గిరిజనుడిని కొట్టిచంపిన గోరక్షకులు
మరో ఇద్దరికి తీవ్రగాయాలు
గోవధకు పాల్పడ్డారన్న అనుమానంతో దారుణం
రాంచీ : దేశం యావత్తునూ విస్మయానికి గురిచేసిన తబ్రేజ్‌ అన్సారీని కొట్టి చంపిన ఘటన మరువకముందే.. బీజేపీ పాలిత రాష్ట్రంలో జార్ఖండ్‌లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గోవధకు పాల్పడ్డారన్న అనుమానంతో వికలాంగుడైన గిరిజన యువకుడిని గోరక్షకులు కొట్టిచంపారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గిరిజనులకు తీవ్రగాయాలయ్యాయి. కుంతి జిల్లా జల్టండ్‌ సౌరీలో ఆదివారం ఈ ఘటన జరగ్గా పోలీసులు ధ్రువీకరించారు. గోవధకు పాల్పడ్డారంటూ పుకార్లు వ్యాప్తిచెందగా.. గోరక్షకులు కలంతుస్‌ బర్ల, ఫిలిప్‌ హౌరొ, పాగు కచ్‌చాప్‌లను మూకలు చితకబాదారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు సమీపంలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (రిమ్స్‌)కు తరలించారు. కాగా ఆస్పత్రికి తీసుకెళుతుండగానే కలంతున్‌ బర్ల మృతిచెందాడు. మిగిలిన ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ‘ఈ ఘటనకు సంబంధించి అయిదుగురిని అదుపులోకి తీసుకున్నాం. దాడి ఘటనలో వారి ప్రమేయమున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఘటనా స్థలం, చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీ చేశాం. జంతువు కళేబరం ఏదీ మాకు దొరకలేదు’ అని పోలీసు ఉన్నతాధికారి అమోల్‌ వేనుకట్‌ హౌంకర్‌ చెప్పారు. ఇదే రాష్ట్రంలో జూన్‌ 17న ముస్లిం యువకుడు తబ్రేజ్‌ అన్సారీని చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. దేశంలో జరుగుతున్న మూకదాడి ఘటనల్లో జార్ఖండ్‌ అగ్రస్థానంలో వున్నది. పశువులను రవాణా చేస్తున్నారనీ, బీఫ్‌ తింటున్నారనీ, పిల్లలను ఎత్తుకు పోయేవారిగా అనుమానించి… ఇలా పలు కారణాలతో అమాయకులను కొట్టి చంపుతున్నారు.
జార్ఖండ్‌లో క్షీణించిన శాంతిభద్రతలు : బృందాకరత్‌
రాంచీ : జార్ఖండ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రం మూకదాడులకు కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితులకు కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో పెచ్చరిల్లిపోతున్న మూకదాడులపై ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. మూకదాడులు జరిగిన సమయాల్లో ప్రభుత్వం బాధితుల తరపున కాకుండా నేరస్తులకు అండగా ఉంటోందని విమర్శించారు. దేశంలోనే ఇటువంటి దాడులకు జార్ఖండ్‌ కేంద్రంగా ఉందని అన్నారు. ఏ హిందువు కూడా జాతీయ పౌరసత్వ నమోదు(ఎన్‌ఆర్‌సీ) నుంచి తొలగింపబడరని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ మత ప్రాదిపదికన దేశాన్ని విభజించడమే బీజేపీి-ఆర్‌ఎస్‌ఎస్‌ల లక్ష్యమని విమర్శించారు. అమెరికాలో భారత ప్రధాని పాల్గొన్న ‘హౌడీ మోడీ’ కార్యక్రమంపై మాట్లాడుతూ’ ఈ కార్యక్రమం వలన దేశానికి ఏం వస్తుంది.? ఇంతకుముందు తొలగించిన వాణిజ్య ప్రత్యేక హోదా(జీఎస్‌పీ)ని ఏమైనా తిరిగి తీసుకువస్తారా’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమెరికా కేంద్రంగా భారత్‌ తన విదేశాంగ విధానాన్ని రూపొందిస్తే అది ఖచ్చితంగా దేశానికి నష్టం చేకూరుస్తుందని అన్నారు.

Courtesy Nava telangana…