బాధితురాలి తండ్రి మరణానికి కారకుడిగా తేల్చిన కోర్టు
ఇప్పటికే ఆ జన్మాంతం ఖైదు అనుభవిస్తున్న శెంగార్‌

న్యూఢిల్లీ 13: ఉన్నావ్‌ అత్యాచార దోషి, బీజేపీ బహిష్కృత ఎమ్మె ల్యే కుల్‌దీప్‌ శెంగార్‌కు ఢిల్లీలోని ఓ కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించింది. పోలీసు కస్టడీలో ఉన్నపుడు బాధితురాలి తండ్రిని కొట్టి ఆయన మరణానికి కారణమైనందుకు ఆయనకు, ఆయన సోదరుడు అతుల్‌ శెంగార్‌కు, మరో ఆరుగురికి కూడా పదేళ్ల జైలు, పది లక్షల జరిమానా విధించింది.  మైనారిటీ తీరని బాలికను దారుణంగా రేప్‌ చేసి చంపేసిన నేరంపై శెంగార్‌ ఇప్పటికే జీవనకాల(చనిపోయేదాకా) జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ‘చంపాలన్న ఉద్దేశం ఉండకపోవచ్చు. కానీ బాధితురాలి తండ్రిని కొట్టి చంపడం వల్ల అది శిక్షార్హమైన హత్యేనని(కల్పబుల్‌ హోమిసైడ్‌) కోర్టు భావిస్తోంది. ఐపీసీ 304 కింద ఆ నేరానికి ఉన్న గరిష్ఠ శిక్ష పదేళ్ల ఖైదు విధిస్తున్నాం’ అని డిస్ట్రిక్ట్‌ కోర్టు జడ్జి ధర్మేశ్‌ శర్మ తన తీర్పులో పేర్కొన్నారు. ‘‘ఆమె తండ్రిని ఎలాగైనా ఆయుధాల కేసులో ఇరికిద్దామని కుట్రపన్నారు. స్టేషన్‌కు లాక్కొచ్చి లాక్‌పలో పెట్టి తీవ్రంగా కొట్టారు. చావు బతుకుల్లో ఉన్న ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తీసికెళితే డాక్టర్లు చాలా నిర్లక్ష్యంగా, కసాయివారిలా వ్యవహరించారు. ఇది దారుణం’’ అని జడ్జి ఘాటుగా విమర్శలు గుప్పించారు. జుడీషియల్‌ కస్టడీలో ఉన్నపుడు గాయపడి వచ్చిన వ్యక్తికి సరైన చికిత్స అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా యూపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నట్లు కూడా తీర్పులో పేర్కొన్నారు.

Courtesy Andhrajyothi