిలిపోవా?

అమెరికా అగ్నిగుండమై మండుతున్నది. చాలా నగరాల్లో కర్ఫ్యూ విధించినా, నిరసనకారులు వీధుల్లో వెల్లువెత్తున్నారు. వాహనాలు, దుకా ణాలు, భవనాలు తగలబడుతున్నాయి. దుకాణాలు లూటీ అవుతున్నాయి. ఆస్తుల విధ్వంసం అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతున్నది. కర్ఫ్యూలు, ఎమర్జెన్సీలు పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేకపోతున్నాయి. నిప్పు కొత్త ప్రాంతాలకు రాష్ట్రాలకు విస్తరిస్తున్నది. ఇంతకూ ఫ్లాయిడ్ చేసిన తప్పు ఏమిటి? తెల్లజాతివారు జాతివివక్షతో సామూహిక హత్యాకాండలకు పాల్పడుతున్నట్టుగా ఏమైనా మానవహననానికి ఒడిగట్టాడా? దొంగతనాలు, దోపిడీలకు పాల్పడి, పోలీసులపై ఎదురు కాల్పులు జరిపాడా? సిగరెట్‌ ప్యాకెట్‌ కొనడానికి అతడు ఇచ్చిన 20డాలర్ల నోటు నకిలీదేమోనని దుకాణదారుకు అనుమానం వచ్చిందంతే. పోలీసులు వచ్చారు, కాస్తంత పెనుగులాట జరి గాక సంకెళ్ళు వేశారు, ఆ తరువాత పోలీసు వాహనంలోకి ఎక్కించేముందు యావత్‌ ప్రపంచమూ చూసిన ఈ భయానకమైన దృశ్యం సంభవించింది. ‘ఊపిరాడటం లేదు కాలు తియ్యండి ప్లీజ్‌ ప్లీజ్‌’ అని వేడు కొంటున్నా తొక్కిచంపేసిన ఆ పోలీసు అధికారికి ఏ శిక్షవేస్తే సరిపోతుంది?

కరోనా దెబ్బతో ఉపాధి కోల్పోయిన లక్షలాదిమందిలో ఫ్లాయిడ్‌ ఒకరు. ఈ పరిణామానికి ఆయనేమీ రగిలిపోలేదు, తన కడుపుకొట్టిన తెల్లసమాజంమీద పగపెంచుకోలేదు. పొట్టగడవడం కోసం ఓ చిన్న ఉద్యోగం చూసిపెట్టమని ముందు రోజే మిత్రుడిని కోరాడు తప్ప తప్పుడుపనులకు దిగజారలేదు. వ్యవస్థమీద ఆయనకు ఉన్న ఈ నమ్మకం ఆయన చావు కళ్ళారా చూసిన తరువాత మిగతావారిలో ఎందుకు ఉంటుంది? వైట్‌హౌస్‌ వరకూ తగిలిన సెగలో అధ్యక్షభవనం పక్కనే ఉన్న భవనాలు సైతం దాడులకు గురైనాయి. పోలీసులు చావ గొడుతున్నా ఆందోళనకారులు వైట్‌హౌస్‌ ముందు మంటలు పెట్టారు, రాళ్ళతో దాడిచేశారు. డొనాల్డ్‌ ట్రంప్‌ బంకర్‌లో దాక్కోవలసి వచ్చిదంటే అందుకు నిరసనకారులను నిందించి ప్రయోజనం లేదు. శవాల మీద పేలాలు ఏరుకోవడంలోనూ, సంక్షోభాలను ఓట్లుగా మార్చుకోవడంలోనూ ట్రంప్‌ దిట్ట. దేశం మండిపోతున్న స్థితిలో ఆయన వ్యాఖ్యలు, ట్వీట్లు అగ్గికి ఆజ్యం పోశాయి.

కంచె దాటివచ్చినవారికి భయంకరమైన కుక్కలు, అత్యాధునిక మారణాయుధాలతో గట్టిగా జవాబు ఇస్తానని ఆయన నిరసనకారులను బెదిరించారు. వారిని థగ్గులుగా అభివర్ణిస్తూ, ‘లూటింగ్‌ లీడ్స్‌ టు షూటింగ్‌’ అన్న ఓ గతకాలపు శ్వేతజాత్యాహంకార వ్యాఖ్యను వెదికి తెచ్చి మరీ పోస్టు చేశారు. 1967లో ఓ తెల్ల పోలీసు అధికారి నల్లజాతివారిపై దాదాపు యుద్ధానికి ఉపక్రమిస్తూ వాడిన మాటలివి. అందుకే, గత నాలుగు దశాబ్దాలుగా ఎన్నడూ చూడనంత ఆఫ్రికన్‌ అమెరికన్ల ఆగ్రహాన్ని అమెరికా ఇప్పుడు చవిచూస్తున్నది. ఇటువంటి అనేక వ్యాఖ్యలతో ట్రంప్‌ నిరసనకారులను మరింత రెచ్చగొడుతూండటంతో పరిస్థితులు అదుపుతప్పిపోతున్నాయి. విషాన్ని చిమ్మడం, విద్వేషాలు రేపడం ట్రంప్‌కు తెలిసినవిద్య. శాంతివచనాలతో, హామీలతో నిరసనలను చల్లార్చే ఉద్దేశం ఆయనకు లేదు. నిరసనకారుల మీదకు ఓ ట్యాంకర్‌ దూసుకువచ్చిన సంఘటనల వంటివి ట్రంప్‌కు కావాలి. సమాజం ఎంత చీలితే ఆయనకు అంత ప్రయోజనం. కరోనాను కంట్రోల్‌ చేయలేక చేతులు ఎత్తేసిన ఈ పెద్దమనిషి రేపు ఎన్నికల్లో నెగ్గుకురావాలంటే ఆఫ్రికన్‌ అమెరికన్లపై సమాజంలో ద్వేషం మరింత హెచ్చాలి. మెక్సికన్లమీదా, ముస్లింలమీదా విషం చిమ్ముతూ వచ్చిన ట్రంప్‌ ఎన్నికల ముందు జరిగిన ఈ హింసను శ్వేతజాతి ఓట్లు తనకు గుండుగుత్తగా పడేందుకు వీలుగా మలుచుకుంటున్నారు.

Courtesy Andhrajyothy