– మూడు రోజులుగా ఆహారం లేక మహిళ మృతి
రాంచీ : జార్ఖండ్‌ ఆకలి మంటలతో అల్లాడుతున్నది. ఖనిజ సంపద కడుపులో దాచుకున్న ఈ రాష్ట్రంలో బుక్కెడు అన్నం లేక పేదలు ప్రాణాలు విడుస్తున్నారు. రేషన్‌కార్డుతో ఆధార్‌ను అనుసంధానించలేదని సరుకులు అందక మరణించిన దుర్ఘటనలు చోటుచేసుకున్న ఈ రాష్ట్రంలో తాజాగా అసలు రేషన్‌ కార్డే లేక ఆకలితో విల విల్లాడి ఓ మహిళ(48) మరణించింది. ఈ ఘటన గిరిది జిల్లాలోని చిరుది గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబం వివరాల ప్రకారం.. సావిత్రి- తురి దంపతులకు తినేందుకు ఆహారం లేదు, సరుకులు కొనేందుకు డబ్బులు లేవు. పక్కా ఇల్లు లేదని ఉన్న రేషన్‌కార్డు(అంత్యోదయ కార్డు)ను రద్దు చేశారు, కొత్తది జారీ చేయలేదు. వికలాంగుడైన తురి ఆహారం కోసం హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లలో
పాత్రలు శుభ్రం చేశారు. కానీ, గతవారం నుంచీ ఏ పనీ దొరక్కపోవడంతో ఇంట్లో తినేందుకు ఆహారం కరువైంది. సావిత్రి మూడు రోజులుగా ఖాళీ కడుపుతో అలమటించింది. మంగళవారం పని కోసం బయట తిరిగి తిరిగి ఖాళీ చేతులతో ఇంటికి చేరిన తురికి.. ఆకలి కాటుకు బలైన తన భార్య కనిపించింది. ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదనీ, కేవలం ఆకలితోనే మరణించిందని తురి కన్నీండ్లు పెట్టుకున్నారు.
మూడేండ్లలో 23 ఆకలి చావులు
జార్ఖండ్‌లో గతమూడేండ్ల కాలంలో 23 మంది ఆకలితో అలమటించి ప్రాణాలొదిలారు. ఇలా మరణించినవారిలో చాలా మంది రేషన్‌ సరుకులకు దూరమైనవారే. ఆధార్‌ కార్డు లేదనీ, ఉన్నా.. రేషన్‌ కార్డుతో లింక్‌ చేయలేదని వారికి సరుకులు ఇవ్వలేదు. కానీ, తాజా ఘటనలో సావిత్రి కుటుంబానికున్న అంత్యోదయ కార్డు ఏ కారణం తెలు పకుండానే రద్దు చేశారు. కొత్తకార్డు జారీ చేయలేదు. దరఖాస్తును బ్లాక్‌ సప్లై అధికారి రాజీవ్‌ రంజన్‌కు అందించినప్పటికీ ఇంకా జారీ కాలేదని తురి బోరుమన్నారు. దీనిపై బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ అధికారి స్పందిస్తూ.. రేషన్‌ కార్డు జారీ చేయకపోవడం తీవ్రమైన అంశమే.. దానిపై విచారణ జరుపుతామని అన్నారు. చాలా ఆకలి చావుల కేసుల్లాగే.. సావిత్రి మృతదేహానికీ పోస్టుమార్టం చేయలేదు. అధికారంలో ఉన్న బీజేపీ నేతలు ఈ ఆకలి చావులను ఎంతమాత్రం ఖాతరు చేయడం లేదు.

Couretsy NavaTelangana..