• కిడ్నాప్‌ చేసి ఇంజక్షన్‌ ఇచ్చి సామూహిక అత్యాచారం
  • బాధితురాలి వెన్నెముక, కాళ్లు విరిచేసిన దుండగులు
  • ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి..గుట్టుగా అంత్యక్రియలు

బల్‌రామ్‌పూర్‌ : ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం జరిగింది. హాథ్రస్‌ హత్యాచార ఘటన మరవక ముందే అలాంటి ఘటనే గురువారం వెలుగులోకి వచ్చింది. బల్‌రామ్‌పూర్‌ జిల్లాలోని గైన్సారీ గ్రామానికి చెందిన మహిళపై మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెపై దాడిచేసి గాయపరిచారు. తీవ్ర గాయాలతో బాధితురాలు చనిపోయారు. మంగళవారం ఈ దారుణం జరిగింది. బీకామ్‌ రెండో సంవత్సరం చదువుతున్న ఆమె (22) ఫీజు చెల్లించేందుకు కాలేజీకి వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా దుండగులు ఆమెను అపహరించి కారులో తీసుకెళ్లారు. ఆమెకు ఇంజక్షన్‌ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు.  ఆమె వెన్నెముక, కాళ్లు విరగ్గొట్టారు.  బాధితురాలు  అపస్మారక స్థితిలో ఓ రిక్షాలో  ఇంటికి చేరుకున్నారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. ‘‘నాకు చాలా నొప్పిగా ఉంది. నేను బతకను’’ అని తన కూతురు చెప్పిందని, అవే ఆమె చివరి మాటలని మృతురాలి తల్లి పేర్కొన్నారు. ఈ ఘటనలో షహీద్‌, సాహిల్‌ అనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే హాథ్రస్‌ తరహాలోనే మృతురాలి అంత్యక్రియలను పోలీసులు హడావుడిగా నిర్వహించారు. రాత్రి 8.30 గంటలకు ఆమె చనిపోగా. 10.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. గైన్సారీ గ్రామంలోని ఓ కిరాణ దుకాణంలో ఆమె అత్యాచారానికి గురయ్యారని, దుకాణం యజమానే ఈ నేరానికి సూత్రధారి అని పోలీసులు తెలిపారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోనే బులంద్‌షహర్‌, ఆజంగఢ్‌లో ఇద్దరు బాలికలు అత్యాచారానికి గురయ్యారు. ఆజంగఢ్‌లో ఎనిమిదేళ్ల బాలికపై దానిష్‌ అనే పొరుగు వ్యక్తి అత్యాచారం చేశాడు. బులంద్‌షహర్‌లోని కాకోరే గ్రామంలో ఓ బాలికపై రిజ్వాన్‌ అనే పొరుగువాడు అత్యాచారం చేశాడు.

మధ్యప్రదేశ్‌లోనూ దారుణం
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనే జిల్లాలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది. మంచినీరు కావాలంటూ బుధవారం రాత్రి ఓ ఇంట్లోకి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు బాలికను సమీపంలోని పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి పారిపోయారు.

Courtesy Andhrajyothi