– తబ్రేజ్‌ అన్సారీ కేసులో వైద్యుల నివేదిక
పాట్నా : జార్ఖండ్‌లో మూకదాడి ఘటనలో హత్యకు గురైన తబ్రేజ్‌ అన్సారీ (24) తీవ్ర గాయాలతో గుండెపోటుకు గురై మరణించాడని జంషెడ్‌పూర్‌లోని ఓ వైద్య కళాశాలకు చెందిన వైద్యులు ధ్రువీకరించారు. వివిధ విభాగాలకు చెందిన ఐదుగురు అధిపతుల మెడికో లీగల్‌ నివేదిక అసలు విషయాన్ని బయటపెట్టింది. ‘బలమైన ఆయుధంతో కొట్టటంతో తీవ్రగాయంతోపాటు ఎముక విరిగింది. అలాగే లేత అవయవాలు దెబ్బతిన్నాయి. గుండె కవాటాల్లో రక్తం నిలిచిపోయింది. ఫలితంగా గుండెపోటు వచ్చింది’ అని ఐదుగురు వైద్యులు సంతకం చేసిన పత్రం పేర్కొంది. అన్సారీ మృతికి మూలకారణం తీవ్రగాయాలే అని నివేదిక చెప్పకనే చెబుతున్నది. అయితే.. గుండెపోటుతో మరణించాడని పోస్ట్‌మార్టం నివేదికలో పేర్కొన్నారంటూ అన్సారీపై దాడి చేసిన 11 మందిపై హత్యాభియోగాలను జార్ఖండ్‌ పోలీసులు తొలగించారు. గుండెపోటుకు దారితీసిన కారణాలైన కొట్టటం, తీవ్ర గాయాలు, గుండె నిండా రక్తం చేరి గుండె ఆగిపోవటాన్ని జార్ఖండ్‌ పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు. ‘గుండెపోటుకు గాయాలు కూడా ఒక కారణం’ అని అన్సారీ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్య బృందంలో ఒకరైన డాక్టర్‌ బి మర్డి చెప్పారు. అతనిపై విషప్రయోగం జరిగినట్టు పోస్టుమార్టం నివేదికలో బయటపడలేదన్నారు. జార్ఖండ్‌లోని సెరైకెలా ఖర్సావన్‌లో అన్సారీని జూన్‌ 18న తీవ్రంగా కొట్టిన ఘటన సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయింది. ‘జై శ్రీ రామ్‌’ నినాదాలు చేయాలని చితకబాదారు. తీవ్రగాయాలైన అన్సారీ నాలుగురోజుల తర్వాత ఆస్పత్రిలో మరణించిన విషయం తెలిసిందే. ‘హత్యాభియోగాల నమోదుకు సరైన ఆధారాలను మెడికల్‌ రిపోర్టు ఇవ్వలేదు. అందువల్ల మేం ఆ అభియోగాలను తొలగించాం’ అని జార్ఖండ్‌ సీనియర్‌ పోలీసు అధికారి ఎస్‌ కార్తిక్‌ అన్నారు. అన్సారీ తల పూర్తిగా దెబ్బతిన్నట్టు అతని కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదుల గురించి అధికారిని ప్రశ్నించగా.. వైద్య నివేదిక ప్రకారం మాత్రమే మేం నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారనీ, దీనిపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని బాధితుడి భార్య డిమాండ్‌చేస్తున్నారు.

Courtesy Nava telangana..