బాధితురాలు ఉరి వేసుకుని ఆత్మహత్య

చిత్రకూట్‌ : ఉత్తరప్రదేశ్‌లోని హథ్రా్‌సలో జరిగిన ఘోరం మరువకముందే రాష్ట్రంలోని చిత్రకూట్‌ జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఒక దళిత బాలిక(15)పై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ అవమానభారంతో బాలిక ఉరి వేసుకుని తనువు చాలించింది. స్థానిక మాణిక్‌పూర్‌ ప్రాంతంలో మంగళవారం ఈ దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కిషన్‌ ఉపాధ్యాయ్‌, ఆశిశ్‌, సతీష్‌ అనే ముగ్గురు కలిసి ఈ నెల 8న బాలికపై దారుణానికి పాల్పడ్డారని మృతురాలి తండ్రి ఆరోపించారు.

తన కూతురిని కాళ్లు చేతులు కట్టేసి అత్యాచారం చేసి నిందితులు పరారయ్యారని తెలిపారు. తమ బిడ్డను ఇంటికి చేర్చిన పోలీసులు, ఫిర్యాదు మాత్రం నమోదు చేయలేదని.. ఆ ఆవేదనతోనే తమ బిడ్డ ప్రాణం తీసుకుందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఇద్దరు పోలీసులను విధుల నుంచి తప్పించింది. కార్వీ పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ జైశంకర్‌ సింగ్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌ సాహూ తమ విధినిర్వహణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని జిల్లా ఎస్పీ అంకిత్‌ మిట్టల్‌ వెల్లడించారు. ఇక.. పోస్టుమార్టమ్‌ నివేదికలో అత్యాచారం రుజువు కాలేదని, మరింత స్పష్టత కోసం నమూనాలను ఫోరెన్సిక్‌ విభాగానికి పంపనున్నామని ఆయన స్పష్టం చేశారు. దారుణానికి ఒడిగట్టిన ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నామని అంకిత్‌ తెలిపారు.

Courtesy Andhrajyothi