చిన్నారులకు పొంచిఉన్న అంటువ్యాధులు
లాక్‌డౌన్‌తో మూతపడ్డ అంగన్‌వాడీ కేంద్రాలు
భయాందోళనల్లో పేద బతుకులు

కోవిడ్‌..19 కారణంగా దేశంలో తొలిసారిగా అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. మహమ్మారి కమ్మేస్తున్న ఢిల్లీ, ముంబయి వంటి నగరాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ అంగన్‌వాడీ కేంద్రాలు ఇప్పట్లో తెరిచే ఆనవాళ్ళు కానరావటంలేదు. దీంతో వెనుకబడినవర్గాలు, పేద పిల్లలు పోషకాహార లోపం బారినపడటమేకాదు, అంటు వ్యాధుల బారిపడే ప్రమాదం పొంచిఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా మార్చి 24న విధించిన లాక్‌డౌన్‌కు ముందు రోజు వరకూ ముంబయిలోని ట్రోంబే మురికివాడలోని ఓ అంగన్‌వాడీ కేంద్రానికి రోజుకు కనీసం 100 మంది వరకూ పిల్లలు వచ్చేవారు. అదే ప్రాంతంలోని ఓ ఇరుకైన ఇంట్లో కేంద్రం నడుస్తున్నప్పటికీ.. ఆరేండ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు వేడి భోజనం, ఇతర రేషన్‌ను అందించేందుకు అంగన్‌వాడీ వర్కర్‌ కాంబ్లే ప్రయత్నించేవారు. వారి ఎత్తు, బరువు క్రమం తప్పకుండా కొలవటం, టీకాలను షెడ్యూల్‌ చేయటతోపాటు, ప్రీ స్కూల్‌ టీచర్‌గా విధులను ఆమె నిర్వహించేవారు.

లాక్‌డౌన్‌ మొదలైంది… అంగన్‌వాడీలు మూతపడ్డాయి. కాంబ్లే, ఆమె సహాయకురాలు ‘ఇంటి నుంచే పని’ చేస్తున్నారు. అంటే పిల్లల తల్లిదండ్రులకు క్రమం తప్పకుండా ఫోన్‌ చేయటం మినహా.. ఏ చర్యా ముందుకు సాగటంలేదు. వలస కుటుంబాలు తమ సొంతూర్లకు తిరిగి వెళ్ళటంతో మురికివాడలో సగం ఖాళీ అయ్యింది. మిగిలిన వారికి రేషన్‌ అందించాలనుకున్న ఆమె ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది. పిల్లలకు ‘టేక్‌ హోమ్‌ రేషన్‌’ అందించాల్సి ఉన్నప్పటికీ… తమ ప్రాంతంలోని ఒక్క అంగన్‌వాడీ కేంద్రానికి కూడా సరుకులు రాలేదని కాంబ్లే తెలిపారు. పిల్లలకు రేషన్‌ అందకపోవటం ఒకటైతే… చాలా మంది పిల్లలకు టీకాలు వేయించాల్సి ఉందనీ, అది కూడా జరగటంలేదని ఆమె వాపోయారు. ‘మూడు నెలలుగా పిల్లలకు రేషన్‌ లేదు. వారికి వ్యాక్సినూ అందటంలేదు. మా మురికివాడలో పోషకాహార లోపంపై పోరాటానికి మేం చాలా కష్టపడ్డాం. ఇవ్పుడు అదంతా మళ్ళీ మొదటికొస్తున్నది’ అని ఆమె తెలిపారు. దేశంలోని అతిపెద్ద కోవిడ్‌-19 హాట్‌స్పాట్‌గా మారిన ముంబయిలోని వేలాది మంది అంగన్‌వాడీ కార్మికుల్లో ఇదే ఆందోళన నెలకొన్నది. పలు రాష్ట్రాల్లోనూ అంగన్‌వాడీల పరిస్థితి కూడా ఇలానే ఉన్నదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఆ లోపాన్ని నివారించేందుకే…
చిన్నారుల్లో పోషకాహారలోపాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ స్కీమ్‌ కింద 45 ఏండ్ల క్రితం ఈ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించింది. కాగా, పోషకార సమస్యలాగే ఈ కేంద్రాల చుట్టూ అనేక సమస్యలు అల్లుకుపోయాయి. ప్రధానంగా సరిపడా నిధుల కొరత, రేషన్‌ కేటాయింపుల్లో అవినీతి, మహిళల శ్రమకు తగిన ఫలితం అందించకపోవటం వంటి సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి.

సందిగ్ధంలో టీకా
తమ ప్రాంతంలో గర్భిణీ మహిళల నుంచి.. డెలివరీ వరకూ రికార్డులు నిర్వహించటం అంగన్‌వాడీల పనిలో ప్రధానమైనది. దీంతోపాటు.. పుట్టన ప్రతి బిడ్డకు రోగనిరోధక టీకాల షెడ్యూల్‌ను రూపొందించటం, వారికి సమయానికి టీకాలు వేయించేలా చూడటం. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌తో ముంబయిలో మూడు నెలలుగా ఈ పని నిలిచిపోయింది. జూన్‌లో కొన్ని ప్రాంతాల్లోని క్లీనిక్‌లలో టీకాల పని ప్రారంభమైనప్పటికీ అది నామమాత్రమే. ట్రోంబేలోని కాంబ్లే, థానేలోని నిర్మలా బొన్సాలే లాంటి అంగన్‌వాడీ కార్యకర్తలు టీకాలు వేయించాలని బిడ్డల తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి గుర్తుచేస్తున్నారు. కానీ, తల్లిదండ్రులు పిల్లలను తీసుకొని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. నర్సులను పిల్లల ఇంటికి తీసుకెళ్ళి టీకాలు వేయించేందుకు ప్రయత్నించామనీ, కానీ వారు కోవిడ్‌ కేసులతో చాలా బిజీగా ఉంటున్నారనీ అంగన్‌వాడీ కార్యకర్త నిర్మలా బొన్సాలే తెలిపారు.

జాతీయ ఆరోగ్య మిషన్‌ ఏప్రిల్‌లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో దాదాపు లక్ష మంది పిల్లలకు మార్చిలో వేయాల్సిన క్షయవాదికి సంబంధించిన బీసీజీ టాకా వేయలేదు. కనీసం రెండు లక్షల మందికిపైగా పిల్లలకు పెంటావాలెంట్‌, రోటావైరస్‌ వ్యాక్సిన్లు అందలేదు. రోగనిరోధకశక్తిని పెంచే మెనింజైటిస్‌, ఇతర వ్యాధులకు సంబంధించిన ఏ వ్యాక్సిన్లూ పిల్లలకు వేయలేదు.

ఇండ్లకు చేర్చాల్సిన రేషన్‌ సైతం అంగన్‌వాడీ కేంద్రాలకు రావటంలేదని ఏఆర్‌ సింధు వాపోయారు. ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌వంటి రాష్ట్రాల్లో రేషన్‌ పూర్తిగా నిలిచిపోయింది. ఇది పిల్లల్లో పోషకాహార లోపానికి దారితీస్తుందని తెలిపారు. చిన్న పిల్లలకు టీకాలు వేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించాలనీ, కేరళ తరహాలో ఇంటింటికీ రేషన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి..
‘గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. లాక్‌డౌన్‌ సమయంలో టీకా ప్రయత్నాలు పూర్తిగా ఆగిపోయాయి. అంగన్‌వాడీలు కోవిడ్‌-19 పనిలో నిమగమవుతున్నారు. అనేకప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను క్వారంటైన్‌ కేంద్రాలుగా వాడుతున్నారు అని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏఆర్‌ సింధు చెప్పారు. దీంతో తమ పిల్లలను కేంద్రాలకు తీసుకెళ్ళడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారని అన్నారు. నగరాల నుంచి గ్రామాలకు తరలివెళ్ళటంతో టీకా రికార్డులను నమోదు చేయటం కూడా కష్టమవుతున్నదని ఆమె తెలిపారు.

Courtesy Nava Telangana