కొండూరి వీరయ్య

– కొండూరి వీరయ్య

రాఫెల్‌ యుద్ధ విమానాలు తయారీ కాంట్రాక్టు మోడీ ప్రభుత్వం అనిల్‌ అంబానీకి అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు ఫ్రాన్స్‌ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) భాగస్వామ్యంతో రాఫెల్‌ యుద్ధ విమానాల తయారీకి రంగం సిద్ధమైంది. ఇంతలో 2014 ఎన్నికలూ మోడీ గెలవటం జరిగిపోయింది. చడీచప్పుడు కాకుండా యుద్ధ విమానాల తయారీలో ఏ మాత్రం ప్రవేశంలేని అనిల్‌ అంబానీ కంపెనీకి కాంట్రాక్టు ఖాయం చేస్తూ మోడీ నిర్ణయించారు. ఆ సందర్భంగా వాయుసేన, రక్షణా, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు వెల్లడించిన అభ్యంతరాలను సైతం మోడీ ప్రభుత్వం కప్పిపెట్టింది. ఇటువంటి భారీ కాంట్రాక్టులు అప్పగించేటప్పుడు పాటించాల్సిన ప్రమాణాలు, పారదర్శకత లేవనీ, ధర నిర్ణయంలో గోప్యత ఉందనీ, మొత్తంగా కాంట్రాక్టు విధి విధానాలే మారిపోయాయని, పెద్ద కుంభకోణం దాగి ఉందనీ మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా, సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీబీఐకి కూడా ఫిర్యాదు చేశారు.
దీనిపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక దాఖలు సమయంలో అర్థరాత్రి కుట్రతో సీబీఐ డైరెక్టర్‌ను పదవి నుంచి దించేసింది కేంద్ర ప్రభుత్వం. ఓ దశలో సుప్రీంకోర్టు సదరు చర్చలు, లావాదేవీకి సంబంధించి పూర్తి పత్రాలు కోర్టుకు అందచేయాలని కోరగా రక్షణశాఖ నుంచి సదరు పత్రాలు దొంగిలించబడ్డాయని అటార్నీ జనరల్‌ కోర్టుకు నివేదించారు. ఇదేమీ సుపారి ఒప్పందం కాదు కదా నోటిమాట మీద జరిగిపోవటానికి… ఇటువంటి ఒప్పందాలు రెండు కాపీలు ఉంటాయి. ఒకటి కాంట్రాక్టు ఇచ్చే వాళ్ల వద్దా రెండోది కాంట్రాక్టు తీసుకునే వారివద్దా. అందువల్ల ఫ్రెంచి ప్రభుత్వం వద్ద, రాఫెల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో ఉన్న కాపీలు తెప్పించమని సుప్రీం ఆదేశించింది. ఈ ఆదేశం వచ్చిన వారం రోజులకు విచిత్రంగా పారిస్‌లోని ప్రభుత్వ కార్యాలయంలో రాత్రిపూట దొంగలు గోడకు కన్నం వేసిమరీ పత్రాలు దొంగిలించారు. ఇదంతా పాత కథే అంటారా.. ఇప్పుడు కొత్త కథ చూద్దాం.

రాఫెల్‌ యుద్ధ విమానాలు తయారు చేయాల్సిన అనిల్‌ అంబానీ వద్ద చిల్లిగవ్వ కూడా లేదట. స్వయంగా లండన్‌ కోర్టులో అనిల్‌ అంబానీ తరఫు న్యాయవాది సమర్పించిన వాంగ్మూలమిదీ.. అనిల్‌ అంబానీ వ్యక్తిగత పూచీకత్తు మీద మూడు చైనా బ్యాంకుల వద్ద 6,475 కోట్లు అప్పు తీసుకున్నారు. ఈ మొత్తం వసూలు చేయటానికి చైనా బ్యాంకులు చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమవటంతో లండన్‌ కోర్టును చైనా బ్యాంకులు ఆశ్రయించాయి. చివరకు లండన్‌ కోర్టులో కేసు పెట్టారు. కోర్టులో తన వాదనలు వినిపిస్తూ ఉన్న ఆస్తులు అప్పులు లెక్క కడితే చిల్లిగవ్వ కూడా లేదని అనిల్‌ అంబానీ న్యాయవాది కోర్టుకి నివేదించాడు. వాదోపవాదాలు తర్వాత లండన్‌ కోర్టు న్యాయమూర్తి డేవిడ్‌ వాక్స్‌మన్‌ ముందు రూ.వెయ్యి కోట్లు డిపాజిట్‌ చేయమని ఆదేశించాడు. ఇటువంటి ఆదేశం అనిల్‌ అంబానీ కేసును నిర్వీర్యం చేస్తుందని, భవిష్యత్తులో ఈ వ్యాజ్యంలో ఆయన గెలుపును ప్రభావితం చేస్తుందని అనిల్‌ అంబానీ న్యాయవాది అభ్యంతరాలు వ్యక్తం చేసినా కోర్టు ఒప్పుకోలేదు. అపర కుబేరుల్లో ఒకడైన ముఖేష్‌ అంబానీ సోదరుడు అనిల్‌ అంబానీ అన్నది ప్రపంచానికి తెలిసిందే.

అందుకే న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ ”ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబానికి సంబంధించిన కేసు విచారణ ఇది. అనిల్‌ అంబానీ అన్నిరకాలుగా దుకాణం కట్టేశాడు, దివాళా తీశాడు అంటే నమ్మశక్యంగా లేదు.” అని వ్యాఖ్యానించాడు. లండన్‌ కోర్టులో అనిల్‌ అంబానీ తరఫు న్యాయవాది తీసుకున్న వైఖరి పూర్తిగా అవకాశవాదంతో కూడుకున్నదనీ, కేవలం చైనా బ్యాంకులకు డబ్బు ఎగవేసే దురుద్దేశ్యంతోనే తీసుకున్నదని చైనా పారిశ్రామిక వాణిజ్యబ్యాంకు న్యాయవాది బంకిం థాంకి నిరసన వ్యక్తం చేశాడు. ఓ ప్రకటన విడుదల చేసిన ఈ బ్యాంకు లండన్‌ కోర్టు ఆదేశాలు పాటించి ముందుగా వెయ్యి కోట్లు కోర్టులో డిపాజిట్‌ చేస్తారని ఆశిస్తున్నట్టు తెలిసింది.

మళ్లీ రాఫెల్‌ వివాదానికొద్దాం. కాంట్రాక్టు విలువ 59వేల కోట్లు. ఇందులో 25,450 కోట్లు దస్సాల్ట్‌ కంపెనీ దేశీయ భాగస్వామి కంపెనీలో పెట్టుబడులు పెట్టాలి. అంటే కేంద్ర ప్రభుత్వం ఫ్రాన్స్‌ కంపెనీకి చెల్లించే 59 వేల కోట్లల్లో సగం సొమ్ము దేశీయ భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా అనిల్‌ అంబానీ కంపెనీకి చేరుతుంది. ఈ సొమ్ముతో అంబానీ స్థాపించిన రిలయన్స్‌ డిఫెన్స్‌ యుద్ధ విమానాలు తయారు చేయాలి. ఇదే సొమ్ము హెచ్‌ఏఎల్‌ వచ్చేలా కేంద్రం ఒప్పందం చేసుకుంటే ఆ కంపెనీ లాభాల్లో ఉండేది. ఇందుకు భిన్నంగా గుట్టుచప్పుడు కాకుండా మోడీ సర్కార్‌ మరో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థకు ప్రాణం పోయాల్సిన ప్రజలసొమ్ము ఓ దివాళా తీసిన ప్రయివేటు కంపెనీని నిలబెట్టటానికి ఖర్చు చేయాలని నిర్ణయించింది.
దస్సాల్ట్‌ కంపెనీ నుంచి దాదాపు 25వేల కోట్లు అందుకున్న తర్వాత కూడా ఈ నిధులు దారి మళ్లింపు జరగదన్న గ్యారంటీ లేదు. 2019సంవత్సరానికి పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే సారాంశంగా చెప్పాలంటే ప్రభుత్వరంగం పాత్ర తగ్గించి అన్ని రంగాల్లో ప్రయివేటు కంపెనీల ఆధిపత్యం పెంచాలి. దీని కోసం వచ్చిన సిద్ధాంతమే లెవెల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ అన్న సంస్కరణల సూత్రం. అంటే ప్రభుత్వ కాంట్రాక్టులు, లాభాలు దండుకోవటంలో ప్రభుత్వ కంపెనీలతో పాటు ప్రయివేటు కంపెనీలకు సమాన అవకాశాలు ఇవ్వాలన్న సూత్రం. ఈ పేరుతో దివాళా తీసిన ప్రయివేటు కంపెనీలను బతికించటానికి ప్రభుత్వరంగ కంపెనీలను దివాళా తీయించటం ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక సంస్కరణల మూలసూత్రాలు. ఇప్పటికే సరిహద్దుల్లోని సైన్యానికి చలినుంచి కాపాడుకునేందుకు కావల్సిన వస్తువులు కూడా ప్రభుత్వం సమకూర్చలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో దివాళా తీసిన కంపెనీకి భారత వాయుసేన రక్షణ భారం అప్పగిస్తే ఏమవుతుందో అన్న ఆందోళన దేశభక్తులకు ఉంది. కానీ కార్పొరేట్‌ భక్తులకు లేనందునే ఇలాంటి కుంభకోణాలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. ప్రజలదృష్టి మళ్లించటానికి రామమందిరమో, పౌరసత్వమో, ఉగ్రవాదమో ఉండనే ఉన్నాయి కదా..

Courtesy Nava Telangana