అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలతో క్వారంటైన్‌లో ఉన్నవారికి ప్రభుత్వం పౌష్టికాహారం అందజేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సహకారంతో బాధితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు మంచి ఆహారాన్ని పెడుతోంది. కృష్ణా జిల్లాలో మొత్తం 18 క్వారంటైన్‌ సెంటర్లు ఉండగా, 16 కేంద్రాల్లో 450 మంది ఉన్నారు. వీరికి ప్రతిరోజు షెడ్యూల్‌ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దుస్తులు, రుమాళ్లు, దుప్పట్లు, పేస్టు, బ్రష్‌, సబ్బులతో పాటు 15 రకాల వస్తువులతో కూడిన కిట్లను అందజేశారు. అన్నం, కూర, పప్పు, సాంబారు, చారు, పెరుగుతో కూడిన భోజనం పెడుతున్నారు. దీంతో పాటు ఖర్జూరం, జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, అరటిపండు, కొబ్బరినీళ్లు అందిస్తున్నారు. క్వారంటైన్‌ సెంటర్ల పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

ఏపీలో 348 పాజిటివ్‌ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 348 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 7,155 మందికి పరీక్షలు చేశామని, 1750 మందిని క్వారంటైన్‌లో ఉంచినట్టు వెల్లడించింది. కోవిడ్‌-19 వ్యాప్తి చెందకుండా అమలు చేస్తున్న ఆంక్షలతో కొత్త కేసులు తగ్గుతున్నాయని పేర్కొంది. కర్నూలులో 75, గుంటూరు 49, నెల్లూరు 48, కృష్ణా 35, కడప 28, ప్రకాశం 27, పశ్చిమగోదావరి 22, చిత్తూరు, విశాఖపట్నంలలో 20, అనంతపురం 13, తూర్పుగోదావరి 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కరోనా కేసులు లేవు. ఇప్పటివరకు కోవిడ్‌ బారిన పడి 9 మంది కోలుకున్నట్టు ఏపీ వైద్యారోగ్య శాఖ తెలిపింది.