డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ
శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ధర్నా

 

కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టాయని డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. ఈ తవ్వకాలతో జీవకోటి మనుగడ ప్రశ్నార్థకమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నల్లమల బంద్‌కు పిలుపునిచ్చిన నాయకులు నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌లో ఆందోళన చేపట్టారు. వందలాది మంది శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై అంబేద్కర్‌ కూడలిలో పెద్దఎత్తున ధర్నా నిర్వహించడంతో రెండుగంటల పాటు ట్రాఫిక్‌ స్తంభించింది. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ నల్లమలలో యురేనియాన్ని బయటకు తీస్తే వాటిద్వారా వచ్చే రేడియేషన్‌, వ్యర్థ పదార్థాల వల్ల వాయు, జలకాలుష్యం కారణంగా పర్యావరణం వినాశనమౌతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుళ జాతి కంపెనీల కాసులకు కక్కుర్తిపడి నల్లమల్లను అమ్ముకోడానికి చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద పులుల అభయారణ్యంగా అమ్రాబాద్‌కు పేరుందన్నారు. యురేనియం ముసుగులో జంతువులను, గిరిజనులను అటవీ ప్రాంతం నుంచి ఖాళీ చేసేందుకు కుట్ర చేస్తున్నాయని వాపోయారు.

తక్షణమే నల్లమలలో యురేనియం తవ్వకాల అన్వేషణ అనుమతులను ఉపహసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. యురేనియం తవ్వకాల వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్‌ నాసరయ్య మాట్లాడుతూ ఆదిమజాతి చెంచులు, వన్యప్రాణులు ఉన్నచోట యురేనియం వెలికితీయడం దుర్మార్గమైన చర్య అన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ లాంటి పట్టణ ప్రాంతాల్లో నల్లమల్ల కంటే యురేనియం నిక్షేపాలు ఎక్కువ ఉన్నాయని తెలిపారు. కానీ ప్రభుత్వాలు ఆ ప్రాంతంలో భూస్వాముల, రాజకీయ నేతల వ్యాపారాలు, ఆస్తులు భవనాలు ఉన్నందువల్ల చేపట్టేందుకు వెనుకడుగు వేస్తున్నాయని చెప్పారు. ఇప్పటికైనా తవ్వకాలను ఆపకుంటే పెద్తఎత్తున ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో అమ్రాబాద్‌ ఎంపీపీ శ్రీనివాసులు, జెడ్పీటీసీ డాక్టర్‌ అనురాధ, యురేనియం వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు నాగయ్య, లక్ష్మీనారాయణ, గోపాల్‌, అంబయ్య, మురళి, మోహన్‌, వెంకటేష్‌ ,మల్లయ్య, నాగేష్‌ వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

(Courtacy Nava Telangana)