సీఏఏ-ఎన్నార్సీలపై ఆందోళనలు విస్తృతం

చార్మినార్‌/హైదరాబాద్‌ సిటీ: సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లు రాజ్యాంగ విరుద్ధమనీ, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ పాతబస్తీలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఇప్పటివరకు మెరుపు నిరసనలు, ఆందోళనలతో సాగిన కార్యక్రమాలకు మహిళలు కూడా భారీ సంఖ్యలో మద్దతు పలుకుతున్నారు. విద్యార్థులు, నేతలు, వివిధ సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, వ్యాపారులకు తోడుగా గృహిణులు కూడా జతయ్యారు. ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌ మహిళలు కొనసాగిస్తున్న నిరసన కార్యక్రమాలను ప్రేరణగా తీసుకుని పాతబస్తీ మహిళలు కూడా రోడ్డుపై నిరసనలు ప్రారంభించారు. గురువారం రాత్రి నుంచి మొగల్‌పురాలో ప్రత్యేక షామియానా వేసి ఆందోళనలు ప్రారంభించారు. కేంద్రం కక్షగట్టి మైనారిటీలను టార్గెట్‌ చేసిందని… రాజ్యాంగ విరుద్ధ చట్టాలు తెచ్చి ఇబ్బందులకు గురి చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

పోలీసులు మహిళల నిరసనను భగ్నం చేయడానికి ప్రయత్నించారు. దీంతో స్థానిక నేతలు, యువకులు అక్కడికి చేరి మహిళల నిరసనకు మద్దతు ప్రకటించారు. ఇదిలావుండగా, మొగల్‌పురాలో రాత్రి జరిగిన నిరసన కార్యక్రమాలతో అప్రమత్తమైన పోలీసులు శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో మక్కా మసీదు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రామగుండం పోలీసు కమిషనర్‌ వి.సత్యనారాయణను రప్పించి చార్మినార్‌ వద్ద బందోబస్తు బాధ్యతలు అప్పగించారు. నమాజ్‌ పూర్తి కావడంతో బయటకు వచ్చిన యువకులు సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెళ్లారు.

Courtesy Andhrajyothi