హైదరాబాద్‌ : దేశంలో పురాతన బ్యాంకుల్లో ఒకటైన ఆంధ్రా బ్యాంకు ప్రస్థానం ముగిసింది. ఏప్రిల్‌ 1 నుంచి ఆంధ్రా బ్యాంకు కనుమరుగు అయింది. ప్రభుత్వ రంగంలోని పది బ్యాంకుల భారీ విలీనం ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి రావడంతో ఆంధ్రా బ్యాంకుతో పాటు ఆరు బ్యాంకులు ప్రస్థానం ముగిసిపోయింది. సుమారు 96 సంవత్సరాల పాటు ఖాతాదారులకు సేవలందించిన ఆంధ్రా బ్యాంకు ప్రస్థానం 2020 మార్చి 31తో ముగిసినట్టయింది. దేశవ్యాప్తంగా కోవిడ్‌ 19 వ్యాప్తిని నివారించేందుకు చేసేందుకు లాక్‌డౌన్‌ అమలవుతున్నప్పటికీ విలీన ప్రక్రియను షెడ్యూల్‌ ప్రకారమే మోదీ సర్కారు అమలు చేస్తుండటం గమనార్హం. ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విలీన ప్రక్రియకు ఆటంకాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తుండగా.. అలాంటిదేమి ఉండబోదని యాంకర్‌ బ్యాంకుల చీఫ్‌లు పేర్కొంటున్నారు.

చిన్న బ్యాంకులన్నింటినీ కలిపేసి పెద్ద బ్యాంకులుగా చేస్తే అంతర్జాతీయ స్థాయిలో పోటీపడతాయన్న ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం 2009 ఆగస్టులో 10 బ్యాంక్‌ల విలీనాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)లో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విలీనమవుతాయి. ఫలితంగా ఎస్‌బీఐ తర్వాత రెండో అతిపెద్ద బ్యాంక్‌గా పీఎన్‌బీ అవతరించనుంది. సిండికేట్‌ బ్యాంక్‌లో కెనరా బ్యాంకు విలీనం అవుతుంది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు కలిసిపోతాయి. ఇండియన్‌ బ్యాంకులో అలహాబాద్‌ బ్యాంకు విలీనమవుతుంది. 2017 నాటికి దేశంలో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా.. ప్రస్తుతం 18 బ్యాంకులుగా ఉన్నాయి. తాజా విలీనంతో ఏప్రిల్‌ 1 నుంచి 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే ఉండనున్నాయి.

ఆంధ్రాబ్యాంక్‌ ప్రస్థానం ఇది
స్వాతంత్య్ర సమరయోథుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923 నవంబర్‌ 20న మచిలీపట్నంలో స్థాపించిన ఆంధ్రాబ్యాంక్‌తో తెలుగు వారికి ప్రత్యేక అనుబంధం ఉంది. 1980లో ఈ బ్యాంకుని జాతీయం చేశారు. 1981లో క్రెడిట్ కార్డులను జారీ చేయుటం ద్వారా భారత దేశానికి క్రెడిట్ కార్డు వ్యవస్థను ఈ బ్యాంకు పరిచయం చేసింది. 2003 నాటికి నూరు శాతం కంప్యూటరీకరణ సాధించింది. 2007లో బయోమెట్రిక్ ఏటిఎంలను భారతదేశానికి పరిచయం చేసిన ఘనత దక్కించుకుంది. 2007 సెప్టెంబర్ నాటికి ఈ బ్యాంకు 1,289 (గ్రామీణ-396, సెమీ అర్బన్ -376, పట్టణ- 338, మెట్రో-179) బ్రాంచీలతో 99 ఎక్స్‌టెన్షన్ శాఖలతో, 37 శాటిలైట్ ఆఫీసులతో, 505 ఏటిఎంలతో, 22 రాష్ట్రాలలో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించింది.

పెట్టుబడులను రాబట్టడంలో ఆంధ్రాబ్యాంకు ఆసియాలోనే మొదటి స్థానంలో ఉంది. భారతదేశం మొత్తంలో ఈ బ్యాంకుకు 1,30,000 షేర్‌హోల్డర్స్, 1.372 కోట్ల ఖాతాదారులు ఉన్నారు. ప్రారంభం నుండి నేటి వరకు మొత్తం రుణాలలో కనీసం 50 శాతానికి తగ్గకుండా రుణాలను గ్రామీణ భారతానికే అందిస్తుండటం విశేషం. బ్యాంకుల జాతీయికరణ తర్వాత క్రమబద్దంగా నడుస్తున్న జాతీయ బ్యాంకులలో ఇది ప్రధానమైనది. అంతటి ప్రాధాన్యత కలిగిన బ్యాంక్ శత వసంతాల సంబరాలకు సిద్ధమవుతున్న వేళ కనుమరుగు కావడం ఖాతాదారులను కదిలించింది.