• తెలుగు ప్రజల పట్ల కేంద్రం వివక్ష
  • టర్నోవర్‌ తక్కువైనా యథాతథంగా మహారాష్ట్ర బ్యాంక్‌ 

ఆంధ్రుల బ్యాంక్‌గా పిలవబడే ఆంధ్రాబ్యాంకు ఇకపై కనుమరుగుకానుంది. కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలపైన వివక్ష చూపుతున్నందునే ఆంధ్రాబ్యాంకును విలీనం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రా బ్యాంకు కంటే తక్కువ టర్నోవర్‌ ఉండే మహారాష్ట్ర బ్యాంకును కొనసాగిస్తూ ఆంధ్రుల బ్యాంకుగా పిలువబడే బ్యాంకు విలీనానికి పూనుకోవడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. కేంద్రప్రభుత్వం ఉత్తరాదికో న్యాయం, మనకో న్యాయంలాగా వ్యవహరిస్తోందనే వాదన వినబడుతోంది. తెలుగువారి కోసం ఏర్పాటు చేసిన బ్యాంకుగా ఆంధ్రా బ్యాంకుకు ఓ చరిత్ర ఉంది. భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నం ప్రధాన కేంద్రంగా బ్యాంకును ఏర్పాటుచేశారు. 1923 నవంబర్‌ 20న లక్ష రూపాయల మూల ధనం, రూ.10 లక్షల అధీకృత మూల ధనంతో బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించింది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1980లో ఈ బ్యాంకును జాతీయం చేశారు. జాతీయం చేసినప్పుడు ఆంధ్రాబ్యాంకుకు 974 పూర్తి స్థాయి శాఖలు, 40 క్లస్టర్‌ శాఖలు, 76 ఎక్సెటెన్షన్‌ కౌంటర్లు ఉండేవి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3798 ఎటిఎంలను కలిగి ఉన్న ఆంధ్రాబ్యాంకు ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగంలో కీలక బ్యాంకుగా ఎదిగింది. హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఆంధ్రాబ్యాంకు లోగోలో పెద్ద ఇన్ఫినిÛటీ (అనంతర) చిహ్నం ఉంటుంది. వినియోగదారుల కోసం ఏ పని చేయడానికైనా, ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధమనే సందేశాన్ని ఇది సూచిస్తుంది. అలా అంచెలంచెలుగా ఎదిగిన ఆంధ్రా బ్యాంకు ప్రస్తుతానికి 2,904 శాఖలతో 21,740 మంది ఉద్యోగులతో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సాతో దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తృతస్థాయిలో తన సేవలను అందిస్తోంది. అనేక ప్రాముఖ్యతలను సంతరించుకుని 96 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆంధ్రాబ్యాంకు యూనియన్‌ బ్యాంకులో విలీనం చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని తెలుగు ప్రజలు, ఉద్యోగులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. మహారాష్ట్ర కేంద్రంగా కొనసాగుతున్న బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఆంధ్రా బ్యాంకు కంటే టర్నోవర్‌లో తక్కువే. ఆ బ్యాంకును విలీనం చేయాలనే ఆలోచన చేయని కేంద్రం దాని కంటే ఎన్నో రెట్లు పెద్దదైనా ఆంధ్రా బ్యాంకును విలీనం చేస్తామని ప్రకటించడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. తొలుత ఆంధ్రాబ్యాంకులో ఇతర బ్యాంకులను విలీనం చేసి ఆంధ్రాబ్యాంకు పేరును కొనసాగిస్తారని ఆశించినా కేంద్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. యాంకర్‌ బ్యాంకుగా యూనియన్‌ బ్యాంకే వ్యవహరిస్తుందని ప్రకటించింది. దీంతో ఇకపై ఆంధ్రాబ్యాంకు పేరు కనుమరుగు కానుంది. రాష్ట్రంలో ప్రస్తుతం లీడ్‌ బ్యాంకుగా ఆంధ్రాబ్యాంకు వ్యవహరిస్తుండటంతో ప్రజలకు ఎంతో కొంత న్యాయం జరిగేది. విలీనం ప్రకియ పూర్తయితే భవిష్యత్తులో లీడ్‌ బ్యాంకు పాత్ర ఎవరు పోషిస్తారనే అంశంపై ప్రజల్లో చర్చ నడుస్తోంది.

(COURTECY NAVA TELANGANA)