* కడపలో అతి పెద్ద యురేనియం ప్లాంటు
* వడివడిగా కేంద్రం అడుగులు
*
పెదవి విప్పని రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కడపలో ఏర్పాటు చేయాల్సిన ఉక్కు పరిశ్రమకు మొండిచేయి చూపిస్తున్న కేంద్రం అదే సమయంలో ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే యురేనియం తవ్వకాలను మాత్రం విచ్చలవిడిగా చేపడుతోంది. తాజాగా దేశంలోనే అతిపెద్ద యురేనియం ప్లాంటును కడప జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ జిల్లాలోని కన్నంపల్లి వద్ద రోజుకు ఆరు వేల టన్నుల యురేనియంను వెలికితీయడానికి కేంద్రం శరవేగంగా కసరత్తు చేస్తోంది.
ఆరువేల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రణాళిక కూడా ఖరారైంది. కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో రేడియో ధార్మిక పదార్థాల తవ్వకాలకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదంటూ కేంద్ర పర్యావరణ అటవీశాఖ సహాయ మంత్రి బాబుల్‌ సుప్రియో ప్రకటన చేసిన రోజే వెలుగులోకి రావడం గమనార్హం, ఒకవైపు మంత్రి లోక్‌సభలో ప్రకటన చేస్తుండగా దాదాపు అదే సమయంలో యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యుసిఐఎల్‌) అధికారులు కడపలో అతి పెద్ద ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు ఒక మీడియా ప్రతినిధితో చెప్పారు. ప్రస్తుతం రోజుకు 3వేల టన్నుల యురేనియం ఉత్పత్తి సామర్ధ్యంతో జార్ఖండ్‌లోని తురాంది గనులున్నాయని, కడప జిల్లాలోనే ఉన్న తుమ్మలపల్లి గనులకు కూడా దాదాపుగా అంతే సామర్ధ్యం ఉందని, అయితే, కన్నంపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న ప్లాంటు ఈ రెంటిని మించిపోతుందని వారు వివరించారు. దీనికి సంబంధించి పర్యావరణ అనుమతులు పొందడానికి, గ్రామసభలు నిర్వహిం చడానికి ప్రణాళికను కూడా యుసిఐఎల్‌ సిద్ధం చేసుకుంది. జనవరి నుండి ఈ దిశలో కార్యాచరణను చేపట్టనుంది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీస స్పందన లేకపోవడం గమనార్హం. యుసిఐఎల్‌ తాజా ప్రణాళికను గురించి కడప జిల్లా కలెక్టర్‌ సి.హరికిరణన్‌ను ప్రజాశక్తి వివరణ కోరగా అధికారికంగా తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. ప్లాంటు ఏర్పాటు చేయదలుచుకుంటే భూమి, పర్యావరణ అనుమతుల కోసం తమను సంప్రదించాల్సిఉంటుందని, ఇప్పటివరకు అటువంటి ప్రక్రియ ప్రారంభం కాలేదని ఆయన చెప్పారు.

ఆరు నెలల్లో అనుమతులు
కన్నంపల్లి వద్ద చేపట్టనున్న యురేనియం తవ్వకాలకు గరిష్టంగా ఆరునెలల కాలంలో పూర్తిస్థాయిలో అనుమతులు వచ్చే అవకాశం ఉందని యుసిఐఎల్‌ అధికా రులు చెబుతున్నారు. గనికి సంబంధించిన సరిహద్దులు గుర్తించే ప్రక్రియ కూడా ప్రారంభమైందని, సాధ్యమైనంత త్వరలోనే అనుమతుల కోసం పర్యావరణ మంత్రిత్వశాఖకు, కాలుష్య నియంత్రణ మండలికి దరఖాస్తు చేసుకుంటామని వివరిం చారు. డిసెంబరు లేదా జనవరి నెలలో ఈ ప్రక్రియ జరిగే అవకాశం ఉంది.’ ఆటమిక్‌ మినరల్‌ డైరక్టరేట్‌ భూ లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలను చూస్తోంది. ఆ ప్రక్రియను వారు పూర్తి చేసి గని ప్రదేశాన్ని మాకు అప్పగిస్తారు’ అని యుసిఐఎల్‌ అధికారులు తెలిపారు. ఆరునెలల కాలంలో భూమి తమ చేతికొస్తుందని, ఆ తరువాత అతి తక్కువ సమమయంలోనే ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభిస్తామని వారు అంటున్నా రు.ఈ మొత్తం ప్రక్రియను ప్రధానమంత్రి కార్యాలయమే పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది.

తుమ్మల్లపల్లి  సామర్ధ్యం పెంపు!
తుమ్మలపల్లి ప్లాంటు సామర్ధ్యాన్ని కూడా పెంచాలని యుసిఐఎల్‌ భావిస్తోంది. ప్రస్తుతమున్న 3వేల టన్నుల సామర్ధ్యాన్ని రోజుకు 4,500 టన్నులకు విస్తరించడానికి ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధమైనాయి. దీనికి సంబంధించి ఫిబ్రవరి నెలలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారని సమాచారం. అయితే, తుమ్మలపల్లికి బిన్నంగా కన్నంపల్ల్లిలో పూర్తిస్థాయి భూగర్భ గనినే ఏర్పాటు చేయాలని యుసిఐఎల్‌ భావిస్తున్నట్లు తెలిసింది.

Courtesy prajasakthi