• టీఎ్‌సపీఎ్‌ససీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి
  • అరుణ్‌సాగర్‌ పురస్కారం అందుకున్న ఆంధ్రజ్యోతిఎడిటర్‌

హైదరాబాద్‌: ‘దేశవ్యాప్తంగా కలాన్ని స్వతంత్రంగా వాడుకున్న సంపాదకులు ఎవరైనా ఉన్నారంటే అది ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులు కె.శ్రీనివాస్‌ ఒక్కరే. గ్రూప్‌ 1, 2 వంటి పోటీ పరీక్షల ఇంటర్య్వూల్లో అభ్యర్థులు తాము కె.శ్రీనివాస్‌ సంపాదకీయాలు చదువుతామని చెప్పారు’ అని టీఎ్‌సపీఎ్‌ససీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి అన్నారు. అరుణ్‌సాగర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కె.శ్రీనివాస్‌కు విశిష్ట పాత్రికేయ, కవి ప్రసేన్‌కు విశిష్ట సాహిత్య పురస్కారాలు ప్రదానం చేశారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, బీసీ కమిషన్‌ సభ్యులు జూలూరు గౌరీశంకర్‌, ప్రముఖ కవులు దేవీప్రియ, కె.శివారెడ్డి, టీవీ5 ఎండీ బీఆర్‌ నాయుడు పురస్కారంతో పాటు చెక్కును అందించి ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథి గంటా చక్రపాణి మాట్లాడుతూ.. ‘కె.శ్రీనివాస్‌ నుంచే అరుణ్‌సాగర్‌ రచనా స్ఫూర్తి పొందారు. ఎవరినైనా మార్చే శక్తి ఆయనకు ఉంది’ అన్నారు. అక్షరమై పెరిగినవాడు అరుణ్‌ అని, అతడికి కె.శ్రీనివాస్‌ గురువని అల్లం నారాయణ పేర్కొన్నారు. ప్రసేన్‌ విలక్షణ వ్యక్తి అని వక్తలు కొనియాడారు.

అరుణ్‌సాగర్‌ ఉంటే బాగుండేది : కె.శ్రీనివాస్‌
‘అరుణ్‌ సాగర్‌ ఉంటే బాగుండేది.. ఉన్నాడని కూడా అనిపిస్తోంది. మాది గురుశిష్య బంధం కాదు. తన నుంచి చాలా నేర్చుకున్నా. ప్రస్తుతం పెద్దవాటికి కాదు.. చిన్నవాటికి స్పందిస్తేనే ఏమీ రాయడానికి వీల్లేనంత దుర్మార్గాలు జరిగిపోతున్నాయి. పత్రికల్లో ఫ్యూచర్‌ జర్నలిజం మొదటిసారి ప్రయత్నించింది ‘ఆంధ్రజ్యోతి’. లైఫ్‌స్టైల్‌ జర్నలిజం అరుణ్‌ ఆలోచనే. జర్నలిస్ట్‌ నుంచి సాహిత్యకారుడిగా ఎదిగిన వ్యక్తి ఆయన. ఈ అవార్డు అరుణ్‌ ఇస్తున్నట్లుగానే ఉంది’ అని కె.శ్రీనివాస్‌ అన్నారు.

(Courtesy Andhrajyothi)